కిట్లు సరే.. పైసలేవీ?

ABN , First Publish Date - 2021-12-09T06:29:45+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం నిర్వహిస్తోంది.

కిట్లు సరే.. పైసలేవీ?
కేసీఆర్‌ కిట్‌లోని సామాన్లు

- సంవత్సరం నుంచి అందని అమ్మఒడి పారితోషకం

- జిల్లా వ్యాప్తంగా నాలుగు విడుతల పైసల కోసం గర్భిణులు, బాలింతల నిరీక్షణ

- నిధుల లేమితో నీరుగారుతున్న అమ్మఒడి


కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 8: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదటి రెండు సంవత్సరాలు ఈ పథకం సక్రమంగానే జరిగినప్పటికీ ప్రస్తుతం నిధుల లేమీతో అభాసుపాలవుతోంది. గర్భిణులకు, బాలింతలకు అమ్మఒడి పథకం కింద అందాల్సిన ప్రోత్సాహకం నగదు ఖాతాలో జమ కాకపోవడంతో చాలా వరకు గర్భిణులు, బాలింతలకు  నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేస్తున్నప్పటికీ ప్రోత్సాహక నగదు మాత్రం అందడం లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా సంవత్సరానికి పైగానే గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నుంచి నాలుగు విడుతల నిధులు రావాల్సి ఉందని సమాచారం.

నిలిచిన చెల్లింపులు

జిల్లాలో అమ్మఒడి పథకం నగదు ప్రోత్సాహానికై చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటున్న గర్భిణులు, బాలింతలు అమ్మఒడి నగదు ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి నగదు అందజేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు అవసరం కానున్నాయి. కొందరికి ప్రసవం జరిగి పుట్టిన బిడ్డకు 12 నెలలు గడుస్తున్నా వారి ఖాతాలో మొదటి విడత డబ్బులు సైతం జమ కావడం లేదు. వైద్యాధికారులు, సిబ్బంది వద్దకు వెళితే తమ పరిధిలో ఈ అంశం లేదని ప్రభుత్వం నుంచి నేరుగా మీమీ ఖాతాలోకి జమ అవుతుందని చెబుతున్నారని వాపోతున్నారు. వెంటనే ఈ నగదు తమ ఖాతాలో జమ చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఐదేళ్ల కిందట అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలు, ఆడపిల్ల అయితే రూ.13 వేలు 4దశల్లో నగదు ప్రోత్సాహంతో పాటు కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తున్నారు. ఫలితంగా సర్కార్‌ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. కానీ ప్రస్తుతం ఈ పథకం కింద ప్రోత్సాహం రాకపోవడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పని చేసే ఆశ కార్యకర్తలు గర్భిణులను గుర్తించి వాటి వివరాలను సంబంధిత ఏఎన్‌ఎంలకు తెలియజేస్తారు. ఏఎన్‌ఎం గర్భిణి వద్దకు వెళ్లి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి నివేదిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రత్యేక  విభాగానికి పంపించి ఆన్‌లైన్‌ ద్వారా పేరు నమోదు చేసి ప్రోత్సాహం నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూస్తారు.

నాలుగు దశల్లో చెల్లింపులు

మూడు నెలల గర్భిణి నుంచి పుట్టిన బిడ్డకు 9 నెలల వరకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు వేయించే వరకు నాలుగు దశలో నగదును ఖాతాలో జమ చేస్తారు. గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్న తరువాత రూ.3వేల ఖాతాలో జమ చేస్తారు. రెండో విడత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే ఆడబిడ్డ అయితే రూ.5000, మగబిడ్డకు రూ.4000, అలాగే రూ.2000 విలువ చేసే కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్నారు. పుట్టిన బిడ్డ మూడు నెలల వయస్సులో అవసరమైన టీకాలు వేయించిన తరువాత రూ.2000, 9 నెలల తరువాత టీకాలు వేయిస్తే మరో రూ.3వేలు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగినట్లు సంబంధిత వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అలాగే తల్లీబిడ్డ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి వీటి ఆధారంగానే చెల్లింపులు చేస్తారు.

Updated Date - 2021-12-09T06:29:45+05:30 IST