Advertisement
Advertisement
Abn logo
Advertisement

కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రోహిత్ సేన

కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చెలరేగిపోయారు.


రోహిత్ అయితే బ్యాట్‌తో వీరంగం వేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు, ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 69 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని శాంట్నర్ విడదీశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన కిషన్ శాంట్నర్ బౌలింగులో సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


ఆ తర్వాత రెండు పరుగులకే సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (4) కూడా శాంట్నర్‌‌కే దొరికిపోయాడు. భారత్ వరుసగా కోల్పోయిన ఈ మూడు వికెట్లు శాంట్నర్‌ ఖాతాలోకే చేరాయి. మరోవైపు, 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్.. సోధీ బౌలింగులో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


శ్రేయాస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) కాసేపు క్రీజులో కుదురుకోవడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివర్లో హర్షల్ పటేల్ 18, దీపక్ చాహర్ 21 పరుగులతో రాణించడంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. శాంట్నర్ మూడు వికెట్లు తీసుకోగా, బౌల్ట్, మిల్నే, ఫెర్గ్యూసన్, సోధి చెరో వికెట్ తీసుకున్నారు.

Advertisement
Advertisement