కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్త వ్యూహం

ABN , First Publish Date - 2020-10-15T17:29:12+05:30 IST

బల్దియా ఎన్నికల కోసం కేంద్ర మంత్రి కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? తన పొలిటికల్‌ గ్రాఫ్‌ మార్చిన సికింద్రాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఓటర్లు..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు పలుకుతారని భావిస్తున్నారా?

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్త వ్యూహం

బల్దియా ఎన్నికల కోసం కేంద్ర మంత్రి కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? తన పొలిటికల్‌ గ్రాఫ్‌ మార్చిన సికింద్రాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఓటర్లు..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు పలుకుతారని భావిస్తున్నారా? ఇంతకీ ఆయన ఏ నినాదంతో ముందుకు వెళ్లబోతున్నారు? గ్రేటర్‌ ఎన్నికల్లో ఆయన హవా ఉంటోందా? మైనార్టీ ఓట్లు కూడా కమలం పార్టీకి అని లెక్కలు వేస్తున్న కిషన్‌ రెడ్డి అభివృద్ధి అజెండా ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం...


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో జోష్‌ మీదున్న అధికార పార్టీ...రాష్ట్రంలో జరగనున్న వరుస ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ..అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు సమాయత్తమవుతోంది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్‌గా మారనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. గ్రేటర్ పరిధిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఉండటమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటిచేసి కిషన్ రెడ్డి ఓటమి చెందారు. ఆ తర్వాత 6 నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటిలేటర్‌పై ఉన్న కమలం పార్టీకి 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడంతో  ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీకి.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర కీలకమని పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుందట. అందుకుతగ్గట్లే బల్దియా ఎన్నికలను ఆయన సీరియస్‌గా తీసుకుని వ్యూహాలకు పదునుపెడుతున్నారట. వాస్తవానికి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఆ సమయంలో నగరంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ గ్రేటర్‌ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం సిటీలో రాజాసింగ్ రూపంలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి వైపే అందరి దృష్టి పడింది. ఆయనే కమలం పార్టీకి పెద్ద దిక్కుగా మారారని పార్టీ వర్గాలంటున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలో 38 డివిజన్లున్నాయి. సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్ పేట్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డివిజన్లు గెలుస్తారనేది కిషన్ రెడ్డికి సవాల్‌గా మారిందట. నాంపల్లి మినహా..మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మంచి ఓట్లు లభించాయి. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లపై కేంద్రమంత్రి దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అధికార పార్టీ తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి.గత ఎన్నికల్లో నెరవేర్చని హామీలపై ప్రశ్నించాలని పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారట.    


మరోవైపు ఎంఐఎం పార్టీ అంటే ఒంటికాలుపై లేచే కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగా నగర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత తమ పార్టీదే అనీ..మైనార్టీ మహిళల సాధికారత కోసం పాటుపడుతున్నామనీ ప్రచారం చేయాలని భావిస్తున్నారట. తద్వార మైనార్టీల ఓట్లు బీజేపీకి పడేలా చేయాలన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. కేవలం మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్నారట. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి హోదాలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు‌. బ్యాంకర్లతో సమీక్షలు, మెట్రో రైల్ అధికారులు, నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. తాజాగా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు. హైదరాబాద్ అభివృద్ధిలో‌ కేంద్రంలో ఉన్న బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరోవైపు సిటీలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్‌తో కలసి కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. దీని ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అంటున్నారు.   


ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో సత్తా చాటుతారా? తన పార్లమెంట్‌ నియోజకవర్గం సికింద్రాబాద్‌కే పరిమితమవుతారా లేక..మిగితా డివిజన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారా అనే చర్చ బీజేపీలో నడుస్తోంది. మొత్తంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి. 

Updated Date - 2020-10-15T17:29:12+05:30 IST