చాపకింద నీరులా కొవిడ్‌ మహమ్మారి

ABN , First Publish Date - 2021-04-11T05:49:43+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 10: కొవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య వరప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య (జీజీహెచ్‌) ఆసుపత్రిలో రోజురోజుకూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 3 రోజులుగా బాధితు

చాపకింద నీరులా కొవిడ్‌ మహమ్మారి

జీజీహెచ్‌లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ప్రత్యేక కొవిడ్‌ వార్డులో చేరుతున్న బాధితులు

జీజీహెచ్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 10: కొవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య వరప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య (జీజీహెచ్‌) ఆసుపత్రిలో రోజురోజుకూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 3 రోజులుగా బాధితులు చికిత్స కోసం ఆసుపత్రిలో ప్రత్యేక కొవిడ్‌ వార్డులో చేరుతున్నారు. గతేడాది పొడవునా మృత్యుఘంటికలు మోగించిన కరోనా వైరస్‌ ఏడాది చివరికి తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో ప్రారంభంకావడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ విస్తృతంగా వ్యాపించడంతో ఆందోళన ఏర్పడింది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి రెండింతలు పెరుగుతుంది. జిల్లాలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులను వైద్యాధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కోసం పెద్దగా తెలియడం లేదు. గతంలో కూడా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉంటే హోం క్వారంటైన్‌, ఆయాసం, ఊపిరిపీల్చుకునే సమయంలో కష్టంగా ఉంటే జీజీహెచ్‌లో ఉంచి చికిత్స అందించేవారు. సెకండ్‌ వేవ్‌లో 3రోజుల క్రితం వరకు రోజుకు ఒకటి, రెండు పాజిటివ్‌ కేసుల బాధితులు జీజీహెచ్‌లో ఇన్‌ పేషెంట్లుగా చేరి చికిత్స పొందేవారు. ఈనెల 7న 12 మంది, 8న 16మంది, 9న 23మంది ఇన్‌పేషెంట్లుగా చేరడంతో కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన కలుగుతోంది. ఇప్పటి వరకు జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ విభాగం ప్రత్యేక కొవిడ్‌ విభాగంగా ఉండేది. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈఎన్‌టీ, సైకియాట్రీ విభాగాలతో పాటు పిడియాట్రిక్‌, గైనిక్‌, డీవీఎల్‌ విభాగాలను ప్రత్యేక కొవిడ్‌ విభాగాలుగా ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. కొవిడ్‌ నియంత్రణ కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచినట్టు ఆమె చెప్పారు. 


కరోనా భయంతో పాఠశాలకు దూరం 

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని వీర్రాఘవపురం సమీపాన మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల శనివారం తెరిచినప్పటికీ కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి కరోనా సోకడంతో ముగ్గురు విద్యార్థులకు సైతం వ్యాపించింది. పాఠశాలలో మొత్తం 78 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 9 మందికి మాత్రమే చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2రోజులుగా విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంతో మొత్తం 67 మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని మండల విద్యాశాఖాధికారి సలాది సుధాకర్‌ శనివారం సామర్లకోట మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రిని లేఖ ద్వారా కోరారు. 


వాకతిప్పలో టీచర్‌కు కరోనా

వాకతిప్ప (కొత్తపల్లి): వాకతిప్ప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె భర్తకు పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంటాక్ట్‌ కింద ఉపాధ్యాయిని కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఈనెల 1న ఉపాధ్యాయిని పాఠశాలకు విధులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులందరికీ బయోమెట్రిక్‌ వేసే మిషన్‌ ఒకటే ఉండటం, మధ్యాహ్న భోజనం సమయంలో మాస్క్‌లు తీసి తినవడం వంటి కారణాలతో 74 మంది ఉపాధ్యాయులతో పాటుగా 11 మంది విద్యార్థులకు కొత్తపల్లి పీహెచ్‌సీ సిబ్బంది శనివారం పీసీఆర్‌టీ టెస్ట్‌లు నిర్వహించినట్టు ప్రధానోపాధ్యాయురాలు పూళ్ళ అరుణకుమారి తెలిపారు.

Updated Date - 2021-04-11T05:49:43+05:30 IST