కివీస్‌ను కూల్చిన షమీ.. ముగిసిన ఇన్నింగ్స్

ABN , First Publish Date - 2021-06-23T02:38:03+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇన్నింగ్స్ చివరల్లో టిమ్ సౌథీ కాసేపు దూకుడు ప్రదర్శించడంతో

కివీస్‌ను కూల్చిన షమీ.. ముగిసిన ఇన్నింగ్స్

సౌతాంప్టన్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 249 పరుగుల వద్ద ముగిసింది. ఇన్నింగ్స్ చివరల్లో టిమ్ సౌథీ కాసేపు దూకుడు ప్రదర్శించడంతో కివీస్ ఆమాత్రం పరుగులైనా  చేయగలిగింది. ఫలితంగా భారత్ కంటే 32 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. వర్షం కారణంగా నేడు మ్యాచ్ కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 101/2తో ఐదో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన కివీస్ 117 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి నుంచి ఇండియన్ బౌలర్లు మరింత పట్టు బిగించి బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. 


ముఖ్యంగా మహ్మద్ షమీ కివీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుసపెట్టి కీలక వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. మరోవైపు, ఇషాంత్ శర్మ కూడా బంతికి పదునుపెట్టాడు. వీరిద్దరి దెబ్బకు న్యూజిలాండ్ ఇన్సింగ్స్ పేకమేడలా కూలింది. ఇంకోవైపు క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఇషాంత్‌ వెనక్కి పంపాడు. చివర్లో టిమ్ సౌథీ 46 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో కివీస్ స్కోరు పరుగులు పెట్టింది. రవీంద్ర జడేజా అతడిని బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్సింగ్స్ 249 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా భారత్ కంటే 32 పరుగుల ఆధిక్యం లభించింది. 


భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ 3, అశ్విన్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ డెవోన్ కాన్వే 54 పరుగులు చేయగా, విలియమ్సన్ 49, టామ్ లాథమ్ 30, సౌథీ 30 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్సింగ్స్‌లో 217 పరుగులు చేసింది.

Updated Date - 2021-06-23T02:38:03+05:30 IST