ఢిల్లీ కమాల్‌

ABN , First Publish Date - 2020-10-04T09:17:20+05:30 IST

ఊహించినట్టుగానే షార్జా మైదానంలో మరోసారి అభిమానులకు పరుగుల విందు లభించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ...

ఢిల్లీ కమాల్‌

216, 200, 223, 226.. షార్జా వేదికపై ఈ మ్యాచ్‌కు ముందు నమోదైన స్కోర్లివి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా దీనికి తగినట్టుగానే 228 పరుగులతో అదరగొట్టింది. అయినా కోల్‌కతా భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కారణంగా ఏమైనా జరగొచ్చని అనిపించింది. కానీ పక్కా వ్యూహం ప్రకారం బంతులు వేసిన ఢిల్లీ బౌలర్లు కేకేఆర్‌ను బేజారెత్తించారు. డెత్‌ ఓవర్లలో త్రిపాఠి, మోర్గాన్‌ పోరాటం విజయంపై ఆశలు రేకెత్తించినా చివరికి ఢిల్లీదే పైచేయి అయ్యింది. డీసీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌, పృథ్వీ షా అర్ధసెంచరీలతో అదరగొట్టారు.


అదరగొట్టిన అయ్యర్‌ 

సత్తా చూపిన బౌలర్లు

కోల్‌కతా పరాజయం


1 షార్జా వేదికపై తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (228) చేసిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. అలాగే కోల్‌కతాపై కూడా ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.


షార్జా: ఊహించినట్టుగానే షార్జా మైదానంలో మరోసారి అభిమానులకు పరుగుల విందు లభించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అన్ని విభాగాల్లో సత్తాచాటి 18 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. దీంటో పాయింట్ల పట్టికలో డీసీ టాప్‌లో నిలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (38 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 88 నాటౌట్‌), పృథ్వీ షా (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) అర్ధసెంచరీలతో రాణించారు. రస్సెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసి ఓడింది. నితీశ్‌ రాణా (35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58), మోర్గాన్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 44), రాహుల్‌ త్రిపాఠి (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) పోరాడారు. నోకియాకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ నిలిచాడు.

రాణా ఒక్కడే: భారీ ఛేదనలో కోల్‌కతా ఆరంభంలోనే తడబడింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు జట్టు కొంపముంచాయి. నితీశ్‌ రాణా ఒక్కడే ఆరంభంలో పోరాడాడు.  రెండో ఓవర్‌లోనే నరైన్‌ (3) వికెట్‌ను కోల్పోగా, మరో ఓపెనర్‌ గిల్‌ (28) ఆటలో జోరు కనిపించలేదు. నితీశ్‌ రాణా మాత్రం వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. మూడో ఓవర్‌లో తను రెండు సిక్సర్లు, ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో 59 పరుగులు వచ్చాయి. అటు తొమ్మిదో ఓవర్‌లో గిల్‌ అవుటయ్యాక.. బరిలోకి దిగిన రస్సెల్‌ను చూసి ఇక షార్జా మైదానం మోతెక్కినట్టేనని భావించారు. కానీ ఈ వ్యూహం జట్టుకే మాత్రం ఉపయోగపడలేదు. రబాడ ఓవర్‌లో ఫోర్‌, సిక్సర్‌తో భయపెట్టినా ఐదో బంతికి పుల్‌ షాట్‌ ఆడి నోకియాకు చిక్కాడు. ఇక 13వ ఓవర్‌లో పేసర్‌ హర్షల్‌ డబుల్‌ ఝలక్‌ ఇస్తూ రాణా, దినేశ్‌ కార్తీక్‌ (6)లను అవుట్‌ చేశాడు.

డెత్‌ ఓవర్లలో ధమాకా: చివరి నాలుగు ఓవర్లలో కేకేఆర్‌కు 77 పరుగులు అవసరం. ఈ దశలో ఎవరి అంచనాలో లేని రాహుల్‌ త్రిపాఠి 17వ ఓవర్‌లో 6,6,4,6తో బెంబేలెత్తించి 24 పరుగులు పిండుకోగా,  రబాడ ఓవర్‌లో మోర్గాన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో హోరెత్తించి 23 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం ఒక్కసారిగా 12 బంతుల్లో 31కి మారింది. కానీ 19వ ఓవర్‌లో మోర్గాన్‌ వికెట్‌ తీసిన నోకియా 5 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు కావాల్సి ఉన్నా త్రిపాఠిని స్టొయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో ఓటమి లాంఛనమే అయ్యింది.

అందరూ బాదేశారు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్‌-4 ఆటగాళ్లు విశేషంగా ఆకట్టుకున్నారు. అందరూ నువ్వా.. నేనా అనే రీతిలో షార్జా మైదానంలో చెలరేగారు. ఓపెనర్లు పృథ్వీ షా, ధవన్‌ (26) ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. స్టార్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో షా  4,6తో సత్తా చాటాడు. అటు ధవన్‌ ఐదో ఓవర్‌లో వేగం పెంచి వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ, తర్వాతి ఓవర్‌లోనే మోర్గాన్‌ అద్భుత క్యాచ్‌తో అతడు అవుటవడంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు రస్సెల్‌ మాత్రం తన తొలి రెండు ఓవర్లలో ఏడు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. అయితే కుర్ర పేసర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటిలను లక్ష్యంగా చేసుకున్న కెప్టెన్‌ శ్రేయాస్‌, పృథ్వీ షా బౌండరీల రూపంలో భారీగా పరుగులు రాబట్టారు. 35 బంతుల్లో షా ఓ సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో నాగర్‌కోటి ఓవర్‌లో పృథ్వీ ఇచ్చిన క్యాచ్‌ను గిల్‌ పట్టడం విశేషం. ఈ ముగ్గురూ 2018 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో సభ్యులు. అయ్యర్‌, షా కలిసి రెండో వికెట్‌కు 73 రన్స్‌ జోడించారు. 

ఆఖర్లో మరింత మోత: షా నిష్క్రమణ తర్వాత పంత్‌(38) రాకతో స్కోరు మరింత వేగంగా పెరిగింది. 31 బంతుల్లోనే వీరి మధ్య 72 రన్స్‌ వచ్చాయి. 16వ ఓవర్‌తో పంత్‌ 3 ఫోర్లు, 17వ ఓవర్‌లో అయ్యర్‌ 6,4,4 బాదాడు. ఇక 18వ ఓవర్‌లో వరుసగా 6,4,4తో చెలరేగిన పంత్‌ ఐదో బంతికి అవుటయ్యాడు. అప్పటికే స్కోరు 200 దాటింది. 19వ ఓవర్‌లో మరింతగా రెచ్చిపోయిన అయ్యర్‌ 20 రన్స్‌ రాబట్టాడు. చివరి ఓవర్‌లో స్టొయినిస్‌ (1) వికెట్‌ తీసుకోవడంతో పాటు రస్సెల్‌ ఏడు పరుగులే ఇచ్చాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా (సి) గిల్‌ (బి) నాగర్‌కోటి 66, ధవన్‌ (సి) మోర్గాన్‌ (బి) చక్రవర్తి 26, శ్రేయాస్‌ (నాటౌట్‌) 88, పంత్‌ (సి) మావి (బి) రస్సెల్‌ 38, స్టొయినిస్‌ (సి) చక్రవర్తి (బి) రస్సెల్‌ 1, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 228/4; వికెట్ల పతనం: 1-56, 2-129, 3-201, 4-221; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-49-0, శివమ్‌ మావి 3-0-40-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-49-1, నరైన్‌ 2-0-26-0, రస్సెల్‌ 4-0-29-2, నాగర్‌కోటి 3-0-35-1.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) పంత్‌ (బి) మిశ్రా 28, సునీల్‌ నరైన్‌ (బి) నోకియా 3, నితీష్‌ రాణా (సి) అక్షర్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 58, రస్సెల్‌ (సి) నోకియా (బి) రబాడ 13, దినేష్‌ కార్తీక్‌ (సి) ధవన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 6, మోర్గాన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) నోకియా 44, ప్యాట్‌ కమిన్స్‌ (సి) పటేల్‌ (బి) నోకియా 5, రాహుల్‌ త్రిపాఠి (బి) స్టొయినిస్‌ 36, కమలేష్‌ నాగర్‌కోటి (నాటౌట్‌) 3, శివమ్‌ మావి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 210/8; వికెట్ల పతనం: 1-8, 2-72, 3-94, 4-117, 5-117, 6-122, 7-200, 8-207; బౌలింగ్‌: రబాడ 4-0-51-1, నోకియా 4-0-33-3, అశ్విన్‌ 2-0-26-0, స్టొయినిస్‌ 4-0-46-1, హర్షల్‌ పటేల్‌ 4-0-34-2, అమిత్‌ మిశ్రా 2-0-14-1. 

Updated Date - 2020-10-04T09:17:20+05:30 IST