ముద్దుల మావయ్యా ఇదేం పనయ్యా?

ABN , First Publish Date - 2022-07-04T09:23:42+05:30 IST

‘రాష్ట్రంలో విద్యార్థులను చదివించే బాధ్యత మేనమామగా తాను తీసుకుంటానని చెప్పి, కనిపించిన వాళ్లను కౌగిలించుకుని ముద్దులు పెట్టిన ముద్దుల...

ముద్దుల మావయ్యా ఇదేం పనయ్యా?

విదేశాల్లో చదివే విద్యార్థులకు డబ్బులివ్వరా?

విదేశీ విద్యకు మంగళం పాడేశారు

డబ్బు పంపలేక తల్లిదండ్రులు విలవిల

నేను తప్పులు ఎత్తిచూపితే కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారు

 సంస్కారం నా నోరు కట్టేస్తోంది

 ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు

 అధికారమిస్తే బాధ్యత గల పాలన ఇస్తాం

 ‘జనవాణి’లో పవన్‌ కల్యాణ్‌ భరోసా


విజయవాడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో విద్యార్థులను చదివించే బాధ్యత మేనమామగా తాను తీసుకుంటానని చెప్పి, కనిపించిన వాళ్లను కౌగిలించుకుని ముద్దులు పెట్టిన ముద్దుల మావయ్య విదేశాల్లో తిరుగుతున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. వారికి వారి కుటుంబాలు డబ్బులు పంపలేక ఇబ్బంది పడుతున్నాయి’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేదని.. మేధావులు, యువత, విద్యావంతులు ఒక సమూహంగా ఏర్పడితే వైసీపీ చెర నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి పనిలో లాభం ఆశించే వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సంబంధించి విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జనవాణి భరోసా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికి ముందు, స్వీకరించిన అనంతరం పవన్‌ ప్రసంగించారు. ముద్దులు, కౌగిలింతలు, అక్క, చెల్లెమ్మ అనే పిలుపులు ప్రజలకు అవసరం లేదని.. వారికి హక్కులు, చట్టభద్రత కల్పించాలని సూచించారు. తప్పులు ఎత్తిచూపిస్తే వైసీపీలో ఉన్న కాపు నాయకులతో తనను బూతులు తిట్టిస్తున్నారన్నారు. కొన్ని విషయాల్లో సంస్కారం తన నోరు కట్టేస్తోందని చెప్పారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి, కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   వైసీపీ ప్రభుత్వం పోలీసులను నిస్సహాయులుగా మార్చేసిందని ఆరోపించారు. 


వాటికి జనసేన భయపడదు

ధైర్యం లేక గూండాయిజానికి, దగాకోరులకు రాష్ట్ర ప్రజానీకం భయపడుతున్నారని.. వాటికి జనసేన భయపడబోదని పవన్‌ చెప్పారు. సీఎం జగన్‌ కాపులకు విపరీతమైన ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించినవారికి కాపు కార్పొరేషన్‌ నుంచి రుణాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు భరోసా కల్పించినప్పుడే ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. జనసేనకు అధికారం ఇస్తే కచ్చితంగా బాధ్యత కలిగిన పాలన అందజేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.


ఇన్ని అర్జీలా..?

పంటలకు గిట్టుబాటు ధర లేదని, రూ.50వేలు-లక్ష కట్టించుకుని టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని, పరిశ్రమలకు భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని, పంచాయతీరాజ్‌, విద్యాశాఖ, రెవెన్యూ శాఖలకు సంబంధించి సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చారని పవన్‌ వెల్లడించారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా 151 మంది ఎమ్మెల్యేలు కాలాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ‘జనవాణి భరోసాలో 425 మంది అర్జీలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో 98శాతం సమస్యలు పరిష్కారమవుతున్నాయని చెబుతోంది. మరి నేను నిర్వహించిన కార్యక్రమానికి అన్ని అర్జీలు ఎందుకొచ్చాయి’ అని సర్కారును నిలదీశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కౌలు రైతు  బాలినేని అశోక్‌కుమార్‌రెడ్డి పురుగుల మందు తాగి మరణించగా, ఆయన భార్య కూడా ఆత్మహత్యకు యత్నించి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కుమారులు జనవాణి భరోసాలో పవన్‌ను  కలవగా రూ.లక్ష చెక్కును అందజేశారు.


విజయవాడ చుట్టూ ఇంత కాలుష్యమా..?

ఒకప్పుడు కాలుష్యం అంటే హైదరాబాద్‌ జీడిమెట్ల గుర్తుకొచ్చేదని.. ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం జీడిమెట్లను దాటిపోయిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  30-35 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదని చెప్పారు. విజయవాడలో బస్టాండ్‌లో ప్రయాణికులు దిగగానే ఎదురుగా మద్యం షాపులు కనిపిస్తున్నాయన్నారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాన్నారు. కబేళా ఉన్నప్పటికీ దానికి ప్రహరీ లేదన్నారు. నిత్యం నోరు పారేసుకునే మాజీ మంత్రి.. పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. గోవులకు బొట్లు పెట్టి, పూజలు చేసే వ్యక్తులు ఇక్కడ గోవధ జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. రాజధానిని ఆనుకుని ఉన్న మంగళగిరిలో తొమ్మిది అడుగులు తవ్వితే మురుగునీరు వస్తోందన్నారు. 

Updated Date - 2022-07-04T09:23:42+05:30 IST