రామప్ప దేశానికే గర్వకారణం

ABN , First Publish Date - 2021-10-22T05:43:26+05:30 IST

రామప్ప దేశానికే గర్వకారణం

రామప్ప దేశానికే గర్వకారణం
రామప్ప ఆలయాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

యునెస్కో గుర్తింపు కోసం అధికారుల శ్రమ మరువలేనిది

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం

దేశీయ పర్యాటకులకు విమాన చార్జీల్లో రాయితీ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ  మంత్రి జి.కిషన్‌రెడ్డి

రామప్ప రుద్రేశ్వరాలయ సందర్శన


ములుగు, అక్టోబరు 21 :  తెలుగు రాష్ర్టాల్లోనే మొట్ట మొదటిసారిగా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దేశానికే గర్వకారణమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.  రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత తొలిసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం రామప్పను సందర్శించారు. రాష్ట్ర పర్యాటక, పురావస్తు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి రామప్పకు వచ్చిన కిషన్‌రెడ్డికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ శిల్పసంపదను ఆసక్తిగా తిలకించారు. 


అనంతరం రామప్ప ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక పైనుంచి కిషన్‌రెడ్డి మాట్లాడారు. రామప్పను తొలుత చాలా దేశాలు వ్యతిరేకించాయని, స్వయంగా ప్రధానమంత్రి ఆయా దేశాల అధినేతలతో మాట్లాడారని, పీఎం కార్యాలయ అధికారులు, విదేశాంగ మంత్రి జైశంకర్‌ రంగంలోకి దిగి ఫైనల్‌ ఓటింగ్‌లో రామప్పకు ఓటేసేలా ప్రతినిధులను ఒప్పించారని తెలిపారు. కేంద్ర పురావస్తు డైరెక్టర్‌ జనరల్‌ విద్యావతి, కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్‌ రూపేందర్‌, మీనాక్షీ లేఖి విశేష కృషి చేయగా.. యూనెస్కోలో మనదేశ ప్రతినిధి విశాల్‌శర్మ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి ప్రపంచ పర్యాటక పటంలో రామప్పను గొప్పగా నిలిపారని తెలిపారు. అలాగే కేంద్రప్రభుత్వ, పురావస్తు శాఖ అధికా రులు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ప్రతినిధులు పాండురంగారావు, పాపారావుల శ్రమ మరవలేనిదని  పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రామప్పను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని వివంచారు. ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గిరిజన దర్శన్‌లో భాగంగా గట్టమ్మ దేవాలయం నుంచి బొగత జలపాతం వరకు రూ.80 కోట్ల నిధులతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.


రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, వరంగల్‌ కోటలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసేం దుకు ప్రత్యేకశ్రద్ధ చూపుతామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చారిత్రక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని పురాతన కట్టడాలు, ప్రదేశాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వరంగల్‌లో విమానాశ్రయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇది వినియోగంలోకి వస్తే విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారన్నారు. రామప్ప సందర్శను వచ్చే దేశీయ పర్యాట కులకు విమానచార్జీలపై రాయితీ ఇస్తామని వెల్లడించారు.


శిలాఫలకం ఆవిష్కరణ..

రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన వివరాలతో కూడిన శిలా ఫలకాన్ని  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా రామప్పలో చేపట్టే మౌలిక సదుపాయాలకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. రామప్పకు యునెస్కో గుర్తింపును సాధించిపెట్టడంలో కృషి చేసిన పాండు రంగారావుతోపాటు పలువురిని ఈ సందర్భంగా శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. 


12 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్‌

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉధృతంగా సాగుతోందని, ఈ రోజు వరకు 100 కోట్ల డోసులను పంపిణీ చేసి రికార్డు సృష్టించామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే వ్యాక్సిన్‌ సిద్ధమైందని, త్వరలోనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు ఏదైనా మందు, వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాల వైపుకు చూసే పరిస్థితి ఉండేదని, కానీ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో మనదేశంలోనే వ్యాక్సిన్‌లు తయారయ్యాయని తెలిపారు. ప్రధాని మోదీ కృషివల్లే ఇది సాధ్యమైందని వివరించారు. 


తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతాం.. : వి.శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర పర్యాటక శాఖ  మంత్రి

తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రపంచానికి చాటిచెబుతామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. 2016లో తొలిసారి రామప్పపై డోసియర్‌ రూపొందించిన కాకతీయ హెరిటేజ్‌ టస్ర్టు ప్రతినిధులు పాండురంగారావు, పాపారావులు రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు కోసం కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు సాధ్య మైందని తెలిపారు. కాకతీయ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి, యాదాద్రి నుంచి బొగల జలపాతం వరకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రామప్పతో పాటు వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట, సోమశిల, మేడారం, గోల్కొండ కోట, చార్మినార్‌లకు కూడా యూనెస్కో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందన్నారు.  రామప్ప పరిసరాల్లో 50 ఎకరాల స్థలాన్ని సేకరించామని, ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలతో పర్యాటకులకు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.  మన్నెంకొండ దేవస్థానం, భద్రాచలంను కూడా యునెస్కో పరిశీలనకు పంపిస్తామన్నారు.   


మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి : సీతక్క

మధ్య భారతదేశంలోని అత్యధిక రాష్ర్టాల భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించి అభివృద్ధి చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. ములుగు జిల్లా కేంద్రంలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలని, రామప్పలో దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. 30 పడకలతో ఆస్పత్రిని నిర్మించాలని కోరారు.  ములుగుకు మంజూరైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం తరగతులను ప్రారంభింపజేయాలని సీతక్క కోరారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సగుప్త, కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌ జనరల్‌ విద్యావతి, జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌, సర్పంచ్‌ డోలి రజిత, ఎంపీపీ బుర్రి రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పురావస్తు శాఖ అధికారులు శిల్ప ఎస్‌.కుమార్‌, జి.మహేశ్వరి, రాజసూరి, గోపీనాథ్‌, సుశాంత్‌కుమార్‌, ఎస్‌కె జిలానీ, తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీలు పి.సాయిచైతన్య, రూపేష్‌, గౌష్‌ఆలం సీఐలు, ఎస్సైలతో బందోబస్తును పర్యవేక్షించారు.




Updated Date - 2021-10-22T05:43:26+05:30 IST