KK: సింగర్ కేకే చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. మేనేజర్ బయటపెట్టిన నిజాలివి..

ABN , First Publish Date - 2022-06-01T22:34:52+05:30 IST

ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (KK) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కత్తా పోలీసులు కేకే మృతిపై అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మే 31న కోల్‌కత్తాలో జరిగిన ‘షో’లో ప్రదర్శన ఇచ్చిన KK..

KK: సింగర్ కేకే చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. మేనేజర్ బయటపెట్టిన నిజాలివి..

ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (KK) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కత్తా పోలీసులు కేకే మృతిపై అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మే 31న కోల్‌కత్తాలో జరిగిన ‘షో’లో ప్రదర్శన ఇచ్చిన KK ఆ తర్వాత బస చేసేందుకు గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కోల్‌కత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అయితే.. అప్పటికే కేకే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకే గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. కానీ.. ఆయన శరీరంపై గాయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కేకే ముఖంపై, తలపై గాయాలున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.



కోల్‌కత్తాలోని SSKM Hospitalలో కేకే మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా పూర్తయింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ బయటికొస్తే కేకే మృతికి స్పష్టమైన కారణం ఏంటో తెలిసే అవకాశం ఉంది. పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. కేకే బస చేసిన గ్రాండ్ హోటల్‌లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అక్కడి హోటల్ సిబ్బందిని, ఈవెంట్ ఆర్గనైజర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. కేకే ప్రదర్శన ఇచ్చిన ఈవెంట్‌లోనే కాస్త ఇబ్బంది పడినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈవెంట్‌లో కేకే లైవ్ పర్మామెన్స్ చూసేందుకు వీక్షకులు భారీగా వచ్చినట్లు ఆ వీడియో చూస్తే తెలిసింది. స్టేజ్‌పై ఉన్న కేకే ఏసీ లేకపోవడంతో అంత జనం మధ్య ఉక్కపోతతో ఇబ్బంది పడి చెమట తుడుచుకున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.



ఇదిలా ఉండగా.. సింగర్ కేకే మేనేజర్ రితేష్ భట్ కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ఈవెంట్ ముగించుకుని హోటల్‌కు కారులో వెళుతున్న సమయంలోనే కేకే కాస్త ఇబ్బంది పడ్డారని చెప్పాడు. చాలా చలిగా ఉందని, ఏసీ ఆఫ్ చేయమని డ్రైవర్‌తో కేకే చెప్పినట్లు తెలిపాడు. కాళ్లూచేతులూ తిమ్మిర్లు వచ్చాయని కేకే అన్నట్టుగా మేనేజర్ చెప్పాడు. అయితే.. అంత ఇబ్బంది పడినా హోటల్‌లో కారు దిగగానే ఫ్యాన్స్‌కు నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారని తెలిపాడు. తన గదికి వెళ్లగానే కేకే ఫ్లోర్‌పై కుప్పకూలారని ఆయన మేనేజర్ రితేష్ భట్ చెప్పాడు. పోలీసులు రితేష్ భట్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. చనిపోయిన కొన్ని క్షణాల ముందు కేకే ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ టీం హోటల్‌కు చేరుకుంది. హోటల్ సిబ్బంది కూడా కేకే ఫ్లోర్‌పై కుప్పకూలినట్లు పోలీసులకు చెప్పారు. కేకే చివరిగా ఇచ్చిన ప్రదర్శనను వీక్షించేందుకు దాదాపు 3 వేల మంది ఆడిటోరియానికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ ఆడిటోరియం సామర్థ్యం 2 వేలేనని సమాచారం. సామర్థ్యానికి మించి జనం రావడం, ఆడిటోరియంలో ఏసీలు పనిచేయకపోవడంతో కేకే స్టేజ్‌పై చాలా ఇబ్బంది పడినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతోంది.

Updated Date - 2022-06-01T22:34:52+05:30 IST