కోట్లాట..!

ABN , First Publish Date - 2021-01-16T06:02:03+05:30 IST

కోట్లాట..!

కోట్లాట..!
కిటకిటలాడిన అంబాపురం వద్ద ఏర్పాటుచేసిన బరులు

ఎవరేమన్నా.. ఎవరెన్ని హెచ్చరికలు చేసినా.. సంక్రాంతి పండుగలో చిట్టచివరికి కోడే గెలిచింది. అట్టా ఇట్టా కాదు.. కరోనా కష్టకాలంలోనూ జనాల నుంచి రూ.100 కోట్లు తన ఖాతాలో వేసుకోగలిగినంత బంపర్‌ గెలుపు మన కోడిది. భోగిరోజు మొదలైన కోడి కూతలు కనుమ వరకూ మార్మోగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఈ సంక్రాంతి సీజన్‌ బరిలో సుమారు రూ.100 కోట్ల పైచిలుకు కాసుల వర్షం కురిసిందని జిల్లా మొత్తం కోడైకూస్తోంది. 

ఈ సంక్రాంతి సీజన్‌లో కోడి ఖాతాలో రూ.100 కోట్లు

ఒక్క గుడివాడలో గడ్డం గ్యాంగ్‌ ఆధ్వర్యంలోనే రూ.50కోట్ల వరకు పందేలు

పేకాట, గుండాట, కోతముక్క కూడా.. జూ అధికార పార్టీ నేతలే నిర్వాహకులు

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కాస్త కట్టడి

జిల్లాలో మాత్రం పోటెత్తిన బరులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలతో కఠినంగా కట్టడి చేసినా.. అక్కడక్కడ కోడి పందేలు బాగానే జరిగాయి. ఇక జిల్లాలో మాత్రం భారీస్థాయిలో బరులు వెలిశాయి. జనం కిటకిటలాడారు. అధికార పార్టీ నాయకుల నేతృత్వంలోనే బరులు నడవటంతో పందెపురాయుళ్లు ఎలాంటి జంకు లేకుండా పందేల్లో పాల్గొన్నారు. కొన్నిచోట్ల పురుషులకు ధీటుగా మహిళలూ పందేలు వేశారు. పందేలతో పాటు గుండాట, కోతముక్క నిర్వహించారు. మంత్రి కొడాలి నాని కనుసన్నల్లో గుడివాడ సమీపంలోని కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బరుల్లో కోతముక్క, కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. పొరుగు జిల్లాల నుంచీ వచ్చారు. ఒక్క గుడివాడ బరిలోనే మూడు రోజుల్లో రూ.50 కోట్ల మేర చేతులు మారాయని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో పందెం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆడారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఒకరు పది కోళ్లతో వచ్చి 10 పందేల్లో కృష్ణాజిల్లాకు చెందిన పందెపురాయుళ్లను ఓడించి సుమారు రూ.5కోట్లు పట్టుకెళ్లారు. కే కన్వెన్షన్‌కు వెళ్లే దారులన్నీ ఈ మూడు రోజులూ కిటకిటలాడాయి. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ కోడి పందేలు వీక్షించేందుకు కే కన్వెన్షన్‌కు వచ్చారు. డోకిపర్రులో నటుడు విశాల్‌ సందడి చేశారు. మచిలీపట్నంలోనూ పందేలు భారీగా నిర్వహించారు.

పరిటాలలో కోడి పందేల బరుల వద్ద పందెపురాయుళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

ఎ.కొండూరు మండలంలోని గోపాలపురం గ్రామంలో పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగాయి. 

కోడూరు మండలంలో కోడి పందేలు, జూదాలు రాత్రీపగలు నడిచాయి. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి మరీ నిర్వహించారు. ఓ పాఠశాలలో కోడి పందేల నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడే పందేలు, జూదాలు నడిచాయి. పాఠశాలలో పందేల నిర్వహణపై గ్రామస్థులు నిరసన వ్యక్తంచేసినా ఎవరూ పట్టించుకోలేదు. 

మొవ్వ మండలంలో మూడు రోజుల పాటు కోడి పందేలు సాగాయి. అయ్యంకి, కారకంపాడు, కోసూరు, కూచిపూడి ప్రాంతాల్లో పందేలు నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే కేపీ సారథి తన స్వగ్రామమైన కారకంపాడులో కోడి పందేలు తిలకించారు.  

కంకిపాడు మండలంలోని ఉప్పలూరు, గొడవర్రు గ్రామాల్లో పందేలు నిర్వహించారు. బుధవారం వరకు ఇక్కడ ఎలాంటి సందడి లేదు. గురువారం ఉదయం నుంచి కోడి పందేలు, పేకాట, గుండాట, చిన్నబజార్‌, పెద్దబజార్‌.. ఇలా అన్ని రకాల ఆటలు మొదలయ్యాయి.  

బాపులపాడు మండలంలోని ఎస్‌ఎన్‌ పాలెం, బిళ్లనపల్లి, కొత్తపల్లి, వేలేరు, కానుమోలు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు. అంపాపురంలో నిర్వహించిన కోడి పందేలకు పొరుగు రాష్ట్రాల వారూ హాజరయ్యారు. ఆరుగొలను, ఓగిరాల గ్రామాల్లో అధికార పార్టీ  నేతల అండతో కోతముక్క పందేలు నిర్వహించారు. ఇళ్లు, పొలం పట్టాలను తనఖా పెట్టి మరీ ఇక్కడ పందేలు నడిచాయి. అంపాపురం ప్రధాన బరిలో ఒక్కో పందెం రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు నడిచింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పందెపురాయుళ్లు తరలిరావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 

పార్కింగ్‌ ఫీజు పేరుతో దోపిడీ

కోడి పందేల శిబిరాల వద్ద వాహనాల పార్కింగ్‌ ఫీజు పేరుతో దోపిడీ చేశారు. గుడివాడ కే కన్వెన్షన్‌లో, బాపులపాడు మండలం అంపాపురం తదితర బరుల వద్ద కారుకు రూ.500, బైకుకు రూ.100 పార్కింగ్‌ ఫీజు వసూలు చేశారు. వీటితో పాటు కోతముక్క, గుండాట ఆడే దుకాణాలకు అద్దె  భారీగా వసూలు చేశారు. మూడు రోజులకు ఒక్కో 

దుకాణం అద్దె రూ.50వేలు వరకు పలికింది. 

పందెంలో ఓడిన కోడికి రూ.20వేలు

పందెంలో ఓడిపోయిన కోడి కూడా యజమానులకు కాసుల వర్షం కురిపించింది. ఒక్కో కోడి రూ.20వేల వరకూ ధర పలికింది. గతంలో రూ.10వేలలోపే ధర ఉండేదని, ఈసారి ధర రెట్టింపు అయిందని కొనుగోలుదారులు వాపోయారు. 









Updated Date - 2021-01-16T06:02:03+05:30 IST