కోల్‌కతాను సూపర్‌గా గెలిపించిన ఫెర్గ్యూసన్

ABN , First Publish Date - 2020-10-19T01:42:40+05:30 IST

ఐపీఎల్‌లో నేడు మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అబుదాబిలో హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు పలు మలుపులు తిరిగి

కోల్‌కతాను సూపర్‌గా గెలిపించిన ఫెర్గ్యూసన్

అబుదాబి: ఐపీఎల్‌లో నేడు మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అబుదాబిలో హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు డ్రాగా ముగియగా, సూపర్ ఓవర్‌లో ఫెర్గ్యూసన్ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.


సూపర్ ఓవర్‌ వేసేందుకు బంతి అందుకున్న కోల్‌కతా బౌలర్ ఫెర్గ్యూసన్ అదరగొట్టాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పిన వార్నర్‌ను తొలి బంతికే బౌల్డ్ చేయడంతో కోల్‌కతా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. రెండో బంతికి సమద్ రెండు పరుగులు చేయగా, మూడో బంతికి బౌల్డయ్యాడు. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం మూడు పరుగుల విజయ లక్ష్యంతో కార్తీక్, మోర్గాన్ క్రీజులోకి వచ్చారు. రషీద్ వేసిన తొలి బంతి డాట్ బాల్ కాగా, రెండో బంతికి మోర్గాన్ ఒక్క పరుగు చేశాడు. మూడో బంతి మళ్లీ డాట్ బాల్ కావడంతో టెన్షన్ మొదలైంది. అయితే, లెగ్‌బై అయిన నాలుగో బంతికి కార్తీక్ రెండు పరుగులు చేయడంతో విజయం వశమైంది.


అంతకుముందు శుభ్‌మన్ గిల్ (36), త్రిపాఠి (23), నితీశ్ రాణా (29), మోర్గాన్ (34), కార్తీక్ (29) రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ కీలక వికెట్లను కోల్పోవడంతో కోల్‌కతా విజయం ఖాయమని తేలిపోయింది. అయితే, డేవిడ్ వార్నర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా, రసెల్ వేసిన తొలి బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించింది. అయితే, రషీద్ ఖాన్ ఫ్రీహిట్‌ను ఉపయోగించుకోలేకపోవడంతో ఒక్కే ఒక్క పరుగు వచ్చింది.


స్ట్రైక్‌లోకి వచ్చిన వార్నర్ ఆ తర్వాతి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. దీంతో మిగిలిన మూడు బంతుల్లో విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.  తిరిగి నాలుగో బంతిని కూడా వార్నర్ బౌండరీకి తరలించడంతో హైదరాబాద్ విజయం ఖాయమనే అనుకున్నారు. ఐదో బంతికి రెండు పరుగులు రావడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఆఖరు బంతికి ఒకే ఒక్క పరుగు రావడంతో స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా సూపర్ ఓవర్ అనివార్యమైంది. అద్భుత బౌలింగుతో కోల్‌కతాను గెలిపించిన ఫెర్గ్యూసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2020-10-19T01:42:40+05:30 IST