సిరీస్‌పై కన్నేసిన భారత్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై సస్పెన్స్

ABN , First Publish Date - 2022-02-09T03:00:01+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు (బుధవారం) భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే

సిరీస్‌పై కన్నేసిన భారత్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై సస్పెన్స్

అహ్మదాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు (బుధవారం) భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యోచిస్తుండగా, గెలిచి సిరీస్‌ను సమం చేయాలని విండీస్ గట్టి పట్టుదలగా ఉంది.


అయితే, ఇప్పుడు చర్చంతా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ పైనే. తొలి వన్డేకు దూరమైన రాహుల్ రెండో వన్డేకు ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. తుది జట్టులో అతడికి చోటు లభిస్తే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడన్నది చర్చనీయాంశమైంది.


వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. క్వారంటైన్ పూర్తి చేసుకుని రాహుల్, మయాంక్ జట్టులో చేరినట్టు చెప్పినప్పటికీ అంతకుమించిన వివరాలు బయటపెట్టలేదు. తుది జట్టులో వారు ఉంటారా? ఉండరా? అన్న విషయం కూడా చెప్పలేదు. అయితే, ఎవరు ఆడాలో నిర్ణయించేది అంతిమంగా మేనేజ్‌మెంటేనని చెప్పుకొచ్చాడు. వారు తిరిగి జట్టులోకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు.


తొలి వన్డేలో బ్యాటింగ్ చేసినట్టుగా రెండో వన్డేలోనూ ఆడతామని సూర్యకుమార్ అన్నాడు. తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే కాపాడుకోగలిగేంత స్కోరు చేస్తామన్నాడు. తొలి వన్డేలో చక్కగా బ్యాటింగ్ చేశామని, రెండో వన్డేలోనూ అదే టెంపో కొనసాగిస్తామని అన్నాడు. అందులో మార్పు చేయాల్సింది ఏమీ లేదన్నాడు. ఇక, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ విషయానికి వస్తే గత రెండేళ్లుగా అతడి ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. 71వ సెంచరీ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 


గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మాత్రం అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అతడితో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 28 పరుగులు చేశాడు.


బౌలింగ్ విషయానికి వస్తే మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ కోరుకోవడం లేదు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్  సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ చక్కగా రాణించి తొలి వన్డేలో పర్యాటక జట్టును కట్టడి చేశారు.


విండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్ మాట్లాడుతూ.. తాము మరింత బాగా రాణించాలని అన్నాడు. టాపార్డర్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నాడు. అలాగే బౌలింగ్ విషయంపైనా దృష్టి పెట్టాలని అన్నాడు. 


భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసీద్ కృష్ణ, అవేశ్ ఖాన్, షారూఖ్ ఖాన్ 


వెస్టిండీస్ జట్టు: కీరన్ పోలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, ఎన్‌క్రుమా బోనర్, డారెన్ బ్రావో, షమర్హ్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొసైన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కీమర్ రోచ్, రొమారియా షెపర్డ్, ఒడియన్ స్మిత్, హేడెన్ వాల్స్ జూనియర్. 

Updated Date - 2022-02-09T03:00:01+05:30 IST