Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పొడిబెల్లం

twitter-iconwatsapp-iconfb-icon
పొడిబెల్లం

పంకజాక్షులు సొలసి పలికి నగఁగా -

నింకా నారగించు మిట్లనే అయ్యా! 

పెక్కువగు సైఁదంపు పిండివంటల 

మీఁద పిక్కటిలు మెఱుఁగు బొడిబెల్లములును

వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ 

కిక్కిరియు నిటు లారగించవయ్యా 

నెయ్యి, పొడిబెల్లం, ఒలుపుపప్పు కలిపిన సైదంపు పిండివంటని అరగించమంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో స్వామిని. సైదము అంటే గోధుమపిండి. వండితే అది ‘పెక్కువ’గా ఉందట. పెక్కువ అంటే వర్ధనంగా అంటే లాగితే సాగే విధంగా ఉన్నదని! మెరుగు అంటే నెయ్యి దానిపైన పిక్కటిల్లుతోందట. అంటే వ్యాపించి ఉందని! ‘మెఱుఁగు వేయకగాని మృదువుగాదన్నంబు’ లాంటి కవి ప్రయోగాల్లో ‘మెఱుఁగు’ అంటే నెయ్యి లేదా వెన్న! గోధుమపిండిని ఉడికించి, నెయ్యి, పొడిబెల్లం కలిపి, దాన్నిండా ఒలుపు పప్పు అంటే బహుశా జీడిపప్పు కిక్కిరిసేలా కలిపారట. ఈ వంటకానికి పేరు రాయలేదు అన్నమయ్య! అది ఇప్పటి హల్వా లాంటిది కావచ్చు.


13వ శతాబ్దిలో ‘ముహమ్మద్‌ బీన్‌ హసన్‌ అల్‌ బాగ్దాదీ’ రాసిన అరబిక్‌ వంటల పుస్తకం ‘ఓజ్ట్చీఛ ్చజూఖ్చీఛజీజుజి’ లో హల్వా ప్రస్తావన మొదట కనిపిస్తుందని ఆహార చరిత్రకారులు చెప్తారు. అరబిక్‌ పదం జిఠజూఠీ అంటే తీపి అని. నిజానికి ఈ హల్వా అనే పేరు అరబిక్‌ పాలకుల వలన సంక్రమించి ఉండవచ్చుగానీ ఈ వంటకం మనకు కొత్తదేమీ కాదు. శ్రీనాథాదులు ప్రస్తావించిన ఉక్కెర లాంటి వంటకాలు ఈ హల్వాని పోలినవి మనకూ ఉన్నాయి! అన్నమయ్య ఈ తీపి వంటకం తయారీని మాత్రమే ప్రస్తావించాడిక్కడ. బహుశా పొడిబెల్లంతో దీన్ని వండటం గురించి నొక్కి చెప్పటం ఆయన ఉద్దేశం కావచ్చు.


బెల్లాన్ని ‘గుడం’ అంటారు. సుగుడం అంటే తెల్లని బెల్లం. సుగర్‌ అనే పదానికి ఇదే మూలం కావచ్చు. ఆయుర్వేద సంహితా కారులైన చరక, శుశ్రుత, వాగ్భటాదుల కాలానికి చక్కెర తెలీదు. తరువాతి కాలంలో వ్యాఖ్యాతలు చక్కెరకన్నా బెల్లమే ఆరోగ్యానికి మేలైనదిగా భావించారు. అన్నమయ్య (మే 9,1408-ఫిబ్రవరి 23,1503) కాలానికి బెల్లం కన్నా పొడిబెల్లం శ్రేష్ఠమైనదనే గుర్తింపు ఉందని కూడా అర్థం అవుతోంది. జాగరీ పౌడర్‌ పేరుతో మార్కెట్లో మనకు దొరికేది పొడి బెల్లమా? లేక బెల్లం పొడా? తెలీదు. ఏదైనా తేమ లేకుండా ఉన్నది నాణ్యమైనదిగా భావించాలి!  


బెల్లం తయారీలో పలుకు (ఇటడట్ట్చజూజూజీుఽజ్టీడ) ఎక్కువగా ఉండేలా బాగా కలియబెడుతూ వండితే పొడిబెల్లం వస్తుంది. అలా వండినందు వలన పొడిబెల్లంలో తేమ ఉండదు. తేమలేని పొడిబెల్లం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఆరోగ్య దాయకంగా ఉంటుంది. సాధారణ గుడంలో మైదాని, సూపర్‌ ఫాస్ఫేటుని, సోడియం బైకార్బనేటుని, సోడియం హైడ్రో సల్ఫేటుని, కాల్షియం కార్బోనేట్‌ అనే సున్నపు పదార్థాన్ని, రంగురసాయనాల్ని ఇంకా మనకు తెలీని చాలా రసాయనాలను కల్తీ కలిపే ప్రమాదం ఉంది. బహుశా పొడిబెల్లంలో ఇంత కల్తీ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. మామూలు బెల్లాన్ని మెత్తగా దంచితే ముద్ద కడుతుందే గానీ పొడిపొడిగా అవదు. అందుకే, అన్నమయ్య ‘బెల్లం పొడి’ అనకుండా ‘పొడిబెల్లం’ అన్నాడు. అంటే తడి లేని బెల్లం అని!     


చక్కెర (గ్లూకోజు) కన్నా, బెల్లం (సుక్రోజు) కన్నా, చక్కగా వండిన పొడిబెల్లం ఆరోగ్యదాయకమైనది. గ్లూకోజు రక్తంలో తక్షణం చేరిపోయి అధికశక్తినిస్తుంది. కానీ, దానివలన వచ్చే శక్తి ఎక్కువ సేపు నిలవదు. బెల్లంలోని సుక్రోజు ఆలస్యంగా రక్తంలోకి చేర్తుంది. కానీ, దాని వలన వచ్చే శక్తి ఎక్కువ సేపు ఉంటుంది. శరీరం శిథిలం కాకుండా, ముసలి తనం ముంచుకు రాకుండా కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఎలర్జీ వ్యాధుల్లో మేలు చేస్తుంది. బీపీని తగ్గిస్తుంది. లివర్‌, ఊపిరితిత్తు ల్లాంటి అవయవాలను బలసంపన్నం చేస్తుంది. అల్లం, బెల్లం, మిరియాల పొడి కషాయం తాగి చాలామంది కరోనాబారి నుండి తమని తాము కాపాడుకోగలిగారు. ఇనుము, ఫాస్ఫరస్‌, విటమిన్లు, కాల్షియంపుష్కలంగా ఉండే పొడిబెల్లం ప్రశస్తిని అన్నమయ్య ఈ కీర్తనలో చాటి చెప్పాడు. 

 - డా. జి వి పూర్ణచందు, 94401 72642

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.