Abn logo
Sep 24 2021 @ 04:00AM

కోల్‌కతా కేక..

త్రిపాఠి, వెంకటేశ్‌ అర్ధసెంచరీలు

ముంబైపై ఘనవిజయం

అబుదాబి: ఐపీఎల్‌ రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొడుతోంది. తమపై  చివరి 13 మ్యాచ్‌ల్లో 12 విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్‌ను  ఈసారి మట్టికరిపించింది. కేకేఆర్‌ నయా సంచలనం వెంకటేశ్‌ అయ్యర్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) మెరుపు ఆరంభంతో విజయానికి బాట వేశాడు. బుమ్రా, బౌల్ట్‌, మిల్నే ఇలా ప్రపంచ స్థాయి బౌలర్లను అతడు ఓ ఆటాడుకున్నాడు. అటు రాహుల్‌ త్రిపాఠి (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరి రేసులో తామూ ఉన్నామని చాటుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది.


డికాక్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55), రోహిత్‌ (30 బంతుల్లో 4 ఫోర్లతో 33) రాణించారు. ఫెర్గూసన్‌, ప్రసిధ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. బుమ్రాకు మూడు వికెట్లు పడ్డాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నరైన్‌ నిలిచాడు.


అయ్యర్‌, త్రిపాఠి దూకుడు:

లక్ష్యం ఓ మాదిరిగానే ఉన్నా కేకేఆర్‌ బ్యాటర్స్‌ మాత్రం రాకెట్‌ వేగంతో పరుగులు సాధించారు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, గిల్‌ (13) చెరో సిక్సర్‌ బాదారు. ఇక రెండో ఓవర్‌లో అయ్యర్‌ 6,4,4తో దంచుడు ఆరంభించాడు. మూడో ఓవర్‌లోనే గిల్‌ను బుమ్రా అవుట్‌ చేసినా అయ్యర్‌ దూకుడు ఆగలేదు. బౌలర్‌ ఎవరైనా అనవసరమన్నట్టుగా బ్యాట్‌ ఝుళిపించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించాడు. ఈ దెబ్బకు పవర్‌ప్లేలో కోల్‌కతా 10.5 రన్‌రేట్‌తో 63 పరుగులు సాధించింది. 25 బంతుల్లోనే ఐపీఎల్‌లో అయ్యర్‌ తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.


అలాగే ముంబైపై కేకేఆర్‌ ప్లేయర్‌కిదే ఫాస్టెస్ట్‌ కావడం విశేషం. బుమ్రా ఓవర్‌లో 6,4తో త్రిపాఠి హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా నాలుగో బంతికి అయ్యర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి 46 బంతుల్లో 28 పరుగులే కావాల్సి ఉండడంతో కేకేఆర్‌ ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. 13వ ఓవర్‌తో త్రిపాఠి 6,4.. మోర్గాన్‌ (7) సిక్సర్‌తో 17 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్‌ తొలి బంతికి రాణా (5 నాటౌట్‌) ఫోర్‌తో కేకేఆర్‌ మ్యాచ్‌ను ముగించింది.

ఆరంభం అదిరినా..:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌, డికాక్‌ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. అయితే కోల్‌కతా బౌలర్లు పుంజుకుని చివరి 10 ఓవర్లలో 75 పరుగులే ఇచ్చి కట్టడి చేశారు. రోహిత్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచి పరుగులకు తెర లేపాడు. నాలుగో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదగా ఆ తర్వాత డికాక్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. ఐదో ఓవర్‌లో ఒకటి, ఆరో ఓవర్‌లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 56 పరుగులు సాధించింది. అటు పదో ఓవర్‌లో రోహిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి సునీల్‌ నరైన్‌కు చిక్కగా తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి కేకేఆర్‌ హవా ఆరంభమైంది. కాసేపటికే సూర్యకుమార్‌ (5) నిష్క్రమించగా కేకేఆర్‌ బౌలర్లు 33 బంతులపాటు ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వలేదు.


అయితే 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన డికాక్‌ చివరికి 14వ ఓవర్‌లో ఓ ఫోర్‌ సాధించి జట్టు స్కోరును వందకు చేర్చాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే స్లో బంతితో అతడిని ప్రసిధ్‌ కృష్ణ పెవిలియన్‌కు చేర్చాడు. సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన ఇషాన్‌ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 18వ ఓవర్‌లో 6,4తో పొలార్డ్‌ (21) రన్స్‌ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఓవర్‌లో ఆరు పరుగులే రాగా అతడితో పాటు క్రునాల్‌ (12) వికెట్‌ పడడంతో ముంబై ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. 


 ఐపీఎల్‌లో ఏదైనా ఓ జట్టు (కోల్‌కతా)పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్‌. వార్నర్‌ (పంజాబ్‌పై 943) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ లీగ్‌లో ఒకే బౌలర్‌ (నరైన్‌) చేతిలో రోహిత్‌ అత్యధిక (7) సార్లు అవుటయ్యాడు. గతంలోనూ ధోనీ (జహీర్‌), కోహ్లీ (సందీప్‌ శర్మ) ఏడేసి సార్లు నిష్క్రమించారు.


స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌:

రోహిత్‌ (సి) గిల్‌ (బి) నరైన్‌ 33; డికాక్‌ (సి) నరైన్‌ (బి) ప్రసిధ్‌ 55; సూర్యకుమార్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ప్రసిధ్‌ 5; ఇషాన్‌ (సి) రస్సెల్‌ (బి) ఫెర్గూసన్‌ 14; పొలార్డ్‌ (రనౌట్‌) 21; క్రునాల్‌ (సి) వెంకటేశ్‌ (బి) ఫెర్గూసన్‌ 12; తివారీ (నాటౌట్‌) 5; మిల్నే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 155/6; వికెట్ల పతనం: 1-78, 2-89, 3-106, 4-119, 5-149, 6-149; బౌలింగ్‌: రాణా 1-0-5-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-22-0; నరైన్‌ 4-0-20-1; ఫెర్గూసన్‌ 4-0-27-2; ప్రసిధ్‌ 4-0-43-2; రస్సెల్‌ 3-0-37-0.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

శుభ్‌మన్‌ (బి) బుమ్రా 13; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) బుమ్రా 53; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 74; మోర్గాన్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 7; నితీష్‌  (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 15.1 ఓవర్లలో 159/3; వికెట్ల పతనం: 1-40, 2-128, 3-147; బౌలింగ్‌: ట్రెంట్‌ బౌల్ట్‌ 2-0-23-0; మిల్నే 3-0-29-0; బుమ్రా 4-0-43-3; క్రునాల్‌ 3-0-25-0; రాహుల్‌ చాహర్‌ 3-0-34-0; రోహిత్‌ 0.1-0-4-0.