పార్టీ మారలేదని నెలకో కేసు

ABN , First Publish Date - 2021-08-04T05:29:58+05:30 IST

పార్టీ మారలేదనే కారణంతో తమపై అధికార పార్టీకి చెందిన వారు అక్రమ కేసులు బనాయిస్తున్నారని కోమటినేనివారిపాలేనికి చెందిన మహిళలు వాపోయారు.

పార్టీ మారలేదని నెలకో కేసు
సమావేశంలో పాల్గొన్న కోమటినేనివారిపాలెం ఎస్సీ మహిళలు, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు

దళిత మహిళల ఆవేదన

చిలకలూరిపేట, ఆగస్టు 3: పార్టీ మారలేదనే కారణంతో తమపై అధికార పార్టీకి చెందిన వారు అక్రమ కేసులు బనాయిస్తున్నారని కోమటినేనివారిపాలేనికి చెందిన మహిళలు వాపోయారు. చిలకలూరిపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా ఎస్సీ నాయకులతో కలసి మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బాధిత మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చారు. కోమటినేనివారిపాలెంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌గా గెలిచిన టీడీపీ సానుభూతిపరుడు అరిగెల దేవదానంపై అధికారపార్టీలో చేరాలని తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. దేవదానం పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో అతనితోపాటు అతని బంధువులపైన వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. సర్పంచ్‌గా గెలిచి ఆరునెలలు గడవకముందే నెలకు ఒక్క కేసు చొప్పున అధికారపార్టీ నేతలు అతనిపై బనాయించారన్నారు. ఈ క్రమంలోనే మూడురోజుల క్రితం ద్విచక్రవాహనంపై మద్యం మత్తులో కిందపడిన వ్యక్తిని పైకి లేపి నీళ్లు తాగిస్తే తమపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వాపోయారు. పార్టీ మారని దళితులపై ఇలా భౌతిక దాడులు, అక్రమ కేసులు పెట్టి బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు.  సంఘటనను పారదర్శకంగా విచారించి న్యాయం చేయాలని బాధిత మహిళలు అరిగెల దీనమ్మ, నారాయణమ్మ, కోటమ్మ, సుజాతలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు ఇనగంటి జగదీష్‌బాబు, కొండా వీరయ్య, జరుగుమల్లి చెన్నయ్య, మద్దుమాల రవి, బడుగు జాకబ్‌రాజు, గేరా రాజశేఖర్‌, లెనిన్‌, పిల్లి కోటి, బెజ్జం రవి, మూకిరి వీరాంజనేయులు, బొంతా వేణు, ఏసయ్య, గట్టుపల్లి మాణిక్యరావు, దార్ల రాజేష్‌, ఖమ్మంపాటి ప్రతాప్‌, తాడిమళ్ల సుందరయ్య, దావల రవికుమార్‌, కాసిమళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-04T05:29:58+05:30 IST