పరిశోధన ఫలితాలను అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2021-03-05T06:43:50+05:30 IST

వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను రైతులంతా అంది పుచ్చుకొని వ్యవసాయం చేస్తే లాభసాటి ఫలితాలు ఉంటాయని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు పి.రాంబాబు అన్నారు.

పరిశోధన ఫలితాలను అందిపుచ్చుకోవాలి
కిసాన్‌ మేళాకు హాజరైన వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, డైరెక్టర్లు

  1.   యాంత్రీకరణతో  లాభసాటి వ్యవసాయం
  2.   ఎన్జీ రంగా వర్సిటీ విస్తరణ సంచాలకుడు రాంబాబు
  3.  నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కిసాన్‌ మేళా


నంద్యాల, మార్చి 4: వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను రైతులంతా అంది పుచ్చుకొని వ్యవసాయం చేస్తే లాభసాటి ఫలితాలు ఉంటాయని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు పి.రాంబాబు అన్నారు. గురువారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్‌ మేళా నిర్వహించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ టి.మురళీకృష్ణ  అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అగ్రీ వర్సిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల పంటల్లో నూతన వంగడాల సృష్టికి విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధనల ఫలితాలను రైతులందరూ పాటిస్తే లాభసాటి వ్యవసాయం సులభతరమవుతుందన్నారు. వ్యవసాయ శాఖ సంయుక్త సహసంచాలకుల ప్రతినిధి డాక్టర్‌ బోసుబాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో వివిధ ప్రభుత్వ పథకాలు, ఈ క్రాప్‌ బుకింగ్‌, సీడ్‌ విలేజ్‌ పోగ్రామ్‌ల గురించి రైతులకు వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను రైతులకు చేరే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏడీఆర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ద్వారా వివిధ రకాల పంటల్లో ఆవిష్కరించిన వంగడాల ప్రగతి, ప్రాధాన్యం గురించి వివరించారు. ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటరమణ మాట్లాడుతూ పండ్ల తోటల సాగు, కోల్డ్‌ స్టోరేజ్‌, నీటి కుంటల గురించి రైతులకు వివరించారు. పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ రమణయ్య మాట్లాడుతూ ఆర్గానిక్‌ డెయిరీ, పశువులకు కృత్రిమ గర్భధారణ తదితర అంశాలను వివరించారు. అగ్రీవర్సిటీ పాలక మండలి సభ్యులు చెంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పురోభివృద్ధిలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాంత్రికీకరణ పని ముట్లను రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఉత్పాదన పెరిగే విధానాలు, మార్కెటింగ్‌పై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని కోరారు. 


స్టాళ్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ 


కిసాన్‌ మేళా సందర్భంగా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పరిశీలించారు. ఏడీఆర్‌ మురళీకృష్ణ, అగ్రీవర్శిటీ ప్రతినిధులు ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రగతిని సబ్‌ కలెక్టర్‌కు వివరించారు. వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పని తీరును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-05T06:43:50+05:30 IST