కలకత్తాకు కృతజ్ఞతలతో...

ABN , First Publish Date - 2022-07-02T08:46:16+05:30 IST

నేను ఉత్తర భారతావనిలో పెరిగాను. మా ఇంటికి వచ్చే దినపత్రిక ప్రధానకార్యాలయం ఆనాటి మహానగరం కలకత్తాలో ఉండేది.

కలకత్తాకు కృతజ్ఞతలతో...

నేను ఉత్తర భారతావనిలో పెరిగాను. మా ఇంటికి వచ్చే దినపత్రిక ప్రధానకార్యాలయం ఆనాటి మహానగరం కలకత్తాలో ఉండేది. ఆ పత్రిక ‘స్టేట్స్‌మన్’. ఢిల్లీలో ప్రచురితమయ్యే ‘స్టేట్స్‌మన్’ ఎడిషన్ డెహ్రాడూన్లోని మా ఇంటికి మధ్యాహ్నానికి వచ్చేది. వ్యాకరణ విరుద్ధమైన భాషా ప్రయోగాలు, ముద్రారాక్షసాలు తక్కువగా ఉండేవి. ఈ కారణంగానే మా నాన్నగారు ‘స్టేట్స్‌మన్’ను బాగా అభిమానించేవారు. 


నేనూ ‘స్టేట్స్‌మన్’ను అభిమానిస్తూ పెరిగాను. విదేశీ వ్యవహారాలపై కవరేజీ ప్రశస్తంగా ఉండడం అందుకొక కారణం. జేమ్స్ కౌలే ‘లండన్ లెటర్’ కాలమ్ చాలా ఆసక్తికరంగా ఉండేది. ఆంగ్ల భాషాకోవిదుడు ఎమ్. కృష్ణన్ ప్రకృతి సంబంధిత విషయాలపై రాసే వ్యాసాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ‘స్టేట్స్‌మన్’ను నేను అభిమానించడానికి ఇది మరొక కారణం. ఉన్నత విద్యాభ్యాసానికి ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ‘స్టేట్సమన్’ను నిత్యం చదువుతుండేవాణ్ణి. ఐదేళ్ల ఢిల్లీ చదువుల కాలంలో ఆర్థిక శాస్త్రంలో రెండు డిగ్రీలు సముపార్జించుకున్నాను. ఇదే కాలంలో స్టేట్స్‌మన్ వైభవంమసక బారింది. జేమ్స్ కౌలే కాలమ్ నిలిచిపోయింది. కృష్ణన్ కాలమ్ కొనసాగింది.


సామాజిక శాస్త్రంలో పరిశోధన చేసేందుకు 1980లో నేను కలకత్తా వెళ్లాను. న్యూ ఢిల్లీలోనే కొనసాగి ఉన్నట్టయితే స్టేట్స్‌ మన్‌కు బదులుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చందాదారుణ్ని అయ్యే వాణ్ణి. ఆ పత్రికకు కలకత్తా ఎడిషన్ లేదు. విధి లేక స్టేట్స్‌ మన్‌ను చదువుతుండేవాణ్ణి. ఈ పరిస్థితుల్లో ‘ది టెలిగ్రాఫ్’ ప్రారంభమవడం నాకు ఎంతో ఉపశమనం కలిగించింది. 1982 జూలై 8న ప్రారంభమైన పత్రిక నాకు అమిత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. నేనే ఏమిటి, మాకు ఆ కొత్త దినపత్రికను తీసుకువచ్చే కుర్రవాడు కూడా తన విధి నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ప్రతి ఉదయమూ ఆ కొత్త దినపత్రిక ప్రతిని చేతితో పట్టుకుని ఊపుతూ ‘టెలిగ్రామ్! టెలిగ్రామ్!’ అని అరుస్తూ మా హాస్టల్‌కు వస్తుండేవాడు. ఆ మాట ఒక అపప్రయోగమైనా నా వీనులకు మధురంగా విన్పించేది. ఇప్పటికీ నేను ‘ది టెలిగ్రాఫ్’ను ‘టెలిగ్రామ్’ అని కాకుండా మరోలా పిలవడాన్నిఊహించలేకున్నాను. 


‘ది టెలిగ్రాఫ్’ సంస్థాపక సంపాదక బృందంలో నా పాత కళాశాల మిత్రుడు పరంజోయ్ గుహ థాకుర్తా కూడా ఉండేవారు. మా పరిశోధనా సంస్థకు చాలా దూరంలో ఉన్న ప్రపుల్ల సర్కార్ స్ట్రీట్‌లోని ఆ కొత్త దినపత్రిక కార్యాలయానికి నేను అప్పుడప్పుడూ వెళుతుండేవాణ్ణి. బస్సు, ట్రామ్, మినీ బస్‌లో ప్రయాణించడంతో పాటు కొంత దూరం నడవవలసి వచ్చేది. ఇదంతా ‘థాక్’ (పరంజోయ్‌ను మేము అలా పిలిచేవాళ్లం)ను కలిసేందుకేఅని మరి చెప్పనవసరం లేదు. న్యూస్‌రూమ్‌లో ఎంతో హడావిడి కన్పించేది. స్టేట్స్‌మన్ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా ఆ యువ పాత్రికేయులు పనిచేస్తుండేవారు. ‘మా పత్రికకు ఏదైనా వ్యాసం రాస్తావా’ అని పరంజోయ్ ఒకసారి నన్ను అడిగాడు. అప్పట్లో భారత ప్రభుత్వం కొత్త అటవీ బిల్లును తీసుకువచ్చింది. దానిని తీవ్రంగా విమర్శిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. పరంజోయ్ సూచన మేరకు ది టెలిగ్రాఫ్‌లో ప్రచురణకు ఆ వ్యాసాన్ని సమర్పించాను. ప్రచురణకు ఎంపికయింది. అయితే అది పత్రికలో వెలువడడానికి ఒక రోజు ముందు ‘కూలీ’ సినిమా షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసేతు హిమాచలం విఖ్యాతుడైన వ్యక్తి జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతుండగా కొత్త అటవీ బిల్లుపై నేను రాసిన వ్యాసం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? నా వ్యాస ప్రచురణను నిరవధికంగా వాయిదా వేశారు. అంతిమంగా నా మిత్రుడి సలహాపై నేను ఆ వ్యాసాన్ని ‘బిజినెస్ స్టాండర్డ్’ (ఇది, ‘ది టెలిగ్రాఫ్’కు పెద్ద తోబుట్టువు) కు పంపాను. ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీలో నా వ్యాసం ప్రచురితమయింది. 

సినిమా షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ గాయపడి ఉండకపోయినట్టయితే ది టెలిగ్రాఫ్ ప్రారంభమయిన నెల రోజులలోనే ఆ పత్రిక సంపాదకీయ పుటలో నావ్యాసం ప్రచురితమయి ఉండేది. ఒక దశాబ్దం తరువాత మాత్రమే ఆ దినపత్రికలో ప్రప్రథమంగా నా బైలైన్ ప్రత్యక్షమయింది. మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్‌పై నేను రాసిన వ్యాసం ఆయన 90వ జయంతి సందర్భంగా 1992 ఆగస్టు 29న ది టెలిగ్రాఫ్‌లో వెలువడింది. దరిమిలా ఒక దశాబ్దంపాటు సంవత్సరానికి ఎనిమిది నుంచి పది వ్యాసాలు ఆ పత్రిక ఎడిట్ పేజీకి రాశాను. ఆ తరువాత 2003 నవంబర్ 15 నుంచి ది టెలిగ్రాఫ్‌లో నా కాలమ్ ‘పాలిటిక్స్ అండ్ ప్లే’ ప్రారంభమయింది. పక్షం రోజుల కొకసారి వెలువడే ఈ నా కాలమ్‌లో ఇది 483వ వ్యాసం.


ఇంచుమించు రెండు దశాబ్దాలుగా నేనీ కాలమ్ రాస్తున్నాను. ఇదే కాలంలో నేను ఇతర భారతీయ దినపత్రికలలో కూడా వివిధ కాలమ్‌లు రాశాను. అయితే నా పరిశోధనా వ్యాపకాలు, గ్రంథ రచనతో సమయా భావం కారణంగా ది టెలిగ్రాఫ్‌లో మినహా ఇతర భారతీయ దినపత్రికలలో నా కాలమ్‌లు క్రమంగా నిలిపివేశాను ఒక్క ది టెలిగ్రాఫ్‌లో మాత్రమే నాకాలమ్‌ను కొనసాగిస్తున్నాను. కొన్ని విదేశీ దినపత్రికలలో కాలమ్ రాసేందుకు వచ్చిన అవకాశాలను కూడా తిరస్కరించి ఈ కాలమ్ పైనే నా దృష్టిని కేంద్రీకరించాను. ఒక పాఠకుడుగా ది టెలిగ్రాఫ్‌ను నేను అభిమానించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ దినపత్రికలో వెలువడే రచనలు జీవ చైతన్యంతో తొణికిసలాడుతుంటాయి. స్ఫూర్తిదాయకమైన వచనమది. కాలమిస్ట్‌ల మేధోవిస్తృతి, సైద్ధాంతిక విశ్వాసాలలో వైవిధ్యం మరొక ముఖ్య కారణం. ఈ పత్రిక ఇప్పటికీ ప్రతి వారం కొత్త పుస్తకాలకు ఒక పూర్తి పేజీని కేటాయిస్తుంది. ఒక కాలమిస్ట్‌గా కూడా ది టెలిగ్రాఫ్ పట్ల నా ప్రత్యేక అభిమానానికి ఒక ముఖ్య కారణం కలకత్తా, దాని మేధో సంస్కృతికి నేను రుణపడి ఉండడమే. నేను ఒక స్కాలర్‌గా రూపొందేందుకు, ఎదిగేందుకు ఆ మహానగరం నాకుఒక అవకాశాన్ని ఇచ్చింది. అందుకు కృతజ్ఞతగానే ఆ నగరం నుంచి వెలువడే ది టెలిగ్రాఫ్‌లో రాసే కాలమ్‌కు నేను అమిత ప్రాధాన్యమిస్తున్నాను. కాలమిస్ట్‌ల అభిప్రాయాల విషయంలో ఆ పత్రిక ఎటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లను లెక్క చేయదు. భారతీయ రాజకీయవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సైనికాధికారులు, ప్రభుత్వాధికారులు, క్రికెటర్ల గురించి నా భావాలు, అభిప్రాయాలను ఈ పత్రికలో నేను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలను. ది టెలిగ్రాఫ్ వ్యవస్థాపకుడు అవీక్ సర్కార్. ఆ పత్రిక స్వతంత్ర వైఖరికి ఆయన ప్రధాన కారకుడు. ఒక దినపత్రిక అన్ని తరహాల మేధో, రాజకీయ అభిప్రాయాలను ప్రతిబింబించాలని ఆయన విశ్వసిస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేకి అయినప్పటికీ ప్రముఖ మార్క్సిస్టు మేధావులకు తన పత్రికలో కాలమిస్ట్ లుగా అవకాశం కల్పించారు.


బెంగలూరులో ఒకప్పుడు ది టెలిగ్రాఫ్ ప్రింట్ ఎడిషన్‌ లభ్యమయ్యేది. కలకత్తా నగరానికి వెలుపల ఉన్న ఏకైక కెసి దాస్ కంపెనీ శాఖ కార్యాలయానికి వెలుపల ఉన్న ఒక న్యూస్‌స్టాండ్ వద్ద అది లభ్యమయ్యేది. ఆ రోజుల్లో అది నా కళ్లకు సందేష్, రసమలైలా కనిపించేది. ఇప్పుడు ఆ న్యూస్ స్టాండ్ లేదు. రోజూ ఆన్‌లైన్‌లో చదువుతుంటాను. నాలుగు దశాబ్దాలుగా నేను ది టెలిగ్రాఫ్ పాఠకుడిని. రెండు దశాబ్దాలుగా ఆ పత్రిక కాలమిస్ట్‌ను. పాఠకుడిగా, కాలమిస్ట్‌గా ముఖ్యంగా పాఠకుడిగానే నేను ఆ కలకత్తా దినపత్రికకు 40వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.



రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-07-02T08:46:16+05:30 IST