కొలకలూరులో కొనసాగుతున్న వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-07-02T05:14:58+05:30 IST

కొలకలూరులో డయోరియా లక్షణాలతో ఉన్న బాధితులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి.

కొలకలూరులో కొనసాగుతున్న వైద్యసేవలు
దళిత వాడలో కాలువలు శుభ్రం చేస్తున్న పారిశుధ్యకార్మికులు

తెనాలి రూరల్‌, జూలై 1: కొలకలూరులో డయోరియా లక్షణాలతో ఉన్న బాధితులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి శుక్రవారం ఉదయం నుండి గ్రామంలోని ఉంటూ బాధితులకు వైద్యసేవలు అందుతున్న తీరు. మినరల్‌ వాటర్‌ పంపిణీ వంటివాటిని స్వయంగా పరిశీలించారు. గురువారం రాత్రివరకు 19 కేసులు నమోదు కాగా శుక్రవారం 26 కేసులు నమోదు అయ్యాయి. వారిలో అత్యవసరవైద్యం అవసరమైన వారిని తెనాలి, గుంటూరు ప్రభుత్వవైద్యశాలలకు తరలించారు. ప్రస్తుతం గ్రామంలోని దళిత వాడలో పారిశుధ్యకార్మికులు కాలువ పూడికతీత పనులు చేపట్టి, ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చిమ్ముతూ పరిశుభ్రవాతావరణం చేకూర్చేలా చర్యలు చేపట్టారు.

ఆంధ్రజ్యోతి కఽఽథనంతో కదిలిన పంచాయతీ యంత్రాంగం

 కొలకలూరులోని దళిత వాడలో సమస్యలను తెలుపుతూ అధ్వానంగా దళిత వాడ అనే శిర్షిక శుక్రవారం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ యంత్రాంగం పారిశుధ్యకార్మికులతో కాలువల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించి నీరు పారుదలకు చర్యలు, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చిమ్మి పరిశుభ్రవాతావరణం నెలకొల్పేందుకు పనులు చేపట్టారు.

బాధితులను పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యే

కొలకలూరు దళితవాడలో వాంతులు, విరోచనాలతో మృతి చెందిన శ్రీనిధి ( 14) కుటుంబసభ్యులను గురువారం అర్థరాత్రి  మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పరామర్శించారు. పాప చనిపోయిన విషయం తమను కూడా మనోవేదనకు గురిచేసిందని మంత్రి, ఎమ్మెల్యే బదులిచ్చారు. బాధిత కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అనంతరం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

మృతురాలి కుటుంబసభ్యులకు రూ. 25లక్షలు అందించాలి

కొలకలూరులో వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్యసమస్యలతో మృతిచెందిన శ్రీనిధి (14) కుటుంబసభ్యులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం వెంటనే రూ.25లక్షలు అందించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కలిపించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఉన్నం ధర్మారావు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం తరుపున ఎటుంటి హామీ లేదు 

పాప మృతి చెందిన విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు తమ ఇంటికి వచ్చి పరామర్శించారని మృతురాలి తండ్రి గొరికపూడి కోటేశ్వరరావు అన్నారు. ఎలా మృతి చెందింది అన్న విషాయాన్ని అడిగారని వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్యసమస్యలు తలెత్తి మృతిచెందిందని తెలిపామన్నారు. కనీసం ప్రభుత్వం తరుపున ఎటుంటి హామి కూడా తమకు ఇచ్చిందిలేదని ఆరోపించారు. తమ ప్రాంతంలో మురుగు కాలువలు అధ్వానంగా తయారయ్యాయని వాటిని పూడికలు తీయడంలో అధికార యంత్రాంగం నిర్లక్షంగా వ్యవరించారన్నారు. కాలనీకి వచ్చె మంచినీటిపైపుల్లో లీకులు వంటివి వచ్చి నీరు కలుషితమవ్వడం వల్ల పాపకు అనారోగ్యసమస్యలు ఉత్పన్నమయ్యాయని గంటల వ్యవధిలోనే తమ పాపను కోల్పోయామని తల్లి మనెమ్మ విలపిస్తూ తెలిపింది. పాప చనిపోయేంత వరకూ కూడా అధికార యంత్రాంగం స్పందించలేదని ఇప్పుడు మాత్రం కాలువలు పూడికలు తీస్తున్నారని ఇదే ముందుగా చేపడితే తమ పాపను కోల్పోయేవారిమి కాదని తమకు ఈ సోకం ఉండేది కాదని వాపోయారు.


Updated Date - 2022-07-02T05:14:58+05:30 IST