రేవంత్‌పై కోమటిరెడ్డి సోదరుల ఫైర్‌

ABN , First Publish Date - 2022-08-06T07:54:47+05:30 IST

ఒకరివెంట ఒకరు కోమటిరెడ్డి సోదరులు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో విడివిడిగా సమావేశం అనంతరం శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశాలు నిర్వహించి తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్‌పై కోమటిరెడ్డి సోదరుల ఫైర్‌

  • ఎప్పట్నుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లను ఇప్పుడు వెళ్లగొడుతున్నారు
  • సోనియా, రాహుల్‌ వద్దనే తేల్చుకుంటా
  • నాకు చెప్పకుండా చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు?
  • ప్రాణం పోయేదాకా కాంగ్రెస్‌లోనే.. బీజేపీలోకి వెళ్తే చెప్పి వెళ్తా
  • షాను వరద సాయం కోరా: ఎంపీ వెంకట్‌రెడ్డి 
  • షా సమక్షంలో 21న హైదరాబాద్‌లో బీజేపీలో చేరుతున్నా: రాజగోపాల్‌రెడ్డి
  • అన్న ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్‌ వ్యాఖ్య
  • ఉప ఎన్నికకు ముందే బీజేపీలోకి వెంకట్‌రెడ్డి?
  • ఎప్పుడు చేరాలన్న విషయమై షాతో చర్చ!
  • షాతో విడివిడిగా కోమటిరెడ్డి సోదరుల భేటీ
  • రాజీనామా చేస్తే ఎంపీ స్థానానికీ ఉప ఎన్నిక
  • ‘కాంగ్రెస్‌ ఖాళీ’ అని తోటి ఎంపీలతో వ్యాఖ్య


న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఒకరివెంట ఒకరు కోమటిరెడ్డి సోదరులు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో విడివిడిగా సమావేశం అనంతరం శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశాలు నిర్వహించి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ నాయకత్వాన్ని ప్రశ్నించారు. మూడేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయితే.. తాను స్టార్‌ క్యాంపెయినర్‌కు పరిమితం కావాలా? అని భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి నిలదీస్తే, రేవంత్‌ను సీఎం చేసేందుకు మేం కష్టపడాలా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంటు భవనంలో షాను కలిశాక వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను రేవంత్‌ వెళ్లగొడుతున్నారని  ఆరోపించారు. ఎవరు ఎక్కడికి వెళ్లినా తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని, ప్రాణం పోయినా కాంగ్రెస్‌లోనే ఉంటానని అంటూనే తనకు భయంలేదని, బీజేపీలోకి వెళ్తే చెప్పి వెళ్తానని చెప్పారు. రేవంత్‌ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి వెధవ పనులు చేస్తే సోనియా, రాహుల్‌గాంధీ వద్ద తేల్చుకుంటానని స్పష్టం చేశారు.


 కాగా, దాసోజు శ్రవణ్‌ వంటి మేధావులను రేవంత్‌ పంపించివేస్తున్నారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శ్రవణ్‌ పార్టీ మార్పునకు రేవంత్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ‘‘2, 3 డిగ్రీలు ఎండ ఎక్కువ కొడితే తేలిపోయే కేసులను పట్టుకుని పార్టీని ఏం చేద్దామనుకుంటున్నాడు? శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి ఎప్పుడైనా ఆయన పక్కన ఉన్నారా? మంచి పేరు ఉన్నవాళ్లు ఆయనతో ఉండొద్దు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అందరూ విడిచిపెట్టి వెళ్తే పాత టీడీపీ వాళ్లను తెచ్చి టికెట్లు ఇస్తారని ఆరోపించారు. 34 ఏళ్లుగా పార్టీ కోసం రక్తం ధారబోశామని.. తమకు కూడా చీము నెత్తురు ఉందని, అవమానకరంగా మాట్లాడడం సరికాదని వెంకటరెడ్డి హెచ్చరించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు.. తనకు పడని వాళ్లను చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీ అయిన తనను సంప్రదించకుండానే సభ ఏర్పాటు చేయడమే కాక తనను ఓడించడానికి ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను.. తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకున్నారని, ఆయనతో కలిసి నేను చండూరు సభలో పాల్గొనాలా? అని ప్రశ్నించారు.  


హుజూరాబాద్‌లో అలా? ఇక్కడ ఇలానా?

మునుగోడులో శుక్రవారం కాంగ్రెస్‌ సభకు ఎందుకు హాజరవలేదని వెంకటరెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ‘ప్రజా సమస్యలు ముఖ్యం. పార్టీ కూడా ముఖ్యమే. గతేడాది జూన్‌ 26న రేవంత్‌ పీసీసీ అఽధ్యక్షుడిగా నియమితులయ్యారు. జూలై 2న హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. నవంబరులో ఉప ఎన్నిక జరిగింది. ఈ వ్యవధిలో గజ్వేల్‌, రావిర్యాల, ఇంద్రవెల్లి వంటి అవసరం లేనిచోట దళిత దండోరా సభలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక ఉంటుందని తెలిసి కూడా హుజూరాబాద్‌ అభ్యర్థిపై కసరత్తు చేయలేదు. కార్యకర్తల సమావేశం నిర్వహించలేదు? బహిరంగ సభ నిర్వహించలేదు? రాజగోపాల్‌రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వడానికి ఇంకా స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదు. పార్లమెంటు సమావేశాలున్నందున ఎలాగూ నేను రాలేనని, తద్వారా నన్ను బదనాం చేయాలని భావించారు’’ అని వివరణ ఇచ్చారు. ‘‘హుజూరాబాద్‌లో ఒక లెక్క ఇక్కడ ఒక లెక్కనా.? నామినేషన్‌ చివరి రోజు పెద్దపల్లికి చెందిన సీఎం కేసీఆర్‌ సామాజిక వర్గం వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. బీజేపీకి ప్రయోజనం చేకూరేలా చేశారు’’ అని ఆరోపించారు.


మునుగోడులో గెలుపెవరిదో తెలుసు

మునుగోడులో ఎవరు గెలుస్తారని విలేకరులు వెంకట్‌రెడ్డిని ప్రశ్నించగా ‘అక్కడి ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకు మాత్రం ఎవరు గెలుస్తారో తెలుసు’ అని సమాధానమిచ్చారు. ఈడీ వేధింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిర్వహించిన ఆందోళనలో ఎందుకు పాల్గొనలేదని అడగ్గా ‘తెలంగాణ నుంచి ముగ్గురం ఎంపీలం ఉన్నాం. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. యంగ్‌ ఇండియా కార్యాలయాన్ని సీజ్‌ చేస్తే నేను ఒక్కడినే వెళ్లి ధర్నా చేశాను’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇటీవలి వర్షాలకు నష్టపోయినవారికి ఆర్థిక సాయం చేయాలని అమిత్‌ షాను కోరినట్లు వెంకట్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాలేదని, త్వరలో బృందాలను పంపిస్తామని షా హామీ ఇచ్చారని వెల్లడించారు. 


21న చేరుతున్నా: రాజగోపాల్‌రెడ్డి

‘రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మేము కష్టపడాలా? కాంగ్రెస్‌ నాయకత్వంపై నమ్మకం పోయింది. బాధతో ఆ పార్టీని వీడుతున్నా. ఈ నెల 21న హైదరాబాద్‌లో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో అమిత్‌ షాను కలిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో  రాజగోపాల్‌ విలేకరులతో మాట్లాడారు. గత నెల 20న షాను కలిసినప్పుడు బీజేపీలోకి ఆహ్వానించిన విషయం వాస్తమే కానీ.. రాజీనామా, పార్టీ మారే అంశం చర్చకు రాలేదన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తతో నియోజకవర్గ ప్రజల్లో తన రాజీనామాపై చర్చ జరిగిందన్నారు. ‘‘నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని ప్రజలు, నాయకులు ఇచ్చిన సూచన మేరకే పదవికి, కాంగ్రె్‌సకు రాజీనామా చేశా. నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన కొందరు నేతల సూచన, కోరిక మేరకు బీజేపీలోకి వెళ్తున్నా. స్పీకర్‌ 8వ తేదీ వరకు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరికితే అదే రోజు స్వయంగా వెళ్లి రాజీనామా సమసర్పిస్తా. లేకుంటే అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా సమర్పిస్తా. నా రాజీనామా ద్వారా ఉప ఎన్నిక వస్తే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు జరుగుతాయి. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మునుగోడు ఇచ్చే చరిత్రాత్మక తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తుందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. పార్టీ మార్పు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచన మేరకు అమిత్‌ షాను కలిశా. ఈ నెల 21న ఆయన హైదరాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చారు’’ అని రాజగోపాల్‌ వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రె్‌సలోని మంచి నేతలంతా బయటికొస్తారని చెప్పారు. చేరికల సభ ఎక్కడనేదానిపై రాష్ట్ర నాయకత్వంతో చర్చించి చెబుతామన్నారు.


అన్న ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు

నిజమైన కాంగ్రెస్‌ వాదులు ఎవరికీ ఇప్పుడున్న నాయకత్వంపై ఎవరికీ నమ్మకం లేదని, తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి కాంగ్రెస్‌ పార్టీ వెళ్లిపోయిందని రాజగోపాల్‌ ధ్వజమెత్తారు. బయటినుంచి వచ్చిన, డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడానికి తాము పని చేస్తున్నామా? అనే భావన కార్యకర్తల్లో ఉందన్నారు. ‘నేను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా? లేదంటే పీపీసీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకో?’ అని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు ‘రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చెరుకు సుధాకర్‌ను సమాచారం లేకుండా చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అందుకే చండూరు సభకు వెళ్లలేదు. తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. తీసుకోవాలని కూడా నేను సూచిస్తున్నా’ అని జవాబిచ్చారు. 2014-2018 మధ్యలో టీఆర్‌ఎస్‌ వాళ్లు ఐదుసార్లు అడిగినా ఆ పార్టీలోకి వెళ్లలేదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి టీఆర్‌ఎస్‌ భయపడుతూ తనపై ఆరోపణలు చేయిస్తోందన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాట్లు తెలిపారు.

Updated Date - 2022-08-06T07:54:47+05:30 IST