అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2020-10-30T10:41:33+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ప్రజలకు సేవలందించాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ సూచించారు.

అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు

ఉద్యోగులకు కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచన


కర్నూలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ప్రజలకు సేవలందించాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వాన్ని వీడాలని అన్నారు. వారం రోజుల పాటు గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవినీతి నివారణకు అవగాహన సదస్సులను నిర్వహించాలని  ఏసీబీ డీఎస్పీ శివనారాయణ సిబ్బందికి సూచించారు. సచివాలయ వ్యవస్థలో అవినీతి నిర్మూలనుపై సంపూర్ణ అవగాహన కల్పిస్తే సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. డివిజినల్‌, మండల స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేసి అవినీతి నిర్మూలన చట్టాల గురించి వివరించాలని సూచించారు.


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల సమావేశాల్లో, గ్రామీణ ఉపాధి కూలీలతో అవినీతి నిర్మూలన అంశాలపై అధికారులు చర్చించాలని సూచించారు. నగరపాలక సంస్థ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి అవినీతి నిర్మూలన గురించి అవగాహన కల్పించాలని సూచించారు. నిజాయితీగా ఉంటామని, చట్టాలను గౌరవిస్తామని, లంచం తీసుకోబోమని జిల్లా అధికారులు ఏసీబీ సిబ్బందితో ఏసీబీ డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, అవినీతి నిరోధక శాఖ అధికారి తేజేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T10:41:33+05:30 IST