Kodanadu కేసు విచారణ జరిపిన ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృతి

ABN , First Publish Date - 2022-07-03T12:57:33+05:30 IST

కొడనాడు ఎస్టేట్‌లో వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ వ్యవహారాన్ని విచారించిన ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నీలగిరి జిల్లా కోతగిరి సమీపం

Kodanadu కేసు విచారణ జరిపిన ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృతి

ప్యారీస్‌(చెన్నై), జూలై 2: కొడనాడు ఎస్టేట్‌లో వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ వ్యవహారాన్ని విచారించిన ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నీలగిరి జిల్లా కోతగిరి సమీపం సోల్లూరుమఠం పోలీస్‏స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా మూడేళ్ల క్రితం మహమ్మద్‌ రఫీక్‌ (38) బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం ఆయన కోతగిరి ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఖైదీని విచారించేందుకు కానిస్టేబుల్‌ అబుదాగీర్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై వెళ్లారు. విచారణ ముగిసిన అనంతరం కడవీధిలోని మసీదులో ఇన్‌స్పెక్టర్‌  నమాజులో పాల్గొన్నారు. అనంతరం ఆయన స్టేషన్‌కు బయల్దేరారు. కొడనాడుకు వెళ్లే మార్గంలో రహదారుల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణపనులు జరుగుతున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ రఫీక్‌ ఆ మార్గంగా వస్తున్న సమయంలో హఠాత్తుగా మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కంకరరాళ్ల గుట్టను ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఐ, అబుదాగీర్‌ కింద పడిపోయారు. అదే సమయంలో తేయాకు మూటలు తీసుకెళ్తున్న లారీ కిందపడ్డ ఎస్‌ఐ మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఎస్‌ఐ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్సకు, ఎస్‌ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహమ్మద్‌ రఫీక్‌కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కాగా, కొడనాడు ఎస్టేట్‌ హత్య, దోపిడీ వ్యవహారంలో తొలుత ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీక్‌ విచారించి ఉండగా, ప్రస్తుతం ఆ కేసును ప్రత్యేక బృందం విచారిస్తోంది. బాధిత కుటుంబాన్ని ఊటీ ఏడీఎస్పీ మహేశ్వరన్‌ పరామర్శించి సంతాపం తెలిపారు.

Updated Date - 2022-07-03T12:57:33+05:30 IST