గణిత జగత్తులో తెలుగు కీర్తి

ABN , First Publish Date - 2020-11-20T06:44:48+05:30 IST

గణిత మేథావిగా దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన కొమరవోలు చంద్రశేఖరన్‌ (కెసి) మన తెలుగువాడు. భారత గణిత శాస్త్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చినవారిలో ఆయన ఎన్నదగిన వ్యక్తి. గణిత శాస్త్ర రంగానికి ఆయనచేసిన సేవ అసామాన్యమైనది....

గణిత జగత్తులో తెలుగు కీర్తి

గణిత మేథావిగా దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన కొమరవోలు చంద్రశేఖరన్‌ (కెసి) మన తెలుగువాడు. భారత గణిత శాస్త్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చినవారిలో ఆయన ఎన్నదగిన వ్యక్తి. గణిత శాస్త్ర రంగానికి ఆయనచేసిన సేవ అసామాన్యమైనది. విశ్లేషణాత్మక సంఖ్యా సిద్ధాంతంలో ఆయన నిష్ణాతులు. గణితశాస్త్ర బోధనకు, పరిశోధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. గణితశాస్త్రానికి సంబంధించి అనేక పుస్తకాలు రాశారు. ఎందరో విద్యార్థులను గణిత శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్ది ప్రతిభకు తగిన గుర్తింపు లభించేట్టు చేశారు. అంతర్జాతీయ గణిత కొలీజియం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. భారత ప్రభుత్వ సైంటిఫిక్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా దేశ విజ్ఞానశాస్త్ర విధానానికి రూపకల్పన చేశారు.


అంతర్జాతీయ గణిత సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, సొసైటీ జర్నల్‌ సంపాదకుడిగా సుదీర్ఘకాలం వ్యవహరించారు. 1920 నవంబరు 21న మచిలీపట్నంలో జన్మించిన ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో గణితంలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు. సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త రామానుజమ్‌ సహాధ్యాయి డా. ఆనంద రౌ నేతృత్వంలో పీహెచ్‌డి పట్టా పొందారు. డాక్టరేట్‌ పొందిన తరువాత అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ సంస్థలో చేరారు. ఈయన ప్రతిభ తెలుసుకున్న హోమీ భాభా ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చి (టీఐఎఫ్‌ఆర్‌)’ లో చేరవల్సిందిగా ఆహ్వానించారు. భాభా ఆహ్వానాన్ని మన్నించిన కెసి, టీఐఎఫ్‌ఆర్‌లో స్కూల్‌ ఆఫ్‌ మేథమేటిక్స్‌కు అంకురార్పణ చేసి, దానిని ప్రతిష్ఠాత్మక సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ గణితశాస్త్రజ్ఞులను ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించేవారు. గణితశాస్త్రంలో ఎందరినో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారు. కెసి ఆధ్వర్యంలో రూపొందిన ఉపన్యాస సూచీలు ప్రపంచ గణిత సమాజంలో గొప్ప ఖ్యాతిని ఆర్జించాయి. రామానుజమ్‌ అముద్రిత నోట్సును ప్రచురించి, ఆయన కృషిని కెసి కొనసాగించారు. టీఐఎఫ్‌ఆర్‌లో పదహారు సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1965లో స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో గణితశాస్త్ర ఆచార్య పదవిని చేపట్టారు. 1988లో ఉద్యోగ విరమణ చేసి అక్కడే తన శేష జీవితాన్ని గడిపారు. 2017లో కన్ను మూశారు. (నవంబరు 21న కెసి శతజయంతి)


డా. పి.సి. సాయిబాబు

Updated Date - 2020-11-20T06:44:48+05:30 IST