ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2020-11-01T11:31:41+05:30 IST

ఆదోని నియోజకవర్గంలో 66 ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడుకు ఎంపిక చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది.

ఇంకెన్నాళ్లు?

ఇప్పటికీ పూర్తికాని నాడు-నేడు పనులు

రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

తొలివిడతలో 9, 10 తరగతులకు..


పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనులు చాలాచోట్ల ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పాఠశాలలు తెరిచేలోపు పనులు పూర్తి కావాలని అధికారులు ఆదేశిస్తున్నారేగానీ క్షేత్రస్థాయిలో ముందుకు సాగలేదు. కొన్నిచోట్ల నిధుల్లేక లేక నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. ఇప్పటికిప్పుడు నిఽధులు మంజూరు చేసినా ఇసుక కొరత వేధిస్తోంది. దీనికితోడు అవసరంలేని చోట పనులు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. పనులపై స్థానిక అధికారపార్టీ నాయకులు పెత్తనం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే పూర్తయిన వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నవంబరు 2 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో నాడు-నేడు పనుల పరిస్థితి, అధికారపార్టీ నాయకుల జోక్యంపై కథనం.. 


 ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ నాయకులదే పెత్తనం

ఆదోని(అగ్రికల్చర్‌): ఆదోని నియోజకవర్గంలో 66 ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడుకు ఎంపిక చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ఈ పనుల్లో 70 శాతానికి పైగా అధికార పార్టీవారే చేస్తున్నారు. నాడునేడు పనులలో కాంట్రాక్టర్లు, దళారుల జోక్యం లేకుండా, నేరుగా ప్రధానోపాధ్యాయులే ఇంజనీర్లతో కలిసి అవసరమైన పనులు చేయించుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి పనులను వారే చేయిస్తున్నారు. తాము చెప్పిన చోటే విద్యుత్‌ పరికరాలు, అవసరమైన మెటీరియల్‌ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.


మైదానంలో మట్టి వేసి..

ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాల, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు ఒకే క్రీడా మైదానం ఉంది. వర్షం వచ్చిందంటే ఈ మైదానం చెరువును తలపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి పురపాలక శాఖ నిధులు వినియోగించాలి. కానీ నాడునేడు నిధులను వాడుతున్నారు. నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలకు రూ.96 లక్షలు, మున్సిపల్‌ హైస్కూల్‌కు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. వీటితో మినహా మరుగుదొడ్లు, విద్యుత్‌, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం, డెస్క్‌లు, అదనపు గదులను నిర్మించుకోవాలి. కానీ అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌ పాఠశాల హెచ్‌ఎంపై ఒత్తిడి తెచ్చి అదనంగా మైదానాన్ని బాగు చేసేందుకూ నిధులు తీసుకున్నారు. మైదానంలో ఎర్రమట్టి వేసి చదును చేసేందుకు ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఆ పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు కాలువను నిర్మించలేదు. మధ్యలో కాలువ తవ్వి వదిలేశారు. మెటీరియల్‌ కొనుగోలులోనూ అక్రమాలు జరిగాయని సమాచారం. అవసరం లేని మెటీరియల్‌ కొనుగోలు చేసి, ఆ తరువాత దుకాణదారుకి తిరిగి ఇచ్చేసి సొమ్ము స్వాహా చేశారని ఆరోపణలు వస్తున్నాయి.


పాతవి వదిలేసి..

ఆలూరు: ఆలూరు మండలంలోని ఎంపీపీ మెయిన్‌ స్కూల్‌కు రూ.23.47 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో అదనపు గదులు, మరుగుదొడ్లకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం తదితర అవసరాలకు ఖర్చు చేయాలి. ఇప్పటివరకు రూ.7.92 లక్షలు మాత్రమే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసింది. ఏ పనికి ఎంత ఖర్చు చేయాలో తెలియని ఆయోమయం నెలకొంది. మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి బాగుచేసే అవకాశం ఉన్నా రూ.4,18,814తో కొత్త మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అధికార పార్టీకి చెందిన పాఠశాల కమిటీ చైర్మన్‌ జోక్యంతో ఈ పనులు చేపట్టినట్లు సమాచారం. 


నిబంధనలు గాలిలోకి..

మంత్రాలయం: నియోజకవర్గంలో నాడు నేడు పనులను థర్డ్‌ పార్టీకి ఇచ్చారు. దీంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌, ఇటుకలు, ఎలక్ర్టికల్‌ పరికరాలు, పైపులు తదితర సామగ్రిని అధికార పార్టీ నాయకులు సూచించిన చోటే కొనాల్సి వస్తోందని సమాచారం. పనుల్లో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారి విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిసింది. 


 మంత్రాలయం మండలంలో మొదటి విడత 19 పాఠశాలను నాడు-నేడు కింద ఎంపిక చేశారు. రూ.7 కోట్లు మంజూరు చేశారు. జూలై నాటికి పనులు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ మండలంలో ఇప్పటివరకు ఒక్క పాఠశాలలో కూడా పనులు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. 

 

 మంత్రాలయం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు నాబార్డు ద్వారా రూ.4.5 కోట్లు మంజూరయ్యయి. భూమిపూజ చేసి పనులను అలాగే వదిలేశారు. ఇక్కడ పనులను దక్కించుకున్నది ఒకరైతే పనులు చేపట్టినది ఇంకొకరని తెలిసింది. 


 కలుదేకుంట పాఠశాలకు రూ.21.75 లక్షలు మంజూరయ్యాయి. మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రహరీ కూడా నిర్మించలేదు. ఇటీవల వర్షాల వల్ల పాఠశాలలోకి మోకాల్లోతు నీరు వచ్చింది. 


76 శాతం పూర్తి

పాణ్యం: మండలంలోని 7 గురుకుల పాఠశాలల్లో 76 శాతానికి మించి పనులు పూర్తి కాలేదు. పాణ్యం ఎస్టీ గురుకుల బాలుర పాఠశాల పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాడు నేడు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. బండపరుపు, గోడల నిర్మాణాలు తొలగించారు. ఇసుక లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పాఠశాల ప్రారంభమైతే విద్యార్థులు ఎక్కడ ఉండాలి? తరగతులు ఎక్కడ నిర్వహించాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరగతి గదులే వసతి గదులు కావడంతో సమస్య మరింత జటిలం కానుంది. మోడల్‌ బీసీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు, మినీ గురుకులాలు, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలదీ ఇదే స్థితి. 


రుద్రవరంలో ఎక్కడి పనులక్కడే..:

రుద్రవరం: రుద్రవరం మండలంలో 19 పాఠశాలలను ఎంపిక చేశారు. అయితే ఈ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. అలాగే రుద్రవరం ఉన్నత పాఠశాలను నాబార్డ్‌ కింద ఎంపిక చేశారు. ఆలమూరు ఉన్నత పాఠశాల, చందలూరు, చిన్నకంబలూరు, ఎర్రగుడిదిన్నె, కొండమాయపల్లె, కోటకొండ, మందలూరు, నరసాపురం, పెద్దకంబలూరు, పేరూరు, నాగులవరం పాఠశాలలు, రుద్రవరం కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, శ్రీరంగాపురం, టి.లింగందిన్నె, ఎల్లావత్తుల, ఎల్లావత్తుల ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. మండలంలో నాడు-నేడు పనులకు ప్రభుత్వం రూ.4.47 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు రూ.1.61 కోట్లు పాఠశాలల ఖాతాల్లో బిల్లుల రూపంలో జమ అయ్యాయి. అయినప్పటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. 


 రుద్రవరం ఉన్నత పాఠశాల పనులు అసలే ప్రారంభం కాలేదు. 9 గదులు, ఒక రేకుల షెడ్డులో తవ్వి వదిలేశారు. నాబార్డ్‌ పథకం కింద ఈ పాఠశాల ఎంపికైంది. రూ.99 లక్షల నిధులు మంజూరయ్యాయి. కానీ పాఠశాల మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. 


 పనులు అసంపూర్తిగానే ఉన్నాయి: మహబూబ్‌బాషా, ఇన్‌చార్జి ఎంఈవో, రుద్రవరం 

నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించాం. పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2020-11-01T11:31:41+05:30 IST