బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లీ

ABN , First Publish Date - 2022-01-19T02:16:18+05:30 IST

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి ఏమంటూ తప్పుకున్నాడో కానీ విరాట్ కోహ్లీ నిత్యం వార్తల్లో

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి ఏమంటూ తప్పుకున్నాడో కానీ విరాట్ కోహ్లీ నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. టీ20 కెప్టెన్సీని వదిలేసుకున్న తర్వాత బీసీసీఐ కోహ్లీకి షాకిస్తూ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేసింది. వన్డే, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఎందుకన్న ఆలోచనతోనే ఆ పని చేశామని బీసీసీఐ ఆ తర్వాత వివరణ ఇచ్చింది.


ఈ వివాదం కొనసాగుతుండగానే భారత జట్టు దక్షిణాఫ్రికా ఫ్లైటెక్కింది. సఫారీ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు దారుణ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు. దీంతో టెస్టు జట్టును మోసే ఆటగాడి కోసం బోర్డు గాలిస్తోంది. 


టెస్టు కెప్టెన్సీ నుంచి తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని కోహ్లీ ముందుగానే బీసీసీఐ అధికారులకు తెలియజేశాడు. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి ఉండడంతో వందో టెస్టు మ్యాచ్‌ను హోం గ్రౌండ్ అయిన బెంగళూరులో ఆడి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బాగుంటుందని బీసీసీఐ సూచించింది.


అంతేకాదు, ఆ  టెస్టు తర్వాత ఘనంగా సన్మానిస్తామని కూడా బీసీసీఐ చెప్పిందట. అయితే, కోహ్లీ దీనిని సున్నితంగా తిరస్కరించాడు. ఒక్క మ్యాచ్‌తో పరిస్థితులు ఏమీ మారిపోవని, కాబట్టి తనకు అలాంటి సన్మానాలేవీ అక్కర్లేదని తేల్చి చెప్పాడట.

Updated Date - 2022-01-19T02:16:18+05:30 IST