Abn logo
Oct 27 2020 @ 05:26AM

ప్రైవేటు ట్రావెల్స్‌లో తెలంగాణ మద్యం

హైదరాబాద్‌ నుంచి తరలిస్తుండగా పట్టివేత

218 మద్యం సీసాలు, బస్సు స్వాధీనం 

ఎనిమిది మంది నిందితుల అరెస్టు

నిందితుల్లో ఇద్దరు వలంటీర్లు, రేషన్‌ డీలర్‌


శిరివెళ్ల, అక్టోబరు 26: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి మీదుగా అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని కర్నూలు జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శిరివెళ్ల పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 24వ తేదీ రాత్రి హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు బయలుదేరిన వీఆర్‌సీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 39 టీఏ 7456 నంబరు బస్సులో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఎస్‌ఈబీ(సెబ్‌) అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలులోని తనిఖీ కేంద్రం వద్ద నిఘా వేసినా బస్సు హైవేపై వేగంగా వెళ్లిపోవడంతో వారు చేజింగ్‌ చేశారు. జాతీయ రహదారి వెంట బస్సును వెంబడిస్తూనే నంద్యాల 3వ పట్టణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్‌ఈబీ, నంద్యాల పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు సమయంలో శిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద బస్సును నిలిపివేసి తనిఖీలు చేశారు.


ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన నల్లగట్ల ఇంద్రసేనారెడ్డి, ఆర్ల సుబ్రమణ్యం, కొలిమి హుసేన్‌ బాషా, దుర్వేసుల రామకృష్ణ, అంబారపు ప్రసాద్‌తో పాటు కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్లు వెన్నపూస మహేశ్వరరెడ్డి, షేక్‌ అజామ్‌ బాషా, సహాయకుడు చీమలపెంట శ్రీరాములును అదుపులోకి తీసుకుని 218 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు, తెలంగాణ మద్యం సీసాలు, బస్సును శిరివెళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎనిమిది మంది నిందితులను ఆళ్లగడ్డ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని రిమాండుకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. 


నిందితుల్లో వలంటీర్లు, రేషన్‌ డీలర్‌

అక్రమ మద్యం తరలిస్తున్న కేసులో ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చెందిన ఇద్దరు గ్రామ వలంటీర్లు, ఒక రేషన్‌ డీలర్‌ ఉన్నట్లు తెలిసింది. కోటకందుకూరుకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఈ నెల 23వ తేదీన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ కాచిగూడ వద్ద మద్యాన్ని కొనుగోలు చేసుకుని 11 బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆళ్లగడ్డ చేరుకునేందుకు వీఆర్‌సీఆర్‌ బస్సుకు ఇద్దరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. మరో ముగ్గురికి టిక్‌ట్లకు సరిపడా డబ్బులు లేవని డ్రైవర్లకు రూ.1500 చెల్లించి బస్సులో ఎక్కారు. మద్యం సీసాలు ఉన్న ఏడు బ్యాగులను సీట్ల కింద, మరో నాలుగు బ్యాగులను బస్సు డిక్కీలో పెట్టి తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులకు చిక్కారు. 

Advertisement
Advertisement
Advertisement