ప్రగతిపుంతలు.. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు

ABN , First Publish Date - 2021-01-27T04:52:40+05:30 IST

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అభివృద్ధే నినాదంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రగతి పుంతలు తొక్కుతోందని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి పేర్కొన్నారు.

ప్రగతిపుంతలు.. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు
కొత్తగూడెంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినుల ప్రదర్శన, ఖమ్మంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసు బలగాలు, జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తున్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్లు ఆర్వీకర్ణన్‌, ఎంవీరెడ్డి

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి) / కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 26 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అభివృద్ధే నినాదంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రగతి పుంతలు తొక్కుతోందని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌,  ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి జాతీయపతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు పోలీసులు, స్కౌట్స్‌ నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వారు తమ తమ జిల్లాల్లో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రగతి కోసం జరుగుతున్న కృషిని వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. అయితే ఈ సారి కొవిడ్‌ నిబంధనల మధ్య గణతంత్ర వేడుకలను నిర్వహించిన అధికారుల అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 

ఫ ఖమ్మంలో కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ గత 11నెలలుగా కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఎన్నో పటిష్ఠ కార్యక్రమాలు చేపట్టామని, లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలిగామని, జిల్లాలో ఇప్పటి వరుకు 42,880మందికి కరోనా వైద్యసేవలందించామన్నారు. జిల్లాలో మొదటి దశగా 4573మందికి వ్యాక్సిన్‌ అందించామన్నారు. గత అక్టోబరు 29నుంచి భూపరిపాలనలో కొత్త శకం మొదలైందని, ధరణితో తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని జిల్లాలో ఇప్పటివరకు 4369రిజిస్ర్టేషన్లు జరిగాయన్నారు. ఖమ్మంలో నెలకొల్పిన ఐటీహబ్‌లో ఇప్పటికే 19కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయని, ఇంజనీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు టీటాస్కు ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. వ్యవసాయ అభివృద్ధి చర్యల్లో భాగంగా 129రైతువేదికలు నిర్మించామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. రైతుబంధు పథకం కింద యాసంగిలో 2,95,407మంది రైతులకు రూ.354.06కోట్లు, రైతుబీమా ద్వారా 1882మంది రైతులకు రూ.94.10కోట్లు అందించామన్నారు. అలాగే వానాకాలం పంటలను 324ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2.58లక్షల టన్నుల ధాన్యం కొన్నామన్నారు. ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. మార్కెటింగ్‌శాఖ ద్వారా పంటలకు ఎనిమిది వ్యవసాయమార్కెట్ల పరిధిలో గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, రూ.36కోట్లతో 60వేల టన్నుల సామర్థ్యం కలిగిన 15గోదాంలు నిర్మించామని, రైతుల సంక్షేమం కోసం 106రైతుమిత్ర కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. అలాగే కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదని, ప్రస్తుతం కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో ఫిబ్రవరి 1నుంచి 9,10, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యమిస్తోందని, ఇప్పటివరకు 5642మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందించామన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యుత్‌రంగం అనుహ్యమైన ప్రగతిసాధించిందని, రూ.10.5కోట్లతో ఏడు 33/11కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేశామన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో 3,238 మంది రైతులకు ఉచిత విద్యుత్‌ సర్వీసులు కేటాయించామన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యతీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌భగీరథ కింద ఇంటింటికి తాగునీరు అందిస్తుందని 969గ్రామాలకు రూ.338.62కోట్లతో నల్లాలు బిగించే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలో 14,555 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరవగా.. ఇప్పటివరకు 6978 ఇళ్ల పనులు ప్రారంభయ్యాయని, 3290 పూర్తిచేశామన్నారు. వైకుంఠదామాలు, పల్లెప్రకృతివనాలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ, మిషన్‌కాకతీయ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీసంక్షేమ శాఖలు, విద్యాశాఖలు, రవాణాశాఖ, పరిశ్రమల అభివృద్ధి, మత్య, పాడి పరిశ్రమ, అటవీసంరక్షణ, ఉద్యాన, క్రీడాశాఖల పరిధిలో తీసుకుంటున్న అభివృద్ధి చర్యల గురించి వివరించారు. నగర పోలీసుకమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌, జిల్లా జడ్జి సీహెచ్‌కే భూపతి, అడిషనల్‌ కలెక్టర్లు మధుసూదన్‌, స్నేహలత, కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగజయంతి, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, తదితరులు హాజరయ్యారు.

కొత్తగూడెంలో భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. జిల్లాలో బీడుభూములను సస్యశ్యామలమే లక్ష్యంగా రూ.13.58కోట్లతో గోదావరిపై సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టామన్నారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరిపై రూ.2,712 కోట్లతో 320 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రానికి త్వరలో శంకుస్థాపన జరగబోతోందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా జిల్లాలోని 1,535 ఆవాస ప్రాంతాల్లోని 2,19,773 ఇళ్లకు తాగునీరందించనున్నామన్నారు. కరోనా కట్టడిలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ విశేషంగా కృష చేసిందని, ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా విజయవంతమవుతోందన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 584మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందించామని, జిల్లాలో 1,32,535 మంది రైతులకు రూ.213.1కోట్ల రైతుబంధు సొమ్మును జమ చేశామన్నారు. రైతుబీమా కింద 127 కుటుంబాలకు రూ.6.35కోట్లు అందించామన్నారు. జిల్లాలో 67 రైతువేదికలను నిర్మించామన్నారు. విద్యార్థులోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్నోవేషన్‌ ప్రాజెక్టు చేపట్టామని, మల్లెలమడుగు పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఎంపికైందన్నారు. ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఈ ఏడాది హరితహారంలో 1.08కోట్ల మొక్కలను నాటామన్నారు. గణతంత్ర వేడుకల్లో విద్యార్థుల సాంస్క్రతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోదులను కలెక్టర్‌ సన్మానించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్లు కె వెంకటేశ్వర్లు, అనుదీప్‌, ఎస్పీ సునీల్‌దత్‌ తదితరులు పాల్గొన్నారు. 


కలెక్టర్‌ కర్ణన్‌కు అవార్డు అందించిన సీపీ

ఎన్నికలకమిషన్‌ నుంచి ఉత్తమ ఎలక్ర్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డుకు ఎంపికైన కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌కు నగర పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ ఆ అవార్డును గణతంత్ర దినోత్సవంలో బహూకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమసేవలందించిన 329మందికి ప్రశంసాపత్రాలను కలెక్టర్‌ కర్ణన్‌ అందించారు. ఐదుగురు జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూశఖలో 14మంది, వైద్యారోగ్యశాఖలో 111మంది, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 130మంది, మునిసిపల్‌శాఖలో 21మంది, పంచాయతీరాజ్‌లో 26మందికి, ఆర్‌పీఎఫ్‌ , రైల్వే, చైల్డ్‌హెల్ప్‌డెస్కులో నలుగురికి, పోలీసుశాఖలో 18మందికి ప్రశంసాపత్రాలను అందించారు. ప్రశంసాపత్రాలుఅందుకున్న వారిలో కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగజయంతి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, ఖమ్మం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి జి.రమేష్‌, కల్లూరు ఆర్డీవో సీహెచ్‌ సూర్యనారాయణ, ఖమ్మం కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ సి.సత్యనారాయణ ఉన్నారు.


సింగరేణి హెడ్డాఫీస్‌ ఆధ్వర్యంలో..

కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ పా) ఎస్‌.చంద్రశేఖర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణి అధికారులకు, కార్మికులకు, కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు తీసుకుంటున్న రక్షణ చర్యలు, కార్మికుల సంక్షేమం, తదితర అంశాల గురించి వివరించారు. వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన 300మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌లో 85 మెగావాట్లు ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానం చేశామని, ఇదే ఏడాదిలో మిగిలిన 215 మెగావాట్ల ప్లాంట్లు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సింగరేణియన్లు, అధికారులను సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ పీపీ) ఎన్‌.బలరాం, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) డి.సత్యనారాయణరావు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకటరావు, కన్వీనర్‌, జీఎం (పర్సనల్‌ వెల్ఫేర్‌ అండ్‌ సీఎస్‌ఆర్‌) కే.బసవయ్య, జీఎం (పర్సనల్‌) ఎ.ఆనందరావు, జీఎం (సెక్యూరిటీ) ఎ.కుమార్‌రెడ్డి, సీఎంవోఏఐ ప్రతినిధి ఎంఆర్‌జీకే. మూర్తి, ప్రాతినిధ్య సంఘం సభ్యుడు శేషయ్య, జనరల్‌ మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T04:52:40+05:30 IST