భళా ఫెర్గూసన్‌

ABN , First Publish Date - 2020-10-19T08:50:27+05:30 IST

పేసర్‌ ఫెర్గూసన్‌ (3/15) సంచలన బౌలింగ్‌తో కోల్‌కతా ‘సూపర్‌’ విజయాన్ని అందుకొంది.

భళా ఫెర్గూసన్‌

కోల్‌కతా థ్రిల్లింగ్‌ విజయం

సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్‌ ఓటములు

పోరాడిన వార్నర్‌


అబుదాబి: పేసర్‌ ఫెర్గూసన్‌ (3/15) సంచలన బౌలింగ్‌తో కోల్‌కతా ‘సూపర్‌’ విజయాన్ని అందుకొంది. ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 163/5 స్కోరు చేసింది. మోర్గాన్‌ (34), కార్తీక్‌ (29 నాటౌట్‌) రాణించారు. నటరాజన్‌ (2/40) రెండు వికెట్లు పడగొట్టాడు. వార్నర్‌ (33 బంతుల్లో 5 ఫోర్లతో 47 నాటౌట్‌) పోరాడడంతో.. ఛేదనలో సన్‌రైజర్స్‌ ఓవర్లన్నీ ఆడి 163/6 స్కోరుతో టై చేసింది. కానీ, సూపర్‌ ఓవర్‌లో వార్నర్‌, సమద్‌ను ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఫెర్గూసన్‌ అవుట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ 2 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా 4 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించింది. కాగా, ఇది సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్‌ ఓటమి.


పోరాడిన వార్నర్‌..:

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కినా.. ఫెర్గూసన్‌ దెబ్బకు గాడితప్పింది. బెయిర్‌స్టోకు జతగా వచ్చిన విలియమ్సన్‌ (29) ధాటిగా ఆడడంతో పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 58 పరుగులు చేసింది. అయితే, సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఫెర్గూసన్‌.. విలియమ్స్‌తోపాటు గార్గ్‌ (4), మనీష్‌ పాండే (6)ను అవుట్‌ చేసి హైదరాబాద్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ధాటిగా ఆడుతున్న బెయిర్‌స్టో (36)ను చక్రవర్తి క్యాచ్‌ అవుట్‌ చేయగా.. విజయ్‌ శంకర్‌ (7)ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు.


అయితే, కెప్టెన్‌ వార్నర్‌ క్రీజులో ఉండడంతో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. అతడికి సమద్‌ (23) సహకారం అందించాడు. చివరి 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా.. 19వ ఓవర్‌లో సమద్‌ వికెట్‌ చేజార్చుకున్న హైదరాబాద్‌ 12 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా.. రస్సెల్‌ బౌలింగ్‌లో వార్నర్‌ మూడు వరుస ఫోర్లతో అదరగొట్టాడు. గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. ఒక్క రన్‌ రావడంతో మ్యాచ్‌ టై అయింది. 


ఆదుకొన్న కార్తీక్‌, మోర్గాన్‌..:

సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. దినేష్‌ కార్తీక్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో కోల్‌కతాకు గౌరవప్రద స్కోరు అందించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 58 రన్స్‌ జోడించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆట సాదాసీదాగా సాగింది. ఓపెనర్లు గిల్‌ (36), త్రిపాఠి (23) షాట్లు ఆడడానికే ఇబ్బందిపడ్డారు. త్రిపాఠిని బౌల్డ్‌ చేసిన నటరాజన్‌.. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు.


రాణా (29) క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అటాకింగ్‌ ఆటతో సన్‌రైజర్స్‌ బౌలర్లు లయను దెబ్బతీయాలని చూశాడు. కానీ, గార్గ్‌ అద్భుతమైన క్యాచ్‌లతో గిల్‌, రాణాను పెవిలియన్‌ చేర్చాడు. రషీద్‌ వేసిన 12 ఓవర్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో గార్గ్‌ డైవింగ్‌ క్యాచ్‌తో గిల్‌ వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాతి ఓవర్‌లో శంకర్‌ బౌలింగ్‌లో రాణా షాట్‌ మిస్‌టైమ్‌ కావడంతో.. గార్గ్‌ మంచి క్యాచ్‌ అందుకున్నాడు. రస్సెల్‌ (9)ను నటరాజన్‌ అవుట్‌ చేయగా.. ఆఖర్లో మోర్గాన్‌, కార్తీక్‌ స్కోరు వేగం పెంచారు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 36, రాహుల్‌ త్రిపాఠి (బి) నటరాజన్‌ 23, నితీష్‌ రాణా (సి) గార్గ్‌ (బి) విజయ్‌ శంకర్‌ 29, రస్సెల్‌ (సి) విజయ్‌ శంకర్‌ (బి) నటరాజన్‌ 9, మోర్గాన్‌ (సి) మనీష్‌ పాండే (బి) థంపి 34, దినేష్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 5 వికెట్లకు 164; వికెట్ల పతనం: 1-48, 2-87, 3-88, 4-105, 5-163; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-27-0, బాసిల్‌ థంపి 4-0-46-1, నటరాజన్‌ 4-0-40-2, విజయ్‌ శంకర్‌ 4-0-20-1, రషీద్‌ ఖాన్‌ 4-0-28-1. 


హైదరాబాద్‌: బెయిర్‌స్టో (సి) రస్సెల్‌ (బి) చక్రవర్తి 36, విలియమ్సన్‌ (సి) రాణా (బి) ఫెర్గూసన్‌ 29, ప్రియమ్‌ గార్గ్‌ (బి) ఫెర్గూసన్‌ 4, వార్నర్‌ (నాటౌట్‌) 47, మనీష్‌ పాండే (బి) ఫెర్గూసన్‌ 6, విజయ్‌ శంకర్‌ (సి) గిల్‌ (బి) కమిన్స్‌ 7, అబ్దుల్‌ సమద్‌ (సి) గిల్‌ (బి) మావి 23, రషీద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 163/6; వికెట్ల పతనం: 1-57, 2-70, 3-70, 4-82, 5-109, 6-146; బౌలింగ్‌: ప్యాట్‌ కమిన్స్‌ 4-0-28-1, శివమ్‌ మావి 3-0-34-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-32-1, రస్సెల్‌ 2-0-29-0, ఫెర్గూసన్‌ 4-0-15-3, కుల్దీప్‌ యాదవ్‌ 3-0-18-0. 

Updated Date - 2020-10-19T08:50:27+05:30 IST