కోహ్లీ, రోహిత్‌లకు వార్నింగ్‌?

ABN , First Publish Date - 2022-06-22T09:51:00+05:30 IST

కొవిడ్‌ భయం పెద్దగా లేకపోవడంతో భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.

కోహ్లీ, రోహిత్‌లకు వార్నింగ్‌?

మాస్కుల్లేకుండా షాపింగ్‌కు ..

కొవిడ్‌తో జాగ్రత్త: బీసీసీఐ

ఇంగ్లండ్‌ చేరిన ద్రవిడ్‌

అశ్విన్‌కు కరోనా


లీసెస్టర్‌షైర్‌: కొవిడ్‌ భయం పెద్దగా లేకపోవడంతో భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. బయోబబుల్‌ లేకుండానే ఈసారి విదేశీ పర్యటనకు వచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ ఖాళీ సమయాల్లో షాపింగ్‌, షికార్లకు వెళుతున్నారు. అయితే ఈసమయంలో వీరంతా కొవిడ్‌ నిబంధనలు పాటించడం మరచిపోతున్నారు. అంతేకాకుండా.. అటుగా వచ్చిన అభిమానులకు షేక్‌హ్యాండ్స్‌ ఇస్తూ ఫొటోలు సైతం దిగుతున్నారు. స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇలాగే ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ సమయంలో వీరికి మాస్క్‌లు కూడా లేవు.


అటు ఇలాంటి చర్యలపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ విరాట్‌, రోహిత్‌లను హెచ్చరించాలని భావిస్తోంది. ‘యూకేలో కొవిడ్‌ కేసులు చాలావరకూ తగ్గినప్పటికీ క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించే బయట తిరగాలి’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు. ఇదిలావుండగా యూకేలో ఇప్పటికీ రోజుకు 10వేల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకవేళ ఆటగాళ్లకు కరోనా సోకితే ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. దీనికితోడు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం కష్టమే. అందుకే కరోనా విషయంలో ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది.


జట్టులో చేరిన ద్రవిడ్‌, పంత్‌

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు వైస్‌కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ సోమవారం బెంగళూరు నుంచి లండన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మంగళవారం లీసెస్టర్‌షైర్‌కు చేరిన ఈ త్రయం ప్రస్తుతం భారత జట్టుతోనే ఉంది. అంతేకాకుండా నెట్స్‌లో పాల్గొన్న క్రికెటర్లకు ద్రవిడ్‌ సూచనలిస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇక ఐర్లాండ్‌ టూర్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆటగాళ్లతో కలిసి ఈనెల 23 లేక 24న డబ్లిన్‌కు పయనం కానున్నాడు. ఈ టూర్‌కు ఎంపికైన ప్లేయర్స్‌కు మూడు రోజుల విశ్రాంతినిచ్చారు.


క్వారంటైన్‌లో అశ్విన్‌ 

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టు ఆడాల్సిన అశ్విన్‌ ఇంకా స్వదేశంలోనే ఉన్నాడు. అతను కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇందుకు కారణం. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఈ స్పిన్నర్‌ కరోనా నుంచి కోలుకున్నాక ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఇంగ్లండ్‌కు బయలుదేరుతాడని బీసీసీఐ పేర్కొంది. ఆటగాళ్లంతా ఈనెల 16నే ఇంగ్లండ్‌కు బయలుదేరారు. అయితే ఆ సమయానికే అశ్విన్‌ పాజిటివ్‌గా తేలడంతో ఇక్కడే ఉండిపోయాడు. దీంతో లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో జరిగే వామప్‌ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. టెస్టు సమయానికల్లా కోలుకుంటాడని బోర్డు ఆశిస్తోంది. ప్లేఆ్‌ఫ్సలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి తర్వాత అశ్విన్‌ తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో డివిజన్‌ 1లీగ్‌లో ఆడాడు. అందులో 20 ఓవర్లపాటు బౌలింగ్‌ కూడా చేశాడు. ఈ టోర్నీలోనే అతడికి కరోనా సోకినట్టు సమాచారం.

Updated Date - 2022-06-22T09:51:00+05:30 IST