పినరయి కేబినెట్‌లో శైలజకు దక్కని చోటు

ABN , First Publish Date - 2021-05-18T19:47:12+05:30 IST

శైలజా టీచర్‌గా కేరళ ప్రజల హృదయాల్లో చోటుదక్కించుకున్న ఆమె.. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా

పినరయి కేబినెట్‌లో శైలజకు దక్కని చోటు

తిరువనంతపురం: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి సమర్థవంతంగా అడ్డుకట్ట వేసి ప్రశంసలు అందుకున్న కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కేకే శైలజకు కొత్త కేబినెట్‌లో చోటుదక్కలేదు. శైలజా టీచర్‌గా కేరళ ప్రజల హృదయాల్లో చోటుదక్కించుకున్న ఆమె.. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. అంతేగాక గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనా ఫస్ట్ వేవ్ అలాగే, నిఫా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ‘రాక్‌స్టార్’ హెల్త్ మినిస్టర్‌గా పేరొందారు. యూకే నుంచి వెలువడే మ్యాగజైన్‌ ఒకటి.. ఆమెను ‘టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020’గా ఎంపిక చేసింది. 


శైలజకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈసారి కూడా హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న వారికి ఈ వార్త మింగుడుపడటం లేదు. దీనిపై ఎల్డీఎఫ్ నేతలు స్పందించారు. యువతరాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, పూర్తిగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమెకు విప్‌గా బాధ్యతలు అప్పగించారని.. ఇది పార్టీ సమష్టి నిర్ణయమన్నారు. ఇదిలా ఉంటే, కొత్త కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్‌లో 21మంది ఉండనున్నారు. సీఎం పినరయి విజయన్ తప్ప మిగిలిన వారంతా కొత్తవాళ్లే కావడం విశేషం.   

Updated Date - 2021-05-18T19:47:12+05:30 IST