Krishna district: మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన Kollu Ravindra

ABN , First Publish Date - 2022-07-06T16:46:05+05:30 IST

సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతు అయిన మత్స్యకార కుటుంబాలను టీడీపీ నేత కొల్లు రవీంద్ర పరామర్శించారు.

Krishna district: మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన Kollu Ravindra

కృష్ణా (Krishna) జిల్లా: సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతు అయిన మత్స్యకార కుటుంబాలను టీడీపీ నేత, మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర (Kollu Ravindra) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం (Machilipatnam)లో మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల కోసం గాలింపు‌ చర్యలు కొనసాగుతున్నాయని, ఇంకా ముందుగా అధికార యంత్రాంగం స్పందిస్తే బాగుండేదన్నారు. టీడీపీ (TDP) హయాంలో గిలికకదిండి వద్ద ఇలాగే గల్లంతు అయ్యారని, జీపీయస్ (GPS) విధానం ద్వారా వారి ఆచూకీ తెలుసుకుని రక్షించారన్నారు. చిన్న బోట్లకు జీపీయస్ పెట్టాలని కోరినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఐదు రోజులుగా ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, వారి జీవనానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు‌ చేయాలని కోరారు. బ్లాంక్ మెసేజ్ చేరిందని అధికారులు చెబుతున్నారన్నారు. గల్లంతు అయిన మత్స్యకారులు క్షేమంగా ఇళ్లకు‌ చేరుకుంటారని ఆశిస్తున్నానన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కూడా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టేలా చూడాలని కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.


కాగా సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌, నేవీ, మెరైన్‌ పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేశారని కలెక్టర్‌ రంజిత్‌బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 2వతేదీన రెండు బోట్లలో క్యాంప్‌బెల్‌ పేటకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది వద్ద ఐఎన్‌డీ-ఏపీ-కే2-ఎంవో-60ఫైల్‌నెంబరు ఏపీ-3469 నెంబరుతో ఉన్న ఫైబర్‌బోటు ఇంజను మరమ్మతుకుగురై నిలిచిపోయిందన్నారు. బోటులో విశ్వనాథపల్లి చినమస్తాన్‌, చిననాంచారయ్య, చెక్కా నరసిహారావు, మోకా వెంకటేశ్వరరావు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నేవీ అధికారులు చాపర్‌తో గల్లంతైన వారికోసం మంగళవారం నాలుగు గంటపాటు గాలించారని తెలిపారు. కోస్ట్‌గార్డుకు చెందిన వీరా, ప్రియదర్శిని అనే రెండుబోట్లు వీరి ఆచూకీకోసం గాలిస్తున్నాయని తెలిపారు. బుధవారం మరో చాపర్‌ను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. జేసీ మహేశ్‌కుమార్‌ ఎప్పటికపుడు నేవీ, కోస్ట్‌గార్డ్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా మత్యకారుల ఆచూకీని కనుగొంటామని, గల్లంతైన మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 

Updated Date - 2022-07-06T16:46:05+05:30 IST