Abn logo
Sep 25 2020 @ 05:27AM

ట్రాన్స్‌కో ఏడీఈ, ఇద్దరు ఏఈల సస్పెన్షన్‌

విద్యుత్‌ పనుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు

వైరా, సెప్టెంబరు 24: వైరాలో విద్యుత్‌ పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ట్రాన్స్‌కోకు చెందిన ఒక ఏడీఈ, ఇద్దరు ఏఈలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తల్లాడ ఏడీఈ హరీష్‌, వైరా ప్రస్తుత ఏఈ ఎస్‌ఎస్‌ఎస్‌ కుమార్‌, ప్రస్తుతం బచ్చోడు ఏఈగా పనిచేస్తున్న పూర్వపు వైరా ఏఈ జగదీష్‌ సస్పెండయ్యారు. దాదాపు ఏడాదిగా వైరాలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి.


రాజశేఖర్‌నగర్‌, ఆర్‌సీఎం చర్చి ప్రాంతాల్లో మూడు వరుసలు, ఐదు వరుసల తీగల పనులు చేపట్టారు. ఇక్కడ వాస్తవంగా ఐదుకిలోమీటర్ల వరకే ఐదువరుసల తీగల పనులు చేశారు. కానీ ఏడుకిలోమీటర్ల మేర పనులు చేసినట్టు బిల్లులు సమర్పించటంతో ఆ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇటీవల ఖమ్మం ఎస్‌ఈ రమేష్‌ పర్యవేక్షణలో ట్రాన్స్‌కోలోని విజిలెన్స్‌ అధికారులు విద్యుత్‌ తీగల ఆధునికీకరణ పనులపై చేసిన విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.


బిల్లులు సమర్పించే ముందు సరైన పర్యవేక్షణ లేదనే కారణంతో ఏడీఈ హరీష్‌ను అలాగే ఈ పనుల వర్క్‌ఆర్డర్‌ పూర్వపు వైరా ఏఈ(ప్రస్తుతం బచ్చోడు) జగదీష్‌ పేరుతో ఉండటంతో ఆయనను, పనుల నిర్వహణకు సంబంధించి బాధ్యుడిగా ప్రస్తుత ఏఈ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఇక ఈ పనుల కాంట్రాక్టర్‌ నాగరాజుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement