తీరంలో జోరుగా కోడిపందాలు

ABN , First Publish Date - 2021-02-25T06:38:17+05:30 IST

తీరప్రాంతం కోడి పందాలకు అడ్డాగా మారుతోంది.

తీరంలో జోరుగా కోడిపందాలు
కోడిపందాల వద్ద గుమిగూడిన పందెం రాయుళ్లు

   ఐదెకరాల విస్తీర్ణం.. అన్ని హంగులతో రెండు బరులు.. ఒక్కో బరిలో లక్షల్లో పందాలు.. యథేచ్ఛగా మద్యం.. ఇదేం సంక్రాంతి పండుగ సీజన్‌ కూడా కాదు..! అయినా తీర ప్రాంతంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ పందాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీకి చెందిన నాయకులు నాయకులే ఈ బరులను నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

చెన్నుపల్లివారిపాలెం వద్ద కోడి పందాలు

పోలీస్‌స్టేషన్‌కు 5 కి.మీ సమీపంలోనే..

అన్ని హంగులతో రెండు బరులు

మూడు జిల్లాలనుంచి తరలివస్తున్న పందెం రాయుళ్లు

కన్నెత్తి చూడని ఖాకీలు

 

గుంటూరు, ఫిబ్రవరి 24: తీరప్రాంతం కోడి పందాలకు అడ్డాగా మారుతోంది. రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెం 8వ నెంబరు కాలవ సైఫన్‌ దగ్గర కోడిపందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా వారు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇక్కడ ఏకంగా ఐదెకరాల స్థలాన్ని చదునుచేసి అన్ని హంగులతో రెండు బరులను ఏర్పాటు చేశారు. కార్లు, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు వీలుగా పొక్లెయినర్‌తో పొలాల్లో రహదారిని ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కోడిపందాలు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ఒక బరి నిర్వహించగా, రూ.5వేల నుంచి రూ.50వేల వరకు మరో బరి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. నిర్వాహకులు పందానికి 30 శాతం కమీషన్‌ తీసుకుంటూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.


అధికార పార్టీ నేతల అండదండలతోనే..!

అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. అటు పోలీస్‌ యంత్రాంగం, నాయకుల అండదండలు మెండుగా ఉండటంతో ఇస్టానుసారంగా పందాలు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేలాదిగా పందెం రాయుళ్ళు పాల్గొని లక్షలాది రూపాయలు పందాలు కాస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతంలో పేకాట, కోడిపందాలకు నిలయంగా మారిపోతున్నాయని ఇక్కడి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల పంట పొలాలవారు రెండో పంట మినుము, పెసలు, మొక్కజొన్న వేశారు. పందెం రాయుళ్ళు వాటిపై ఇష్టానుసారంగా తిరగటంతో పంటంతా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిపందాల వద్దే అల్పాహారం, బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ ఏర్పాటు చేశారు. మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. తొలిరోజు వందలాది ద్విచక్రవాహనాలు, కార్లలో పందెరాయుళ్లు రావడం విశేషం!


Updated Date - 2021-02-25T06:38:17+05:30 IST