విజయసాయిరెడ్డి ప్రశ్నకు విచిత్రమైన సమాధానం చెప్పిన కిషన్‌రెడ్డి!

ABN , First Publish Date - 2021-07-23T16:44:00+05:30 IST

ఉత్తరాంధ్ర..

విజయసాయిరెడ్డి ప్రశ్నకు విచిత్రమైన సమాధానం చెప్పిన కిషన్‌రెడ్డి!

పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు లేవట!

పార్లమెంటులో కేంద్ర మంత్రి సమాధానం

రూ.156 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి ప్రతిపాదించినట్టు చెబుతున్న రాష్ట్రం 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, భీమిలి-భోగాపురం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా?...అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి...విచిత్రమైన సమాధానం చెప్పారు. అటువంటి ప్రతిపాదనలు ఏమీ తమ వద్ద లేవన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అరకు టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి రూ.156 కోట్లు ‘స్వదేశీ దర్శన్‌’ కింద మంజూరుచేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపింది. 


ఎస్‌.కోట మొదలుకొని అనంతగిరి, బొర్రాగుహలు, అరకులోయ, పాడేరు, లంబసింగి వరకు టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు అనేక వసతులు సమకూరుతాయన్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచనల మేరకు అధికారులు ప్రతిపాదనలు తయీరుచేశారు. అందులో ఎస్‌. కోట ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద పర్యాటకులకు రోడ్‌సైడ్‌ ఎమినిటీస్‌, సుంకరమెట్ట వద్ద స్కై లైనర్‌, వెల్‌నెస్‌ సెంటర్లు, ప్రస్తుతం పర్యాటక శాఖ నిర్వహిస్తున్న రిసార్టులు, అరకులోయ, జలపాతాలు, పాడేరు, లంబసింగి.. ఇలా అన్నింటిని విడివిడిగా ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నదీ వివరించారు. దీనిపై అరకు ఎంపీ మాధవి కూడా ఢిల్లీలో పెద్దలను కలిసి మాట్లాడారు. అవసరమైతే ప్రతిపాదనలు మరోసారి పంపుతామని చెప్పారు. తీరా ఇప్పుడు మరో ఎంపీ అడిగేసరికి...ఎటువంటి ప్రతిపాదనలు లేవని సమాధానం ఇచ్చారు. 


ప్రతిపాదనలతో మళ్లీ కలుస్తాం: ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా తెలుగువారైన కిషన్‌రెడ్డి బాధ్య తలు చేపట్టినందున ఎక్కువగా నిధులు కేటాయిస్తారనే ఆశాభావం ఉంది. విశాఖపట్నం, ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అవసరం. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలతోపాటు కొత్తవాటిని కూడా జతచేసి కేంద్ర మంత్రిని కలుస్తాం. వీలైనన్ని ఎక్కువ నిధులు సాధిస్తాం.

Updated Date - 2021-07-23T16:44:00+05:30 IST