Bangalore: కొడగులో నిషేధాజ్ఞలు

ABN , First Publish Date - 2022-08-24T17:31:20+05:30 IST

రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య కాన్వాయ్‌పై కొడగులో కోడిగుడ్లు విసిరిన ఘటన పెను వివాదంగా మారి ‘మడికేరి చలో’కు కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో

Bangalore: కొడగులో నిషేధాజ్ఞలు

- నిరసన ర్యాలీని వాయిదా వేసుకున్న కాంగ్రెస్‌ 

- ఇది ప్రభుత్వ కుట్రే : డీకే శివకుమార్‌ 

- బీజేపీ నేతలకు కునుకు కరువు: సిద్దరామయ్య

 - శాంతిభద్రతల పరిరక్షణ కోసమే : సీఎం 

- ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీలో భిన్నస్వరాలు

-  కొడగును మరో కశ్మీర్‌గా మార్చేస్తున్నారు : కుమారస్వామి


బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య కాన్వాయ్‌పై కొడగులో కోడిగుడ్లు విసిరిన ఘటన పెను వివాదంగా మారి ‘మడికేరి చలో’కు కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం నుంచి ఈనెల 27 వరకు జిల్లా అంతటా నిషేధాజ్ఞలను విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధాజ్ఞల నేపథ్యంలో కాంగ్రెస్‌(Congress) తాత్కాలికంగా తన ర్యాలీని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలందరితో చర్చించిన తర్వాతే చట్టాన్ని గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్‌ ర్యాలీని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కావాలనే కొడగులో జనజాగృతి సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. తనపై కోడిగుడ్లతోపాటు రాళ్లు కూడా విసిరారని ప్రతిపక్షనేత ఆరోపించారు. దావణగెరె సభ భారీగా సక్సెస్‌ అయినప్పటి నుంచి బీజేపీ నేతల కంటిపై కునుకు కరువైందని ఆయన ఎద్దేవా చేశారు. కొడగు జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు 144 సెక్షన్‌ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు మాజీ స్పీకర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే కేజీ బోపయ్య ప్రకటించారు. చట్టాన్ని అందరూ గౌరవించాలన్నారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా నిబంధనలకు అనుగుణంగా జనజాగృతి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. వీరసావర్కర్‌ కరపత్రాలను ప్రజలకు జిల్లా అంతటా పంచిపెడతామన్నారు. నిషేధాజ్ఞల అవసరం ఏం వచ్చిందని జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అప్పచ్చురంజన్‌ ప్రశ్నించారు. సిద్దరామయ్య, కాంగ్రె్‌సపై ప్రజల్లో ఆక్రోశం తీవ్రస్థాయిలో ఉందన్నారు. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలే కారణమన్నారు. 


ఇది ప్రభుత్వ కుట్రే : డీకే శివకుమార్‌ 

మడికేరిలో హఠాత్తుగా నిషేధాజ్ఞలు జారీ కావడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని, కాంగ్రెస్‌ ర్యాలీని అడ్డుకోవడమే దీన్ని లక్ష్యంగా ఉందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar) ఆరోపించారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలా చట్టాలను అపహాస్యం చేయడం తమకు తెలియదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. 


శాంతిభద్రతల పరిరక్షణకోసమే : సీఎం 

మడికేరిలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు 144 సెక్షన్‌ విధించడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) గట్టిగా సమర్థించుకున్నారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగురోజులపాటు ఎలాంటి ర్యాలీలు, సభలకు జిల్లాలో అనుమతులు ఉండవన్నారు. మడికేరిలో శుక్రవారం ఘర్షణలు సృష్టించేందుకు ఎస్‌డీపీఐ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 


మైసూరులో వీరసావర్కర్‌ రథయాత్ర 

మైసూరులో వీరసావర్కర్‌ రథయాత్ర మంగళవారం వివాదాల మధ్యే ప్రారంభమైంది. ప్రజలకు వీరసావర్కర్‌ గురించి నిజాలు చెప్పేందుకే యాత్ర నిర్వహిస్తున్నామని మైసూరు ఎంపీ ప్రతా్‌పసింహ మీడియాకు తెలిపారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీలను మైనారిటీ వ్యతిరేకులుగా చిత్రీకరించిన శక్తులే తాజాగా వీరసావర్కర్‌ను కూడా చిత్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప కూడా పాల్గొన్నారు. 


కొడగును మరో కశ్మీర్‌గా మార్చేస్తున్నారు 

భిన్నమతాలు, సంస్కృతులకు నిలయంగా ఉన్న కొడగును మరో జమ్ము-కశ్మీర్‌గా మార్చేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయని జేడీఎస్‌ మండిపడింది. బెంగళూరులో మంగళవారం కొడగులో శాంతి కాపాడేందుకు సంబంధించి స్థానిక పార్టీ నేతలతో కుమారస్వామి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జాతీయ పార్టీల కుట్రలకు బలి కావద్దని, సామరస్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-24T17:31:20+05:30 IST