ఈ-కేవైసీ పూర్తిచేస్తేనే ‘కిసాన్‌ సమ్మాన్‌’

ABN , First Publish Date - 2022-05-13T05:13:23+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి నగదును కేంద్ర సర్కారు రైతుల ఖాతాల్లో యేటా మూడుసార్లు జమచేస్తుంది.

ఈ-కేవైసీ పూర్తిచేస్తేనే ‘కిసాన్‌ సమ్మాన్‌’

మెదక్‌ జిల్లాలో 1,03,324 మంది రైతులు 

ఈ-కేవైసీ చేయించుకున్నది 20వేల మందే!

ఈ నెల 31 వరకు గడువు 

ఆధార్‌ అనుసంధానం చేస్తేనే ఖాతాల్లో ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ జమ


మెదక్‌, మే 12 : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి నగదును కేంద్ర సర్కారు రైతుల ఖాతాల్లో యేటా మూడుసార్లు జమచేస్తుంది. ఈ పథకం సక్రమంగా కొనసాగడానికి రైతులు ఈ-కేవైసీ ధ్రువీకరణ చేయించుకోవాలి. అయితే 11వ విడత రైతుల ఖాతాల్లో నగదు జమ కావడానికి ఈ నెల 31లోగా ఈ-కేవైసీ ధ్రువీకరణకు వ్యవసాయశాఖ వెసులుబాటు కల్పించింది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 1,03,324 మంది రైతులు ఉండగా వీరిలో 20వేల మంది రైతులే ఈ-కేవైసీ ఽధ్రువీకరణ చేసుకున్నారు. ఇంకా 83వేల మంది రైతులు తమ ఈ-కేవైసీ లింక్‌ చేసుకోలేదు. ఇంత కాలం ఆధార్‌ లింక్‌ ఉన్న రైతులు 92,124 మంది. బ్యాంక్‌ ఖాతాల్లో సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేయకపోవడం, మృతిచెందిన వారి వివరాలు అలాగే కొనసాగడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేయించుకున్న లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడుసార్ల చొప్పున రూ.6వేలు అందిస్తుంది. ఇకపై ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాల్లో నగదు జమకానున్నట్లు అధికారులు తెలిపారు. 


నమోదు ఇలా..

ఈ-కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్‌ ద్వారా చేసుకోవడానికి పీఎం కిసాన్‌ పోర్టల్‌, పీఎం కిసాన్‌ యాప్‌ను తీసుకొచ్చారు. నేరుగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ ద్వారా ఓటీపీ సాయంతో చేసుకునే అవకాశం ఉంది. నిరక్ష్యరాస్యులు, సెల్‌ఫోన్లలో చేసుకోలేని వారు మీ సేవా కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మండల విస్తీరణ అధికారులకు సూచించింది. అయితే సొంతంగా ధ్రువీకరణ చేసుకోవడానికి పీఎం కిసాన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేసి అందులో ఫార్మర్‌ కార్నర్‌ను క్లిక్‌ చేయాలి. రైతు ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి.  ఆ వెంటనే సెర్చ్‌ బటన్‌ను నొక్కి ఆధార్‌కు అనుసంధానం అయిన సెల్‌ఫోన్‌ నెంబర్‌ను నమోదు చేసి ఓటీపీ కోసం క్లిక్‌ చేయాలి. ఓటీపీని నమోదు చేసి ఆధార్‌ ఓటీపీ కోసం మరోసారి క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత దాన్ని నమోదు చేసి క్లిక్‌ చేయాలి. అనంతరం ఈ-కేవైసీ సక్సెస్‌ అని వస్తుంది.


ఈ నెల 31లోపు ధ్రువీకరణ పొందాల్సిందే

- పరశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి రైతులు ఖాతాల్లో జమ కావాలంటే అర్హులైన వారంతా ఈనెల 31లోగా ఈ-కేవైసీ తప్పక ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇందుకు సంబంధించి పీఎం కిసాన్‌ పోర్టల్‌, పీఎం కిసాన్‌ యాప్‌ అందుబాటులో ఉంది. మీసేవా కేంద్రాల్లోనూ బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. అవినీతి, అక్రమాలకు తావు ఉండకూడదనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.

Read more