Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 08 Aug 2022 12:34:09 IST

Munugodu: మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు ఉండొచ్చంటే.. కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలివి..

twitter-iconwatsapp-iconfb-icon
Munugodu: మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు ఉండొచ్చంటే.. కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలివి..

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ఎమ్మెల్యే పదవికి కూడా సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నేరుగా కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక (Munugode By Election) అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉండబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే మునుగోడులో నిలబెట్టే అభ్యర్థిపై కసరత్తు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం ఏంటంటే.. నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగనుండటంతో మునుగోడు ఉప ఎన్నిక కూడా నవంబర్‌లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) యోచిస్తున్నట్లు తెలిసింది.


ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నిక అంశం రోజురోజుకూ వేడెక్కుతోంది. బహిరంగ సభతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బోణీ చేయగా, ఈనెల 21 చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌కు తెరలేపింది. హుజూరాబాద్‌లో హడావుడి చేసి బోర్లాపడ్డ అనుభవంతో స్థానికంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మంత్రి జగదీష్‌రెడ్డి మూడు నెలలగా ఈ ఏర్పాట్లు గుంభనంగా చేసుకుంటూ వస్తున్నారు. నేడో, రేపో తెరవెనుక టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు బహిరంగం కానున్నాయి.


21న చౌటుప్పల్‌లో బీజేపీ సభ

అనుకున్నట్టుగానే ఈ నెల మొదటి వారంలోనే రాజీనామా ప్రకటన చేసిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికకు సంబంధించి చకచకా పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు డైలమాలో ఉండటం, కాంగ్రెస్‌ శ్రేణులు గంపగుత్తగా వస్తాయా అనే సందేహాల నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకే రాజగోపాల్‌రెడ్డి నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్‌‌కు రాజీనామా చేస్తూ అధ్యక్షురాలు సోనియాకు లేఖ పంపారు. అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ అయి, ఈనెల 21న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చౌటుప్పల్‌లో 3లక్షల మందితో సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు రాజగోపాల్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల నుంచి భారీగా చేరికలు ఉండనున్నాయి. ఈనెల 7న చండూరులో ఆయన పర్యటించనున్నారు.


ఉత్సాహం నింపిన సభ

కాంగ్రెస్‌కు బలమైన నియోజకవర్గంగా ఉన్న మునుగోడులో పట్టు నిలుపుకునేందుకు శుక్రవారం నిర్వహించిన సభ విజయవంతం కావడం ఆ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజగోపాల్‌ రాజీనామాతో పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్న అంచనాలో ఉండగా, వాటిని బ్రేక్‌ చేస్తూ సభ జరిగింది. ఉప ఎన్నికలో గెలుపు కోసం ఊరూరా తిరుగుతానని, ప్రతీ యువకుడిని కలుస్తానని రేవంత్‌ ప్రకటించారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి అందుబాటులోకి రావడం కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. కొద్ది రోజుల్లోనే ఐదుగురు సభ్యులతో కూడిన వ్యూహ, ప్రచార కమిటీ నియోజకవర్గంలో మకాం వేయనుంది. దీంతో రోజురోజుకూ ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది.


టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెస్తాడన్న సమాచారం అధికార టీఆర్‌ఎస్‌కు ఆరునెలల మందు నుంచే ఉంది. ఈ క్రమంలోనే ఆయన కదలికలపై టీఆర్‌ఎస్‌ నిఘా పెట్టింది. తనకు సూర్యాపేట ఎంతో మునుగోడు అంతే అంటూ స్థానికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వ్యవహారాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తన చేతిలోకి తీసుకున్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ, దళితబంధు పథకం ప్రచారం వంటి కార్యక్రమాలకు స్వయంగా మంత్రి హాజరయ్యారు. మరో వైపు నియోజకవర్గంలో ఉన్న గ్రూపు తగాదాలను దారికి తెచ్చేందుకు పని ప్రారంభించారు. అన్ని మండలాల అధ్యక్షులు, కీలక ప్రజాప్రతినిధులతో మంత్రి నేరుగా సంబంధాలు ఏర్పరుచుకొని కాంగ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో వలసలను ప్రోత్సహించారు. ఒక వైపు ప్రభుత్వ యంత్రాంగం, మరో వైపు పార్టీ వ్యవస్థ తన నియంత్రణలోకి వచ్చేలా పనిచేశారు. అక్కడ పేరుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయినా, వ్యవహారమంతా అధికార టీఆర్‌ఎ్‌సదే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిణామాలు మింగుడుపడని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పలు వేదికలపై మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్‌ చేశారు. చౌటుప్పల్‌ సమావేశంలో మంత్రి చేతిలోంచి రాజగోపాల్‌రెడ్డి మైక్‌ లాక్కోవడం వివాదస్పదమైంది. 


రాజగోపాల్‌ రాజీనామా ఖరారైనా, ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి ప్రకటనలు లేకుండా వ్యూహాత్మక మౌనం పాటించారు. ఓవైపు పార్టీ, ఇతర పార్టీల బలాబలాలు, అభ్యర్థి ఎవరైతే మంచిది, ఎదుటి అభ్యర్థులు ఎవరు, వారి బలాలు, బలహీనతలపై సర్వేలు, ఫ్లాష్‌ సర్వేలు చేసుకుంటూ గట్టుప్పల్‌ మండల ప్రకటన చేసి సైలంట్‌గా ఉన్నారు. కొన్ని నెలలుగా మంత్రి జగదీష్ రెడ్డి చేసిన  ప్రయత్నాలు నేడో, రేపో బహిర్గతం కానున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడినా, మునుగోడు గురించి మాట మాత్రంగానైనా ఉచ్ఛరించకపోవడం ఆ పార్టీ సైలెంట్‌ ఆపరేషన్‌ను స్పష్టం చేస్తోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.