బన్ని.. జరుపుకున్నారు

ABN , First Publish Date - 2020-10-27T10:43:20+05:30 IST

దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఆంక్షల నడుమ భక్తులు జరుపుకున్నారు. సోమవారం అర్ధరాత్రి కాగానే భక్తులు ఒక్కసారిగా వచ్చి సింహాసనం కట్టవద్దకు వెళ్లారు.

బన్ని.. జరుపుకున్నారు

ఆంక్షలు ఉన్నా తరలి వచ్చిన భక్తులు

కరోనా విజృంభణతో ఈ ఏడాది రద్దు

స్థానికేతరులను అనుమతించని పోలీసులు

పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌

అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన భక్తులు

గోపరాక్‌ అంటూ సింహాసనం కట్ట వద్దకు..


ఆలూరు, అక్టోబరు 26: దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఆంక్షల నడుమ భక్తులు జరుపుకున్నారు. సోమవారం అర్ధరాత్రి కాగానే భక్తులు ఒక్కసారిగా వచ్చి సింహాసనం కట్టవద్దకు వెళ్లారు. హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. దేవరగట్టు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. కర్ణాటక నుంచి భక్తులు రాకుండా సరిహద్దులోనే అడ్డుకున్నారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో భారీ బందోబస్తు నియమించారు. ఏడుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 73 మంది ఎస్‌ఐలు, 222 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 413 మంది పోలీసులు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు, 224 మంది హోంగార్డులు, స్పెషల్‌ పార్టీ, ఆర్మ్‌డ్‌ పోలీసులు ఆదివారం ఉదయం నుంచే ప్రజలకు అవగాహన కల్పించారు. స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులను ఎక్కడికక్కడ పోలీసులు నిలిపేశారు. 144 సెక్షన్‌ ఉందని, వెళ్లడానికి వీలులేదని అడ్డుకున్నారు. ఆలూరు నుంచి దేవరగట్టు వెళ్లే దారిలో 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కొండపై మాళమల్లేశ్వర స్వామికి ఆదివారం యథావిధిగా పూజలు నిర్వహించారు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించారు. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌ పరిస్థితిని పరిశీలించారు. 


అర్ధరాత్రి కాగానే..

సోమవారం రాత్రి 11 గంటల నుంచే దేవరగట్టు పరిసర గ్రామాల భక్తులు రావడం మొదలు పెట్టారు. 12 గంటలు దాటగానే రింగులు చుట్టిన కర్రలతో డిర్ర్‌డిర్ర్‌డిర్ర్‌ గోపరాక్‌ అంటూ కేకలతో సింహాసన కట్టవద్దకు చేరుకున్నారు. ఆంక్షల వల్ల గతంలో పోల్చితే ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పోలీసులు వారిని నిలుపుదల చేసేందుకు యత్నించినా వీలు కాలేదు. కొండపైకి వెళ్లి మాళమల్లేశ్వరస్వామి కల్యాణో త్సవం జరిపించారు. అనంతరం బన్ని జైత్రయాత్ర మొదలైంది. ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవైపు నెరణికి, నెరణికితండా.. మరోవైపు కొత్తపేట, సులువాయి, ఎల్తార్తి గ్రామాల భక్తులు ఉత్సమూ ర్తులను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. 


పర్యాటక కేంద్రంగా దేవరగట్టు

ఆలూరు: దేవరగట్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మాళమల్లేశ్వర స్వామి ఆలయాన్ని సోమ వారం కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈ ఏడాది కరోనా వల్ల ప్రభుత్వం ఉత్సవాలను రద్దు చేసిందని, వచ్చే ఏడాది యథావిధిగా నిర్వహిస్తామని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు, వైసీపీ ఇన్‌చార్జి గుమ్మనూరు నారాయణస్వామి, మంత్రి కొడుకు ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T10:43:20+05:30 IST