కరోనా లాక్‌డౌన్: కారు ఆపిన పోలీసు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువతి

ABN , First Publish Date - 2020-03-26T23:50:29+05:30 IST

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తన కారును అడ్డుకున్నందుకు ఓ యువతి తీవ్ర అభ్యంతరకరంగా...

కరోనా లాక్‌డౌన్: కారు ఆపిన పోలీసు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువతి

కోల్‌కతా: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తన కారును అడ్డుకున్నందుకు ఓ యువతి  తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించింది. బయటికి ఎందుకొచ్చారంటూ అడిగిన పాపానికి ఓ పోలీసు అధికారి యూనిఫామ్‌ను నాకుతూ అసభ్యంగా వ్యవహరించింది. పోలీసులతో పాటు స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసిన ఈ ఘటన కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు ఎవరూ బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే సాల్ట్ లేక్ ప్రాంతంలో ఓ యువతి, తన సహచరుడితో కలిసి క్యాబ్‌లో ప్రయాణిస్తూ పోలీసుల కంటపడింది. దీంతో కారు ఆపిన ఓ పోలీస్ అధికారి ‘‘ఎక్కడికి వెళ్తున్నారంటూ’’ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతుండగానే సదరు యువతి బూతుల తిడుతూ బయటికి వచ్చింది. ‘‘బయటికి ఎందుకొచ్చారు.. ఎక్కడికి వెళ్తున్నారు..’’ అని సదరు అధికారి ఎంత అడిగినా పట్టించుకోకుండా గొడవకు దిగింది. అందరూ చూస్తుండగానే ఆయన మీదికి దూసుకొచ్చి యూనిఫామ్‌కు ఉమ్మిరాసింది. దీంతో అక్కడున్న పోలీసులంతా కంగుతిన్నారు. సహచరుడు కారు నుంచి దిగి ఆమెను వారించినా ప్రయోజనం లేకపోయింది.


పోలీసులు గట్టిగా నిలదీయడంతో తాను ఒంటరిగా ఉంటాననీ.. ఒంట్లో బాగోలేదని చెప్పుకొచ్చింది. తాను మెడికల్ షాప్‌కి వెళ్లకపోతే మందులెవరు తీసుకొస్తారంటూ ప్రశ్నించింది. అయితే ఆమె మందుల షాపునకు వెళ్తున్నానని చెప్పినప్పటికీ.. కనీసం ప్రిస్క్రిప్సన్ చూపించలేదని పోలీసులు పేర్కొన్నారు. నిషేదాజ్ఞలను ఉల్లంఘించడంతో పాటు, ఓ ప్రభుత్వ అధికారి విధులకు భంగం కలిగించినందుకు ఆమెను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆమెతో పాటు ఆమె సహచరుడు, డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశారు.  ఈ సంఘటన తమను ‘షాక్‌కి’ గురిచేసిందని బిధాన్నగర్ కమిషనరేట్ పేర్కొంది. కాగా సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా కలవరపరిచే సంఘటన. అసమ్మతి ఉంటే ఉండొచ్చు.. కానీ ఇతరుల క్షేమం కోసం పనిచేస్తున్న ఒకరి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదు..’’ అని పేర్కొన్నారు. 



Updated Date - 2020-03-26T23:50:29+05:30 IST