పల్లె, పట్టణ ప్రగతిలో నెంబర్‌వన్‌గా నిలవాలి

ABN , First Publish Date - 2021-06-18T05:42:00+05:30 IST

జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ చిత్తశుద్ధితో పనిచేసి.. పల్లె, పట్టణ ప్రగతి లక్ష్యసాధనలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇరుజిల్లాల అధికారులను ఆదేశించారు.

పల్లె, పట్టణ ప్రగతిలో నెంబర్‌వన్‌గా నిలవాలి
ఇరుజిల్లాల సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌

నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు

ఈనెల 20 తర్వాత సీఎం ఆకస్మిక పర్యటను అవకాశం

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి

పోడు సాగు విషయంలో గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దు

ఇరుజిల్లాల అధికారులతో సమీక్షలో మంత్రిపువ్వాడ 

గిరిజనుల పోడు బాధలు భగవంతుడికే తెలుసు : విప్‌ రేగా

ఖమ్మం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ చిత్తశుద్ధితో పనిచేసి..  పల్లె, పట్టణ ప్రగతి లక్ష్యసాధనలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇరుజిల్లాల అధికారులను ఆదేశించారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణ తీరుపై ఆయన గురువారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 20వతేదీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మికంగా పర్యటించి పల్లెప్రగతి తీరును పరిశీలించే అవకాశం ఉందని, అందుకే అందరూ అప్రమత్తంగా పనిచేయాలన్నారు.  లక్ష్యాలను సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో పరిసరాల పరిశుభ్రత వచ్చిందని, గుణాత్మకమైన మార్పులు వచ్చాయని, గతేడాది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా లాంటి వ్యాధులను నియంత్రించగలిగామన్నారు. అదేస్ఫూర్తితో ఈఏడాదికూడా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల పనులను ఈనెల 20 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్లతోపాటు మండల ప్రత్యేకాధికారులు, అధికారులు పల్లె నిద్ర చేసి గ్రామాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి(సింగరేణి), కామేపల్లి, తిరుమలాయపాలెం, ఏన్కూరు, భద్రాద్రి జిల్లాలోని ఆళ్లపల్లి, పినపాక, జూలూరుపాడు, అశ్వారావుపేట, టేకులపల్లి మండలాల్లో పల్లెప్రగతి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వారంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పల్లెప్రగతిలో నిర్లక్ష్య చేస్తే సర్పంచ్‌, కార్యదర్శులతోపాటు ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామసభలు నిర్వహించాలని, వార్డు కమిటీలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రైవేటు స్థలాల్లో నర్సరీలు ఏర్పాటు చేయొద్దని అన్ని నర్సరీలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. హరితహారం కింద ఉమ్మడి జిల్లాలో 85శాతంమొక్కలు సజీవంగా ఉండేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులకు మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల పరిశుభ్రత బాధ్యత గ్రామ పంచాయతీలదేనని, మునిసిపాలిటీల పరిధిలో ఉంటే ఆసంస్థలదేనని తెలిపారు. సింగరేణి పరిధిలో ఉన్న నిరుపయోగ, శిథిల భవనాలను సత్వరం తొలిగించి గ్రీనరీ అభివృద్ధి చేయాలని కోరారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, అనుదీప్‌ మాట్లాడుతూ జిల్లాల్లో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి పనుల లక్ష్యాలను వివరించారు. డ్రైడే రోజున యాంటీలార్వా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సీజనల్‌ వ్యాధులను నియంత్రించాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములునాయక్‌, హరిప్రియ, ఖమ్మం కార్పొరేషనర్‌ కమిషనర్‌ అనురాగజయంతి తదితరులు పాల్గొన్నారు.

అటవీ భూములపై విస్తృత చర్చ

పల్లె, పట్టణప్రగతి, హరిహారంపై జరిగిన సమీక్ష సమావేశంలో వచ్చిన అటవీభూముల సాగు ప్రస్తావనతో విస్తృతచర్చ జరిగింది. మంత్రి పువ్వాడ తన నియోజకవర్గం ఖమ్మం పరిధిలోని రఘునాథపాలెం మండలంలో ఉన్న సమస్యను వివరిస్తూ ఉమ్మడి జిల్లాలో వివాదస్పదంగా ఉన్న అటవీభూముల విషయంలో అధికారులు తొందరపడవద్దని, అత్యుత్సాహం చూపొద్దని సూచించారు. రెవెన్యూ, అటవీశాఖ ఉమ్మడి సర్వే తర్వాతే వివాదస్పద అటవీభూముల విషయంలో చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. వివాదం లేని అటవీ భూముల్లో కందకాలుతవ్వి మొక్కలు నాటుకోవచ్చని, గిరిజనులు చాలాకాలంగా సాగుచేసుకుంటున్న వాటిని మూడో కేటగిరీగా భావించి జాయింట్‌ సర్వే తర్వాతనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ అటవీభూముల సాగుచేసుకుంటున్న గిరిజనుల బాధలు ఆభగవంతుడికే తెలుసునని, అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు గిరిజనుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో కందకాలు తవ్వించి మొక్కలు వేస్తుండటం బాధాకరమన్నారు.  రెవెన్యూ, అటవీశాఖ జాయింట్‌ సర్వేచేసినప్పుడు రెవెన్యూ భూమి అని తేలినా అటవీ శాఖ అధికారులు వదిలేయడంలేదన్నారు. పినపాక మండలంలోని సర్వే నెంబరు 10లో 8వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ భూమిగా స్వాధీనం చేసుకుని మొక్కలు వేశారని, గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జీవన్‌ధార కింద బోరుబావులు తవ్వించి పోడుసాగుకు సహకరించారని, కానీ ఇప్పుడు అటవీభూములను వివాదం చేస్తున్నారని ఆరోపించారు. తెల్లచొక్కాలు వేసుకున్న పెద్దవారి జోలికిపోరని, నిరుపేద గిరిజనుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములునాయక్‌, బానోతు హరిప్రియ పోడు సాగు సమస్యలను సమావేశంలో వివరించారు. అటవీశాఖ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అమాయక గిరిజనులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-18T05:42:00+05:30 IST