Abn logo
Sep 22 2021 @ 00:17AM

కొల్లాయి గాంధీకి వందేళ్లు

గాంధీజీ విద్యార్థిగా ఇంగ్లాండులో సూటు, బూటు, హ్యాటులతో పూర్తిగా ఆంగ్లేయుల వేషధారణను అనుసరించారు. తర్వాత దక్షిణాఫ్రికాలో బారిష్టరుగా తలపాగా ధరించారు. 1915లో భారతదేశం వచ్చాక కొంతకాలం గుజరాతీ వేషధారణను పాటించారు. తర్వాత విదేశీ వస్త్ర బహిష్కరణ చేపట్టి మిల్లు వస్త్రాలు విడనాడి, చేతితో నేసిన ఖాదీ దుస్తులు ధరించడం ప్రారంభించారు. రాట్నంతో నూలు వడకడం నేర్చుకున్నారు. 


మొదటి నుంచీ గాంధీజీ సరళంగా, నిరాడంబరంగా జీవించేవారు. మిత వ్యయం, సేవా ప్రవృత్తి త్యాగనిరతి వంటి భావనలు చిన్ననాటి నుంచి ఆయన మనసులో నాటుకుపోయాయి. ఒకసారి రాయలసీమలో రైలులో ప్రయాణం చేస్తూ గాంధీజీ కిటికీ లోంచి పొలాలు దున్నుతున్న రైతులను చూశారు. మొల చుట్టూ అంగవస్త్రాన్ని మాత్రమే ధరించి, వారు పనిచేస్తున్న దృశ్యం ఆయన మదిలో బలంగా నాటుకుంది. ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలేని భారతీయుల దుస్థితికి ఆయన బాధపడ్డారు. ఈ దేశ దౌర్భాగ్యచిహ్నంగా తాను కూడా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించి, అర్ధనగ్నంగా జీవించాలని గాంధీజీ అప్పుడే కృతనిశ్చయులయ్యారు. అలా గాంధీజీ ఆ నిర్ణయానికి రావడానికి తెలుగురైతులు స్ఫూర్తినందించడం విశేషం.


1921 సెప్టెంబర్‌ 21న గాంధీజీ మద్రాసు నుంచి మధురైకి రైలులో బయల్దేరారు. ఆయన ఎక్కిన పెట్టెలో అందరూ విదేశీ దుస్తుల్లో ఉండడం గమనించారు. వారితో మాట కలిపి, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి వారికి చెప్పబోయారు. ‘మేము చాలా పేదవారం, ఖాదీ చాలా ఖరీదు, మేము కొనలేం’ అని వారు బదులిచ్చారు. విదేశీ వస్త్రాల్ని త్యజించాలి. ఖాదీ ఖరీదు అయితే ఇక దేశ ప్రజలు ఏ దుస్తుల్ని ధరించాలనే ఆలోచనలో పడిపోయారు గాంధీజీ. ఆ ఆలోచనే అంతకుముందు ఆయన తీసుకున్న నిర్ణయానికి బలం చేకూర్చింది. కోట్లాదిమంది ప్రజలతో మమేకం కావడానికి తాను కూడా అంగవస్త్రాన్ని మాత్రమే ధరించాలని గాంధీజీ దృఢనిశ్చయానికి వచ్చారు. రామనాథపురం సభలో పాల్గొనడానికి వచ్చిన గాంధీజీ మధురైలోని పడమటిమాసి వీథిలోని రామ్‌జీ కళ్యాణ్‌జీ గృహంలో బస చేశారు. మరునాడు, అంటే సరిగ్గా వందేళ్ల క్రితం, 1921 సెప్టెంబర్‌ 22న తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నుంచి అంగవస్త్రం, కండువా వేసుకుని, స్వాతంత్య్రం వచ్చేవరకు అర్ధనగ్నంగా జీవించదలిచినట్లు చెప్పారు. తాను ఆ నిర్ణయాన్ని అంతకుముందే తీసుకున్నా, దానిని అమలుపరచడానికి మధురై తనకు తగిన బలాన్ని ఇచ్చిందని గాంధీజీ ప్రకటించారు. ఆ వేషధారణతోనే రామనాథపురం బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన కారుని కామరాజర్‌సలామ్‌ వద్ద ఆపారు. అక్కడ ఆ వేషధారణతో మొట్టమొదటిసారిగా ప్రజలకు దర్శనమిచ్చారు గాంధీజీ. తర్వాత ఆ ప్రాంతంలోనే అర్ధనగ్న దుస్తులతో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ‘గాంధీ పొట్టల్‌’గా పిలుస్తున్నారు. ఆనాడు బసచేసిన ఇల్లు నేడు ఖాదీ ఎంపోరియంగా అలరారుతోంది. ఆ విధంగా తన వస్త్రధారణను కూడ జాతీయోద్యమంలో భాగం చేయగలిగారు గాంధీజీ. కొల్లాయి కట్టడం ద్వారా వలసవాద చిహ్నాలయిన కోటు, టోపీలను త్యజిస్తున్నానని ప్రకటించారు. అలాగే మనదేశ వాతావరణానికి ఆ వస్త్రధారణ సరిపోతుందని చెప్పారు. తన అనుచరులు ఎవరూ ఇలాంటి వేషధారణ చేయవలసిన అవసరం లేదని గాంధీజీ స్పష్టం చేశారు. ఆ విధంగా ఆయన నిజమైన ప్రజాప్రతినిధిగా నిలిచారు.


లండన్‌లోని బకింగ్‌హామ్‌ భవంతిలో ఐదవ జార్జి చక్రవర్తిని కలవడానికి వెళ్లినప్పుడు కూడ గాంధీజీ అదే వస్త్రధారణతో వెళ్లారు. ఇలాంటి చాలీచాలని దుస్తుల్లోనే వెడతారా అని ఆయనను మీడియా మిత్రులు ప్రశ్నించారు. ‘మా ఇద్దరికీ సరిపడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’ అని వారికి చురక అంటించారు. ఈ అరకొర దుస్తులనే చివరి వరకు ధరించి, భారత స్వాతంత్రోద్యమాన్ని నడిపించి, ప్రపంచ పాలకవర్గాలను గాంధీజీ విస్మయపరిచారు. అంతర్గతంగా తనలో ఉన్న భావవిప్లవాన్ని అర్ధనగ్న వస్త్రధారణ ద్వారా బహిరంగంగా ఆవిష్కరించారు. కోట్లాదిమంది భారతీయులు కట్టుకోవడానికి బట్టలు లేక బాధపడుతున్న పరిస్థితుల్లో వారి దైన్యస్థితికి తాను ప్రతినిధిగా నిలిచారు. గాంధీజీ కొల్లాయిధారణ దేశానికి ఎంతో మేలు చేసింది. స్వేచ్ఛాప్రతీకగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బహుళ ఆదరణ పొందింది. భారతీయుల మనసులను గెలుచుకుంది.


ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని చర్చిల్‌ గాంధీజీని ‘అర్ధనగ్న ఫకీరు’ అని హేళన చేశాడు. అయినా దానిని గాంధీజీ పొగడ్తగానే స్వీకరించారు.

డా. పి.సి. సాయిబాబు