మీ షుగర్‌.. ఏ టైప్‌?

ABN , First Publish Date - 2020-06-14T07:45:49+05:30 IST

మధుమేహం.. అని యథాలాపంగా చెప్పేస్తాంగానీ, అందులో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలున్నాయి. వీటిలో టైప్‌-1 మధుమేహం పిల్లల్లో, యుక్తవయసువారికి, టైప్‌-2 మధుమేహం జీవనశైలి లోపాల వల్ల ఎక్కువగా 40 ఏళ్లు దాటినవాళ్లకి వస్తాయనే భావన ఉంది...

మీ షుగర్‌.. ఏ టైప్‌?

  • మధుమేహుల్లో తేడా చెప్పే జన్యువులు
  • సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ చాదక్‌ బృందం అధ్యయనం
  • భారతీయులకు ఎంతో ఉపయోగమని వెల్లడి

మధుమేహం.. అని యథాలాపంగా చెప్పేస్తాంగానీ, అందులో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలున్నాయి. వీటిలో టైప్‌-1 మధుమేహం పిల్లల్లో, యుక్తవయసువారికి, టైప్‌-2 మధుమేహం జీవనశైలి లోపాల వల్ల ఎక్కువగా 40 ఏళ్లు దాటినవాళ్లకి వస్తాయనే భావన ఉంది. కానీ.. యుక్తవయస్కులకు టైప్‌-2 మధుమేహం.. 45 ఏళ్లు దాటినవారికీ టైప్‌-1 మధుమేహం వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఈ రెండు రకాల వారికీ చికిత్సావిధానం వేరుగా ఉంటుంది. అందువల్ల ఎవరికిఏ తరహా మధుమేహం ఉందనే విషయం సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయాన్ని నిర్ధారించటంలో కొన్నిసార్లు డాక్టర్లు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)’కి చెందిన డాక్టర్‌ చాదక్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు.. పుణేకి చెందిన కిమ్‌ ఆస్పత్రి, బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌టర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి అధ్యయనం చేశారు. ఒక వ్యక్తి టైప్‌-1 మధుమేహంతో బాధపడుతున్నాడా లేక టైప్‌-2తోనా? అనే విషయాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవచ్చని వారి అధ్యయనంలో తేలింది.


‘‘ఇప్పటి దాకా మధుమేహాన్ని కలుగజేసే జన్యువులకు కనుగొనటానికి యూర్‌పలోని ప్రజల జన్యుక్రమాలను మాత్రమే ఉపయోగించేవారు.  భారతీయులలో టైప్‌-1 మధుమేహం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కూడా ఆ ఫలితాలనే వాడేవారు. ప్రస్తుతం మన దేశంలో అనుసరిస్తున్న విధానాలన్నీ అలాంటివే! ‘‘తొలిసారి భారతీయులకు సంబంధించిన జన్యుక్రమాలను వాడి- జీన్‌ రిస్క్‌ స్కోర్‌ను రూపొందించాం. దీని ఆధారంగా  టైప్‌-1 మధుమేహం ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు’’ అని ఆంధ్రజ్యోతికి ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ చాదక్‌  వివరించారు. 


ఎలా చేశారు..?

డాక్టర్‌ చాదక్‌ బృందం పుణెకు చెందిన సుమారు 900 మంది జన్యుక్రమాలను సేకరించి విశ్లేషించింది. వారిలో టైప్‌-1, 2 మధుమేహ రోగులతో పాటుగా మధుమేహం లేని వారు కూడా ఉన్నారు. ఆ జన్యుక్రమాలను యూర్‌పలో జరిపిన వెల్‌కం ట్రస్ట్‌ కేస్‌ కంట్రోల్‌ కన్సార్షియం అధ్యయన ఫలితాలతో పోల్చి చూశారు. ‘‘మొత్తం తొమ్మిది జన్యు ప్రాంతాల్లో (వీటిని శాస్త్ర పరిభాషలో ఎస్‌ఎన్‌పీలు) తేడాలు ఉన్నాయని మా తులనాత్మక అధ్యయనంలో  తేలింది. అంటే ఏ తరహా మధుమేహం అనే విషయాన్ని నిర్ధారించే సమయంలో ఈ జన్యుప్రాంతాలను విశ్లేషిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి’’ అని చాదక్‌ వెల్లడించారు. తమ పరిశోధన వల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రాథమిక పరీక్షలు చేసి రక్తంలో గ్లూకోజ్‌ శాతం ఎక్కువ ఉందని నిర్ధారిస్తారు. ఆ తర్వాత టైప్‌-1 లేక టైప్‌-2 ఉందా అనే దానికి ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. మా పద్ధతిలో- తొమ్మిది జన్యు ప్రాంతాలనూ విశ్లేషించే ఒక కిట్‌లో రక్తనమూనాను పెడితే- అది విశ్లేషించి.. టైప్‌-1  లేక టైప్‌-2నా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దీని వల్ల కచ్చితమైన చికిత్స, సులువుగా లభిస్తుంది’’ అని చాదక్‌ వివరించారు. ఈ కిట్‌ను తయారుచేయటానికి తాము పరిశోధనలు ప్రారంభించామన్నారు.   - స్పెషల్‌ డెస్క్‌


టైప్‌-1.. టైప్‌-2.. తేడా ఏమిటి?

టైప్‌ 1 మధుమేహ రోగుల్లో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమంలో ఉండే బీటా కణాలపై రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు దాడి చేసినప్పుడు ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది సాధారణంగా చిన్నతనంలోనే బయటపడుతుంది. కొద్ది మందిలో ఇది వారసత్వంగా కూడా సంక్రమిస్తుంది. ఇక టైప్‌ 2 మధుమేహంలో శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ దానిని శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. సాధారణంగా జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి వల్ల ఈ టైప్‌ మధుమేహం ఎక్కువగా వస్తుంది. ఇది సాధారణంగా 45 ఏళ్లు దాటిన తర్వాత బయటపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారికీ టైప్‌-2 మధుమేహం వస్తోంది.


Updated Date - 2020-06-14T07:45:49+05:30 IST