కృష్ణమ్మపై వంతెన

ABN , First Publish Date - 2020-10-28T08:39:12+05:30 IST

సిద్ధేశ్వరం-సోమశిల వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రా, తెలంగాణ మధ్య వారధిగా ఉండే ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

కృష్ణమ్మపై వంతెన

సిద్ధేశ్వరం-సోమశిల మధ్య ఏర్పాటు

రూ.800 కోట్లతో జాతీయ రహదారి

కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌


ఆత్మకూరు, అక్టోబరు 27: సిద్ధేశ్వరం-సోమశిల వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రా, తెలంగాణ మధ్య వారధిగా ఉండే ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతమాల పథకంలో భాగంగా రూ.800 కోట్లతో వంతెన, 170 కి.మీ. జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతించినట్లు తెలిసింది. ఇదే జరిగితే సోమశిల-సిద్ధేశ్వరం వంతెన కృష్ణానదిపై అతిపెద్ద అంతర్రాష్ట్ర వంతెనగా గుర్తింపు పొందుతుంది. 1960లోనే సిద్ధేశ్వరం వద్ద భారీ ప్రాజెక్ట్‌ నిర్మించాలని భావించారు. అది కాస్త 70 కి.మీ. దిగువన శ్రీశైలం వద్ద జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మితమైంది. అనాటి నుంచి వంతెన నిర్మాణం ప్రతిపాదన ఉంది. ఒకటి రెండుమార్లు ఆ దిశగా అడుగు పడినా, వివిధ కారణాలతో అటకెక్కింది. తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కల్వకుంట్ల, నాగర్‌ కర్నూలు, కొల్లాపురం నుంచి ఆత్మకూరు వరకు 170 కి.మీ. మేర జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో హైద్రాబాద్‌ నుంచి రాయలసీమ జిల్లాలకు సుమారు 70 కి.మీ. ప్రయాణ దూరం తగ్గనుంది.


ఏళ్లనాటి ప్రతిపాదన..

కృష్ణానదికి ఇరువైపులా ప్రజల మధ్య బంధుత్వాలు ఉన్నాయి. నదిలో పడవల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలు సంభవించాయి. 2007 జనవరి 18న సింగోటం జాతరకు వెళుతుండగా పడవ మునిగి 63 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సిద్ధేశ్వరంపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ.110 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. కానీ వైఎస్సార్‌ మృతి చెందడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.280 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం 2014లో రూ.193 కోట్లు కేటాయించినా ఫలితం లేకపోయింది. 

Updated Date - 2020-10-28T08:39:12+05:30 IST