కోహ్లీ-రూట్ బాహాబాహీ.. గ్రూపులుగా విడిపోయిన క్రికెటర్లు!

ABN , First Publish Date - 2021-08-25T23:52:17+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ జో రూట్ ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారా? ఇరు

కోహ్లీ-రూట్ బాహాబాహీ.. గ్రూపులుగా విడిపోయిన క్రికెటర్లు!

లీడ్స్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ జో రూట్ ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారా? ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగతంగా కలబడేంత వరకు వెళ్లారా? అవుననే అంటోంది బ్రిటిష్ మీడియా. లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత కోహ్లీ, రూట్ మధ్య లార్డ్స్ పెవిలియన్ లాంగ్ రూమ్ వేదిక తీవ్ర వాగ్వివాదం జరిగిందని, ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయారని సంచలన కథనాన్ని ప్రచురించింది.


‘టెలిగ్రాఫ్ స్పోర్ట్స్’ కథనం ప్రకారం లార్డ్స్ టెస్టులో మూడో రోజు రూట్ భారీ శతకం తర్వాత ఆ ఘర్షణకు బీజం పడినట్టు సమాచారం. ఆ మ్యాచ్‌లో 11వ నంబరు ఆటగాడిగా బరిలోకి దిగిన అండర్సన్‌ను లక్ష్యంగా చేసుకున్న బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించి బెంబేలెత్తించాడు. ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులు విసరడంతో అండర్సన్ గాయపడ్డాడు. దీన్ని మనసులో పెట్టుకున్న అండర్సన్ అవుటైన తర్వాత బుమ్రాను దూషించాడు.


ఆ తర్వాత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూముకు వెళ్తున్నప్పుడు రూట్, కోహ్లీకి మధ్య వాగ్వివాదం జరిగింది. చూస్తుంటే ఇది ఇద్దరు చేయి చేసుకునేంత వరకు వెళ్లేలా కనిపించిందని ‘టెలిగ్రాఫ్ స్పోర్ట్స్’ ఆ కథనంలో పేర్కొంది. లార్డ్స్ టెస్టు మూడో రోజు చివరి సెషన్‌లో తనకు, ఇండియా ఆటగాళ్లకు మధ్య ఏమైందనే విషయాన్ని పేసర్ జేమ్స్ అండర్సన్ ఇప్పటికే వెల్లడించాడు. బుమ్రా వరుస బౌన్సర్ల తర్వాత ఇరు జట్ల మధ్య రాజుకున్నఅగ్గి మ్యాచ్ ముగిసే వరకు రగులుతూనే ఉంది. ఈ ప్రభావం మూడో టెస్టుపైనా పడుతుందని భావిస్తున్నారు.   

Updated Date - 2021-08-25T23:52:17+05:30 IST