సున్నా రూపాయి నోటు ఉందని మీకు తెలుసా? దానిని ఎందుకు వినియోగిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-02-13T13:33:31+05:30 IST

మీరు ఒక రూపాయి నుండి 2000 రూపాయల నోట్ల..

సున్నా రూపాయి నోటు ఉందని మీకు తెలుసా? దానిని ఎందుకు వినియోగిస్తున్నారంటే..

మీరు ఒక రూపాయి నుండి 2000 రూపాయల నోట్ల వరకూ చూసే ఉంటారు. ఇప్పుడు 1000 రూపాయల నోటు ముద్రణ నిలిపివేశారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 1000 రూపాయల నోటు చలామణీలో ఉండేది. అయితే మీరు ఎప్పుడైనా సున్నా రూపాయి నోటును చూశారా? అలాంటి నోటంటూ ఒకటి ఉంటుందా? అని అలోచిస్తున్నారా? ఒకప్పుడు సున్నా రూపాయి నోట్లను కూడా ముద్రించారు. ఆ నోట్లను ఎందుకు ముద్రించారు? దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 2007 సంవత్సరం నాటి ఘటన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో సున్నా రూపాయి నోట్లను ముద్రించలేదు. 


దక్షిణ భారతదేశంలోని ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సున్నా రూపాయి నోటును ముద్రించింది. తమిళనాడుకు చెందిన ఫిఫ్త్ పిల్లర్ అనే ఈ ఎన్జీవో లక్షల జీరో రూపాయల నోట్లను ముద్రించింది. ఈ నోట్లను హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో ముద్రించారు. ఈ నోటును ముద్రించడం వెనుక ఉద్దేశం అవినీతి, నల్లధనంపై ప్రజలకు అవగాహన కల్పించడమే. అవినీతి, నల్లధనంపై పోరాటంలో సున్నా రూపాయి నోటును ఆయుధంగా మార్చారు. వివిధ భాషల్లో ముద్రించిన ఈ నోట్లపై 'ఎవరైనా లంచం అడిగితే ఈ నోటు ఇచ్చి.. ఈ విషయం చెప్పండి!' అని ప్రచారం చేశారు. సున్నా రూపాయి నోట్లను ముద్రించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సంస్థ ప్రయత్నించింది. వీటిలో 25 లక్షలకు పైగా నోట్లు ఒక్క తమిళనాడులోనే పంపిణీ అయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నోట్లను పంపిణీ చేశారు. ఈ ప్రచారాన్ని ఫిఫ్త్ పిల్లర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు విజయ్ ఆనంద్ ప్రారంభించారు. తమ వాలంటీర్ల ద్వారా.. రైల్వే స్టేషన్లు మొదలుకొని ప్రతి కూడలి, మార్కెట్లలో సున్నా రూపాయి నోట్లను పంపిణీ చేశారు. ఈ నోట్‌లతో పాటు ప్రజల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని ముద్రించిన కరపత్రాన్ని కూడా అందరికీ అందించారు. ఫిఫ్త్ పిల్లర్ సంస్థ గత ఐదేళ్లుగా దక్షిణ భారతదేశంలోని 1200 పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రజలను కలిసి అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థకు మద్దతుగా 5 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ‘నేను లంచం తీసుకోను, ఇవ్వను’ అని ఈ నోట్‌పై రాసి ఉంటుంది.

Updated Date - 2022-02-13T13:33:31+05:30 IST