పాలకులకు పట్టని కులవృత్తి పేదలు

ABN , First Publish Date - 2020-07-08T06:17:38+05:30 IST

కరోనా కాటుకి బలవుతున్న కులవృత్తి శ్రమజీవులు కోరుకునేది ఈ కష్టకాలంలో కొంత ఆర్థిక సహాయం. వైరస్‌కి భయపడి సెలూన్‌లకి ఎవరూ పోవట్లేదు. నాయి బ్రాహ్మణులు షాపులు తెరిచినా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు.

పాలకులకు పట్టని కులవృత్తి పేదలు

కరోనా కాటుకి బలవుతున్న కులవృత్తి శ్రమజీవులు కోరుకునేది ఈ కష్టకాలంలో కొంత ఆర్థిక సహాయం. వైరస్‌కి భయపడి సెలూన్‌లకి ఎవరూ పోవట్లేదు. నాయి బ్రాహ్మణులు షాపులు తెరిచినా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. నాయి బ్రాహ్మణులకు మూడు సంవత్సరాలలో 750 కోట్లు కేటాయించి వారిని పెద్ద ఎత్తున హేయిర్‌ స్టైలిస్టులుగా తయారుచేసి, జావెద్‌ హబీబ్‌, లోరియల్‌ వంటి వాటితో పోటీ పడేలా చేస్తామని ప్రభుత్వం 2017లో ప్రకటించింది. ఏ ఒక్కరికీ చిల్లి గవ్వ అందలేదు. కరోనాతో బాగా అవస్థపడేది చాకలి, మంగళి, కుమ్మరి, చేనేత, మేదరి, బెస్త, వడ్డెర వంటి కులవృత్తి కార్మికులు. అయినా, మన పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వీరికి ఎటువంటి ఆర్థిక సహాయం చెయ్యడం లేదు. కరోనా కాలంలో చాకలి వారిని పని మానిపించేశారు ఇంటి ఓనర్లు. కుల వ్యవస్థ వీరికి అవమానంతో పాటు పేదరికాన్నీ తోడుగా ఇచ్చింది. చేనేత కార్మికులు హరప్పా కాలం నుండి అన్ని కులాల తాత ముత్తాతలకి కప్పుకోవడానికి బట్టలిచ్చి శరీరాన్ని కాపాడారు. ఈ బట్టలను ఉతికేది చాకలివారు. భ్రష్టకులాలుగా పరిగణింపబడ్డవారు ఉండకపోతే పై జాతుల జీవితం అసాధ్యం. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన చిన్నకులాల గోడు ఈ కరోనా కాలంలో పాలకులకు ఎందుకు వినిపించడం లేదు? ఎవరికైనా ఆర్థిక సహాయం కోరాలంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది కానీ, అడగకపోతే కుటుంబాన్ని సాదలేని స్థితి. కులవృత్తి కార్మికులు ప్రభుత్వాన్ని సాయం కోరుతుంటే ఆదుకోవడం పాలకుల బాధ్యత.


కోడెపాక రోహిత్‌ 

Updated Date - 2020-07-08T06:17:38+05:30 IST