Durga Puja : వాటికన్ సిటీ ఇతివృత్తంతో దుర్గా పూజలు

ABN , First Publish Date - 2022-09-23T20:30:23+05:30 IST

దుర్గా పూజ (Durga Puja)లకు కోల్‌కతా సిద్ధమవుతోంది. ప్రతి

Durga Puja : వాటికన్ సిటీ ఇతివృత్తంతో దుర్గా పూజలు

కోల్‌కతా : దుర్గా పూజ (Durga Puja)లకు కోల్‌కతా సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం సరికొత్త ఇతివృత్తంతో దుర్గా పూజా మండపాలను తీర్చిదిద్దే శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ (Sreebhumi Sporting Club) ఈసారి వాటికన్ సిటీ ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది ఈ క్లబ్ స్వర్ణోత్సవాలు కావడం మరో విశేషం. 


పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక, అత్యవసర సేవల శాఖ మంత్రి, శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ మాట్లాడుతూ, ఈ ఏడాది తమ క్లబ్ 50వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది దుర్గా పూజా మండపాన్ని వాటికన్ సిటీ సెయింట్ పీటర్స్ బసిలికా ఇతివృత్తంతో నిర్మించినట్లు తెలిపారు. 




వాటికన్‌ చూడాలనే...

రోమ్‌లోని వాటికన్ సిటీ గురించి అందరికీ తెలుసునని, అయితే చాలా కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే అక్కడికి వెళ్ళి చూడగలరని అన్నారు. ఆ నగరాన్ని చూడాలనుకునేవారు ఈసారి తమ పూజా మండపం ద్వారా తమ ఆకాంక్షను నెరవేర్చుకోవచ్చునని తెలిపారు. ఈ పూజా మండపాన్ని 60 రోజుల్లో 100 మంది కళాకారులు నిర్మించారన్నారు. గత ఏడాది బుర్జ్ ఖలీఫా ఇతివృత్తంతో పూజా మండపాన్ని నిర్మించినట్లు గుర్తు చేశారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. 




శతాబ్దాల చరిత్ర

అక్టోబరు 1 నుంచి 5 వరకు దుర్గా పూజ జరుగుతుందని చెప్పారు. రికార్డుల ప్రకారం మొదటి దుర్గా పూజ 15వ శతాబ్దంలో జరిగినట్లు తెలుస్తోంది. జానపద కథలు, భూస్వాముల కథనాల ప్రకారం దీనాజ్‌పూర్, మాల్డాలలో మొదటి దుర్గాపూజ జరిగినట్లు సమాచారం. శారదీయ (శరన్నవరాత్రులలో) దుర్గాపూజలను మొదటిసారి 1606లో రాజా కంగ్షనారాయణ్ (తాహెర్‌పూర్) లేదా భాబానంద మజుందార్ (నాడియా) నిర్వహించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-09-23T20:30:23+05:30 IST