వాటర్ ట్యాంకర్‌పై కొత్త జంట పెళ్లి ఊరేగింపు.. హనీమూన్‌ కూడా రద్దు: ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2022-07-08T21:22:14+05:30 IST

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవడం ఒక్కొక్కరు ఒక్కో రకమైన పంథా అనుసరిస్తారు.

వాటర్ ట్యాంకర్‌పై  కొత్త జంట పెళ్లి ఊరేగింపు.. హనీమూన్‌ కూడా రద్దు: ఎందుకో తెలుసా?

పూణె: సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవడం ఒక్కొక్కరు ఒక్కో రకమైన పంథా అనుసరిస్తారు. కొందరు ధర్నాలు చేస్తే ఇంకొందరు రహదారులను దిగ్బంధిస్తారు. ఇంకొందరు ఆందోళనకు దిగుతారు. కొందరు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారు. ఎవరు ఏం చేసినా వారి అంతిమ లక్ష్యం సమస్యల పరిష్కారమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ (Kolhapur)కు చెందిన ఓ జంట ఓ అడుగు ముందుకేసి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.


తమ ప్రాంతంలో నీటి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో 32 ఏళ్ల కొత్త పెళ్లి కొడుకు విశాల్ కోలేకర్ వినూత్నంగా ఆలోచించాడు. పెళ్లి అనంతరం తమ ఊరేగింపు కోసం వాటర్ ట్యాంకర్ (Water Tanker) ఎంచుకున్నాడు. దానిపైనే వధూవరులిద్దరూ ఉరేగింపుగా వెళ్లారు. పెళ్లి ఊరేగింపు కోసం వాటర్ ట్యాంకు ఎందుకు ఎక్కాల్సి వచ్చిందన్న దానిపై విశాల్ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ క్లబ్’ పేరుతో తమకో సోషల్ గ్రూప్ ఉందని పేర్కొన్నాడు. తమ ప్రాంతం మంగళవార్‌పేటలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయాడు.  తమ ప్రిన్స్ క్లబ్ ప్లాట్‌ఫాం ద్వారా సమస్యను ఎన్నోమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నీటి పంపిణీ సరిగా లేకపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకులను తెప్పించుకోవాల్సి వస్తుందని చెప్పాడు. 


అందుకనే తమ పెళ్లి ఊరేగింపు కోసం కారుకు బదులుగా వాటర్ ట్యాంకును ఎంచుకున్నట్టు చెప్పారు. భార్య అపర్ణతో కలిసి ఎంచక్కా దానిపైనే ఊరేగాడు. అంతేకాదు, తమ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు హనీమూన్‌ (Honeymoon)కు కూడా వెళ్లేది లేదంటూ వారు ఊరేగిన వాటర్ ట్యాంకర్‌కు బ్యానర్ కూడా తగిలించారు. 

Updated Date - 2022-07-08T21:22:14+05:30 IST