Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవరిదో.. దసరా ధమాకా?

 ధోనీ తంత్రమా.. నైట్‌రైడర్స్‌ స్పిన్‌ మంత్రమా

ఐపీఎల్‌ టైటిల్‌ ఫైట్‌లో చెన్నైX కోల్‌కతా ఢీ నేడు

రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

కోల్‌కతా ఇలా..

లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన నైట్‌రైడర్స్‌.. ముంబైతో సమంగా నిలిచింది. ఎలిమినేటర్‌లో బెంగళూరును ఓడించిన కోల్‌కతా.. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీకి షాకిస్తూ తుది పోరుకు చేరుకొంది. 

 చెన్నై ఇలా..

లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 నెగ్గిన చెన్నై.. మొత్తం 18 పాయింట్లు సాధించింది. ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన చెన్నై..రుతురాజ్‌ జోరు.. ధోనీ  క్వాలిఫయర్‌-1లో ఢిల్లీని ఓడించింది.


ఫినిషింగ్‌ టచ్‌తో ఫైనల్‌ ఫైట్‌కు చేరిన సూపర్‌ కింగ్స్‌ ఓవైపు..  స్ఫూర్తిదాయక పోరాటంతో గెలుపు జోరుమీదున్న కోల్‌కతా మరోవైపు. మాస్టర్‌ మైండ్‌తో మహీ మరోసారి చెన్నైను ‘విజిల్‌ పోడు’ అనిపించాలనుకుంటుంటే.. స్పిన్‌ త్రయం ముప్పేట దాడితో కోల్‌కతా టైటిల్‌తో కెవ్వుకేక పెట్టించాలన్న పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే తుది సమరంలో నెగ్గి దసరా ధమాకా మోగించేదెవరో....?దుబాయ్‌: కరోనా కారణంగా అనేక మలుపులు తిరిగిన ఐపీఎల్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలతో తుది సమరానికి చేరుకున్న మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు శుక్రవారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ధోనీ కెప్టెన్సీనే ప్రధాన ఆయుధంగా 9వసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన సూపర్‌ కింగ్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, లీగ్‌ తొలి దశలో వెనుకబడినా.. ఆ తర్వాత స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ ఫైట్‌కు చేరిన కోల్‌కతాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్‌కు చేరిన రెండుసార్లూ కప్‌ కొట్టిన చరిత్ర నైట్‌రైడర్స్‌ది కాగా.. 8సార్లు ఫైనల్‌ ఆడితే 3సార్లు చెన్నై విజేతగా నిలిచింది. నైట్‌రైడర్స్‌ స్పిన్‌ త్రయం నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, షకీబల్‌ను ఎదుర్కోవడమే చెన్నై ముందున్న పెద్ద సవాల్‌.


ఆ 12 ఓవర్లు ఎలా..

గతేడాది పేలవ ప్రదర్శనతో ప్లేఆ్‌ఫ్సకు దూరమైన చెన్నై.. ఈ సీజన్‌లో మాత్రం నిలకడైన ఆటతో ఫైనల్‌కు చేరుకొంది. సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (603 పరుగులు)ది ముఖ్యభూమిక. డుప్లెసి (547 పరుగులు) కూడా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతుండగా.. మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, జడేజా, ధోనీ తలో చేయి వేస్తున్నారు. బౌలింగ్‌లో శార్దూల్‌, హాజెల్‌వుడ్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. దీపక్‌ చాహర్‌ ఆరంభంలో వికెట్లు తీయలేకపోవడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీతో క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించిన ఊతప్ప నుంచి టీమ్‌ మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోం ది. కాగా, నైట్‌రైడర్స్‌ స్పిన్నర్లు వేసే 12 ఓవర్లను చెన్నై ఎదుర్కొంటుందనే దానిపైనే విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నా యి. ధోనీలోని ఫినిషర్‌ మరోసారి బయటకు రావడం మాత్రం ప్రత్యర్థులకు డేంజర్‌ బెల్సే..!


బౌలర్ల అండతో..

తడబడినా.. నిలబడి సూపర్‌ ఆటతో తుది పోరుకు చేరుకొన్న కోల్‌కతా బ్యాటింగ్‌లో లోటు కనిపిస్తున్నా.. బౌలర్ల అండతో నెట్టుకొస్తోంది. మిస్టరీ సిన్నర్లు నరైన్‌, వరుణ్‌ చక్రవర్తితోపాటు ఆల్‌రౌండర్‌ షకీబల్‌ ముప్పేటదాడితో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పేసర్లు ఫెర్గూసన్‌, శివమ్‌ మావి ఆరంభంలో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులకు కళ్లెం వేస్తున్నారు. ఓపెనర్‌ వెంకటేష్‌ బ్యాటింగ్‌లో కీలకంగా మారగా.. శుభమన్‌ గిల్‌ పరిణతి చెందిన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. నితీష్‌ రాణా, త్రిపాఠి రాణిస్తున్నారు. అయితే, ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాట ర్లు ఒత్తిడికి గురై కుప్పకూలడం జట్టులోని లోపాలను బహిర్గతం చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌ ఆందోళనకరంగానే ఉన్నా.. విపత్కర పరిస్థితుల్లోనూ ధోనీ తరహాలోనే కూల్‌గా టీమ్‌ను నడిపిస్తున్నాడు. విజయావకాశాలు ఇరుజట్లకూ సమానంగా ఉన్న నేపథ్యంలో ఫైనల్‌ ఫైట్‌ మరింత రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. 

జట్లు (అంచనా)

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేష్‌ అయ్యర్‌, నితీష్‌ రాణా, త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేష్‌ కార్తీక్‌, షకీబల్‌ హసన్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి. 


చెన్నై: రుతురాజ్‌, డుప్లెసి, ఊతప్ప, మొయిన్‌, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, బ్రావో, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, హాజెల్‌వుడ్‌. 


పిచ్‌

బ్యాటింగ్‌ వికెట్‌ కావడంతో మంచి స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ జరిగిన గత 12 మ్యాచ్‌ల్లో 9సార్లు ఛేజింగ్‌ చేసిన జట్లే నెగ్గాయి. ఈ నేపథ్యంలో టాస్‌ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకొనే చాన్సుంది. 


చెన్నై, నైట్‌రైడర్స్‌ ఫైనల్లో తలపడనుండడం ఇది రెండోసారి. తొలిసారి 2012లో చెన్నైను ఓడించిన కోల్‌కతా టైటిల్‌ను ఎగరేసుకు పోయింది.

కోల్‌కతాతో తలపడిన గత 5 మ్యాచ్‌ల్లో 4సార్లు చెన్నై నెగ్గింది. 

Advertisement
Advertisement