న్యూజిలాండ్ కకావికలు.. భారత బౌలర్లకు తలవంచిన బ్యాటర్లు

ABN , First Publish Date - 2021-12-04T21:17:59+05:30 IST

భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకు ఆలౌట్ అయింది.

న్యూజిలాండ్ కకావికలు.. భారత బౌలర్లకు తలవంచిన బ్యాటర్లు

ముంబై: భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్‌కు 263 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిన కివీస్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూకట్టారు. క్రీజులోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్ దెబ్బకు వణికిపోయారు. 


రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్ మూడు, అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లలో కైల్ జెమీసన్ చేసిన 17 పరుగులే అత్యధికమంటే కివీస్‌ను భారత్ ఏ విధంగా దెబ్బకొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇద్దరు డకౌట్ కాగా, అజాజ్ పటేల్ (0) నాటౌట్‌గా నిలిచాడు.  


అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్ స్కోరు 221/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నేడు పది వికెట్లు చేజార్జుకుంది. నిన్న నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్.. నేడు మిగతా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. భారత బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశాడు.  

Updated Date - 2021-12-04T21:17:59+05:30 IST