Abn logo
Sep 27 2020 @ 04:13AM

రైజర్స్‌ రెండో‘సారీ’

Kaakateeya

గిల్‌ అర్ధసెంచరీ 

కోల్‌కతా విజయం 

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శనను కనబరిచింది. అటు పక్కా ప్రణాళికలతో ఏకంగా ఏడుగురు బౌలర్లతో రంగంలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అనుకున్న ఫలితం సాధించింది. వీరి ధాటికి మనీశ్‌ పాండే ఒక్కడే దీటుగా నిలబడ్డాడు. నాలుగు వికెట్లే కోల్పోయినా రైజర్స్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, మోర్గాన్‌ అజేయ భాగస్వామ్యంతో కేకేఆర్‌కు విజయం రుచి చూపించారు.


అబుదాబి: ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు బోణీ చేసింది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన నైట్‌రైడర్స్‌.. ఛేదనలో కాస్త తడబడినా గిల్‌ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మోర్గాన్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్‌) అతడికి సహకరించాడు. ఫలితంగా కేకేఆర్‌ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలిచింది. మరోవైపు వరుసగా ఏడోమ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన జట్టే ఓడడడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), వార్నర్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) రాణించారు. ఛేదనలో కోల్‌కతా 18ఓవర్లలో 3వికెట్లకు 145 రన్స్‌ చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

ఆదుకున్న గిల్‌, మోర్గాన్‌: స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలో తడబడింది. అయితే యువ ఓపెనర్‌ గిల్‌ మాత్రం పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే నరైన్‌ను పేసర్‌ ఖలీల్‌ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత నితీశ్‌ రాణా (26) వచ్చీ రాగానే బాదడం ఆరంభిస్తూ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే స్పిన్నర్‌ నటరాజన్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. అటు కెప్టెన్‌ కార్తీక్‌ను రషీద్‌ ఖాన్‌ గూగ్లీతో డకౌట్‌ చేయడంతో స్కోరు 53/3తో ఇబ్బందికరంగా మారింది. కానీ ఓపెనర్‌ గిల్‌, మోర్గాన్‌ కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగానే ఉండడంతో వీరు భారీ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడారు. ఏ బౌలర్‌ కూడా వీరిని ఇబ్బందిపెట్టలేకపోయాడు. ఈక్రమంలో గిల్‌ 46 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అతడికి చక్కటి సహకారం అందించిన మోర్గాన్‌ వరుసగా 6,4తో మరో రెండు ఓవర్లుండగానే మ్యాచ్‌ను ముగించాడు. 

మనీశ్‌ పాండే ఒక్కడే: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. ఆరంభం నుంచే కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. అత్యంత ఖరీదైన పేసర్‌ కమిన్స్‌ ఈసారి సత్తా చూపించడంతో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్‌లో కెప్టెన్‌ వార్నర్‌ 6,4తో జోరు చూపించినా మరుసటి ఓవర్‌లోనే రైజర్స్‌కు ఝలక్‌ ఇస్తూ బెయిర్‌స్టో (5)ను కమిన్స్‌ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. తొమ్మిదో ఓవర్‌లో వార్నర్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేసి ఐపీఎల్‌లో తొలి వికెట్‌ కూడా సాధించాడు. మధ్య ఓవర్లలో మనీశ్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా (30) జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయినా వేగంగా పరుగులు సాధించడంలో మాత్రం విఫలమైంది. 35 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పాండే మూడో వికెట్‌కు సాహాతో కలిసి 62 పరుగులు జోడించాడు. స్లాగ్‌ ఓవర్స్‌లో రస్సెల్‌, మావి అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో రైజర్స్‌ కనీసం 150 పరుగులు కూడా సాధించలేకపోయింది.

3 కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి స్వల్పస్కోరును నమోదు చేసిన మూడో ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌. ఈ జాబితాలో చెన్నై (131/4), రాజస్థాన్‌ (139/4) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ చక్రవర్తి 36, బెయిర్‌స్టో (బి) కమిన్స్‌ 5, మనీశ్‌ పాండే (సి అండ్‌ బి) రస్సెల్‌ 51, సాహా (రనౌట్‌) 30, నబీ (నాటౌట్‌) 11, అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 142/4; వికెట్ల పతనం: 1-24, 2-59, 3-121, 4-138; బౌలింగ్‌: సునీల్‌ నరైన్‌ 4-0-31-0, కమిన్స్‌ 4-0-19-1, శివమ్‌ మావి 2-0-15-0, కుల్దీప్‌ 2-0-15-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-25-1, నాగర్‌కోటి 2-0-17-1, రస్సెల్‌ 2-0-16-1. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (నాటౌట్‌) 70, సునీల్‌ నరైన్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 0, నితీష్‌ రాణా (సి) సాహా (బి) నటరాజన్‌ 26, దినేష్‌ కార్తీక్‌ (ఎల్బీ) రషీద్‌ ఖాన్‌ 0, మోర్గాన్‌ (నాటౌట్‌) 42; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18 ఓవర్లలో 145/3; వికెట్లపతనం: 1-6, 2-43, 3-53; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-29-0, ఖలీల్‌ అహ్మద్‌ 3-0-28-1, నటరాజన్‌ 3-0-27-1, రషీద్‌ ఖాన్‌ 4-0-25-1, నబీ 4-0-23-0, అభిషేక్‌ శర్మ 1-0-11-0.

Advertisement
Advertisement